చురకలు

చురకలు
*********
ప్రజాస్వామ్యంలో తీర్పు గుప్పెడు ప్రజలదేనని
అనుభవిస్తున్న గంపెడు ప్రజలకే తెలుసు
*                 *                   *
జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేలా
ముందే తెలిసిన తీర్పుకు విచారణ యేలా
*                 *                   *
దార్శనికత అంటే భవిష్యత్తును
నిర్మించడమే అనుకున్నామింతవరకు
భవిష్యత్తును అమ్మేసుకోవడం అని
రాబోయే కాలంలో కాబోయే
అనుభవాలు తెలుపుతాయేమో
*                 *                   *
మౌనం అంటే మునిత్వ లక్షణం ఒకనాడు
మౌనం ప్రధానమంత్రి పదవికి ఆభరణం నేడు
*                 *                   *
భూమి అలానే ఉంది
భూమి నాది అన్న ప్రతివాడు
భూమిలో కలిసిపోయాడు
అవినీతి అలానే ఉంది
అవినీతిని అంతమొందిస్తానన్న ప్రతివాడూ
అవినీతి మకిలి అంటించుకుంటున్నాడు
*                 *                   *
'నువ్వు చేయ్యగలవ'ని దేవుడు
'నీ వల్లే అవుతుంద'ని మనిషి
కొట్టుకుంటూనే ఉన్నారు తరాల తరబడి
మనుషులు మాత్రం మాయమైపోతున్నారు
*                 *                   *
హక్కులకోసం పోరాడతావు కానీ
బాధ్యతలనుండి పారిపోతావేల?
*                 *                   *
పద్దులు చూసుకుని
హద్దులు గీసుకుని
విడిపోయినది ఇందుకేనా
*             *            *
నెత్తుటి మడుగు ఒడ్డున
నీటికూజా పట్టుకు నించున్నా
దాహంతో ఎవరైనా వస్తారేమోనని
*             *            *
ఆదుకుంటాడని దేవుడికి 
నిలువుదోపిడీ ఇద్దామనుకుంటే
నాయకుడు వచ్చి
నిలువునా ముంచేశాడు
*             *            *
జీవమున్న శివుడివా
చేవచచ్చిన శవుడివా/శవానివా
శివుడివైతే పోరాడు
*             *            *
బూచాడోస్తాడంటే భయపడలేదు బుడ్డోడు
నాయకుడోస్తున్నాడంటే భయపడ్డాడు పెద్దోడు
*             *            *
సాములోరొచ్చి సంస్కరిస్తాడనుకుంటే
చీకట్లో సరసాలు మొదలెట్టాడు
*             *            *
చినుకు కోసం ఎదురు చూసే చేనులా
నీ పలుకు కోసం మేమంతా ఓ ప్రధానీ
*              *              *
తిరుపతిలో చెప్పావు కదా మరిచిపోవులే అనుకున్నాం
దేవుడి హుండీలో 'మాట'ని ముడుపుగా వేసావని తెలీక
*              *              *
ఒక్క దేవుడి కోసం
గుడికి వెళదామని బయల్దేరుతుంటే
వంద పిచ్చితనాలు వెంటబడ్డాయి
*                *                  *
ప్రజాస్వామ్యంలో
అంపశయ్య మీది మనిషి కంటే
పిచ్చికుక్కలకి విలువెక్కువ కదా
*                *                  *
రేపటి కోసం ఏదైనా రాద్దామని
కాగితం, కలం తీసుకుని కూర్చున్నా
నాలోంచి నిశ్శబ్దం ఉప్పెనలా
*                *                  *
వినక తప్పని గార్దభ స్వరంతో
వాడు అరుస్తున్నాడు
అరుపులు అబద్ధాన్ని నిజం చేస్తాయన్న నమ్మకంతో
*                *                  *
కొనసాగుతున్న యుద్ధలోంచి
పుట్టుకొచ్చిన రక్తపుటేరుల వాసన అడిగింది
నా మతమేదని
*                *                  *
వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ గతంలో
గాయాలతో పాటు
గేయాలు కూడా కనబడ్డాయి
*                *                  *
వాదమేదైతేనేం నువ్వు ఒకేవైపు ఉన్నపుడు
ఆ గోడలు దాటోచ్చి చూడు ఆ వాదాల పునాదుల దమ్మెంతో
తెలుసుకోవాలంటే
*                *                  *
కలంతో పని కాదని పట్టుకున్న గన్ను
పాశమై మెడకు చుట్టుకుని జీవితాలను ముగిస్తోంది
ప్రాణాలు తీస్తోంది
*                *                  *

రైతే రాజు అంటే
కామోసు అనుకున్నా అప్పుడు
రైతును వాడుకుని
రాజు కావాడమని అర్థమవుతోంది
*                *                  *
తిండి పెట్టటానికి
పంట పండిద్దామనుకుంటే
తాగటానికి
పురుగులమందు ఇచ్చారు
*                *                  *
వ్యవసాయం కోసమని
పదెకరాలు కొందామని వెళితే
ఫ్యాక్టరీ పెడతానంటే
వెయ్యి ఎకరాలు ఇప్పిస్తామన్నారు
*                *                  *

ఒక్క దేవుడి కోసం
ప్రార్థనాలయానికి వెళదామని బయల్దేరుతుంటే
వంద పిచ్చితనాలు వెంటబడ్డాయి
*                *                  *
కొనసాగుతున్న యుద్ధలోంచి
పుట్టుకొచ్చిన రక్తపుటేరుల వాసన అడిగింది
నా మతమేదని
*                *                  *
 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...