Posts

Showing posts from March, 2016

జయహో కవిత్వం ...

వంశీ కలుగోట్ల// జయహో కవిత్వం ... // ****************************** *********** అంతర్జాల ప్రపంచంలో ఏమీ తోచక అటూ ఇటూ తిరుగుతుంటే ఒక చెట్టు కనిపించింది ... ఫలవంతమైన ఎన్నో కొమ్మలు ఉన్న ఆ చెట్టుకింద కూచుందామని వెళితే ఒక్కొక్క కొమ్మ నుంచి ఒక్కో నవ కవి చేతిలోంచి జాలువారిన కవిత పలకరించింది ... *            *            * అతడి వైద్యం స్వస్థత చేకూరుస్తుందో లేక అతడి కవిత్వం పరవశింపజేస్తుందో అటు వైద్యం, ఇటు కవిత్వం - రెండింటితో స్వాంతన కలిగిస్తున్న విరించికి జయహో *            *            * తన స్మృతి పథంలోకి మననూ లాక్కెళ్ళి అప్పటి జీవితాల్లోని అమాయకత్వాన్ని, ఆవేదనలను భాషతో, యాసతో, రాత తీరుతో కట్టిపడేస్తున్న హెచ్చార్కెకి జయహో *            *            * ఆవేశాన్ని ఆలోచనలని అక్షరాల్లో మిళితం చేసి ఉర్రూతలూగించే  సత్తా ఉన్న సిద్ధార్థ కట్టాకి జయహో *            *            * అటు కదిలించే గజల్ ఇటు ఆలోచింపజేసే కవిత్వం రెండింటితో పరవశింపజేస్తూ, సత్తా చాటుతున్న రోహిణి వుయ్యాలకి జయహో *            *            * అక్షరాల్లో వెన్నెలని ఒలికించి ఆహ్లాదాన్ని పంచే పుష్యమి సాగర్ కి జ

అక్షరాయుధం

వంశీ కలుగోట్ల// అక్షరాయుధం // ****************************** ** కలం పట్టుకుని ముందుకు పోతున్నావు ఏమి సాధించగలవు అని అడిగాడొకడు  ఉదయించే సూర్యుడు ఏంచేస్తాడు తాను కాలిపోతూ వెలుగును పంచి వాడుకోమనడం తప్ప కలాన్ని నమ్ముకున్న నేనూ నాలాంటి వాళ్ళు అందరూ అంతే అక్షరాలను వదులుతున్నాను(రు) నిద్రిస్తున్న మస్తిష్కాల మత్తు వదలగొడతాయన్న నమ్మకంతో ఆయుధం పట్టుకున్నవాడేమయ్యాడు   అక్షరాన్ని నమ్ముకున్న వాడేమయ్యాడు   ఆలోచించి చూడు ... అవగతమవుతుంది మార్పు తెచ్చేది ఆయుధం కాదు అక్షరం

వ్యతిరేకిస్తున్నా ...

వంశీ కలుగోట్ల// వ్యతిరేకిస్తున్నా ... // ************************************ నాకు నచ్చని విషయాన్ని ఎవరో ప్రచారం చేసిన నిజాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా  నేను ముక్కంటితో సమానమని నీవంటే అదంతా నీ అభిమానమని సర్దుకుపోతా నాకు రెండే కళ్ళు ఉన్నాయని అంటే అదేదో వైకల్యంగా అంటున్నావని ఆగ్రహిస్తా  పాదయాత్రలో నా ప్రతి అడుగూ ఒక ప్రభంజనమని నువ్వంటే నా అనుయాయిగా నిను గుర్తిస్తా కానీ, నాది మామూలు నడకేనని అంటే మాత్రం నువ్వు ప్రతిపక్షమేనని ఫిక్స్ అవుతా  నా ప్రతి మాటా ప్రవచనం లాంటిదని అంటే నాకు భక్తుడిలాంటి వాడివనుకుంటా కానీ నావి కేవలం గాలిమేడల కబుర్లని అంటే నీ మూర్ఖత్వానికి తగిన శిక్ష అనుభవిస్తావు  నా ప్రతి చర్య లోకకల్యాణం కోసమేనని అనుకోగలిగితే అర్థం చేసుకున్నావనుంటాను నా లోకమంతా నా కులమే అంటే మాత్రం ఇక నీకు పతనం తప్పదు అసలు నీ దబాయింపు ఏంటి నేను చెప్పిందే నిజం,నా మాటే వేదం నేను చేసిందే మంచి నేను చెప్పింది మాత్రమే నమ్మాలి 

మాయదారి లోకం ...

వంశీ కలుగోట్ల // మాయదారి లోకం ...//  ********************************************* 1 తలెగరేసిన ప్రతివాడూ పొగరున్నోడు కాడు  తల తెగనరికిన ప్రతివాడూ వీరుడు కాడు  కాస్త గమనించి చూడు సోదరా  తలెగరేసింది బహుశా మెడ పట్టేసి కావొచ్చు  నరికిన తల ఏ కోడిదో కుక్కదో కావొచ్చు  2 నువ్విలా నమ్మేస్తూ పోతుంటే  నీది నీకే అమ్మెయ్యగలరు భయ్యా  నిన్ను నీకే పరిచయం చేసి  నీకు తెలీకుండా నీతోనే  నీ డబ్బు ఖర్చు పెట్టించగలరు  3 నా దగ్గరేముంది గోచి గుడ్డ అంటావేమో  నీ శరీరంలో భాగాలన్నీ  ఆస్థుల్లెక్కనే కనిపిస్తాయ్ ఈ యెదవలకు జర జాగర్త భయ్యా  4 భయ్యా సభలకెల్లి చప్పట్లు కొట్టటమంటే  ఇంటి వసారాలో మంచం మీద కూకోని  దోమలను సంపినట్టనుకుంటన్నావా  సప్పట్లు కొట్టి ఇంటికోచ్చేసినాం అనుకుంటన్నవేమో  నీకు తెలియకుండా నిన్ను తన వెనుక  ఆస్థిని చేసుకుని అమ్మేసుకుంటున్నాడు  నిన్ను తోక్కేస్తూ వాడు ఎదిగిపోతున్నాడు భయ్యా ... 

కమ్ ఆన్ బ్రో ...

వంశీ కలుగోట్ల// కమ్ ఆన్ బ్రో ... // ******************************* అన్నయ్యా మన తెలుగోళ్ళు బాగా ఎదిగిపోయారు నీకింకా అర్థం అయినట్టు లేదు లేక అర్థం అయినా కానట్టున్నావో మరి  చిన్నప్పుడు ఆటల్లోనో, పరుగుపందేల్లోనో దెబ్బ తగిలితే 'అమ్మా/అబ్బా' అనే వాళ్ళందరూ ఇప్పుడు దెబ్బ తగిలిన ప్రతిసారీ 'ఓహ్ మై గాడ్' అంటున్నారు కదా అన్నయ్యా  చేతిలోని వస్తువేదైనా జారి పడిపోయినపుడు 'అరెరే' అనటం నీకు గుర్తుందో లేదో ఇప్పుడు 'ఊప్స్' అనటం మాత్రం గమనించి ఉంటావులే  అప్పుడెప్పుడో తెలుగు నవలల కోసం వెర్రెత్తిపోయిన రోజుల జ్ఞాపకాల నుంచి బయటకి రా ఇప్పుడు హారీ పోటర్ తరహా ఆంగ్ల పుస్తకాల కోసం ఎగబడటం నువ్వు చూడలేకపోతున్నావా  ఎన్టీవోడు, చిరంజీవి సినిమాలకి మొదటి ఆట టికెట్ కోసం చొక్కాలు చించుకున్నోళ్ళు ఇప్పుడు జేమ్స్ బాండ్ సినిమాల కోసం జాగరణ చేస్తున్నారు తెలుసా భయ్యా  నువ్వింకా 'ఏరా మామా/బావా బావున్నావా' అనే పలకరింపుల స్నేహం రోజుల్లో ఉన్నావేమో ఇప్పుడు 'హే మాన్ హౌ అర్ యు' అనే పిలుపులు నీ చెవులకు వినబడటం లేదా  అన్నట్టు అసలు విషయం

వాడు మగాడురా ...

వంశీ కలుగోట్ల// వాడు మగాడురా ... // ****************************** ****** ఒరేయ్ మగాడా నీ బతుకింతేరా నీవు ఉన్న ప్రాంతంలో ఎవరైనా అమ్మాయి కనబడకుండా పోయినా మరెవరో అమ్మాయికి ఏమైనా జరిగినా అక్కడి నీతిమంతుల కళ్ళన్నీ నీ వైపే అనుమానంగా చూస్తాయి  ఎవరురా నీకు బలవంతుడని సర్టిఫికేట్ ఇచ్చింది అది అడ్డు పెట్టుకుని కన్నీరు పెట్టుకోవాల్సిన కష్టాలను ఎన్నిటినో దిగమింగి కుమిలిపోతున్నావు  ఎవరురా నువ్వే పెద్దని తీర్మానించింది తప్పెవరు చేసినా కుటుంబ పెద్ద నువ్వేనంటూ బాధ్యుడిగా వేళ్ళన్నీ నీవైపే చూపుతాయి తప్పెవరిదైనా సరే నువ్వే పవిత్రత నిరూపించుకోవాలి నీ స్థాయి ఏదైనా  నువ్వు చేసే పని ఏదైనా నువ్వెక్కడివాడివైనా కులమూ, గోత్రమూ, వర్గమూ ఏదైనా నువ్వు 'మగాడి'వన్న ఒక్క కారణం చాలు 'తప్పు' నీదే అవ్వటానికి నీ పవిత్రత నిరూపించుకోమని తీర్మానించటానికి సినిమాల్లో సివరాఖరుకి న్యాయం గెలిచినట్టు ఎప్పటికో ఒకప్పటికి తప్పు నీది కాదని నీ పవిత్రత నిరూపితమైనా నీ మీద పడ్డ ముద్ర చెరిగిపోదు 'మగాడు' కదా 'మేనేజ్' చేసుంటాడులే అంటారు  నీ బతుకంతా అంత

వెలుతురు

వంశీ కలుగోట్ల// వెలుతురు ... // ****************************** **   అక్కడెక్కడో దూరంగా  ఒక చిన్న వెలుతురు కనిపిస్తోంది ఆ వెలుతురు  ఏ మతపు దేవుడో  ఏ వర్గపు ఆరాధ్యశక్తియో  మరే కులపు జీవమో  లేక ఇంకే నమ్మకపు ఆధారమో  తెలియదు  ఆ వెలుగును అందుకోవాలని  పరిగెడుతున్నా  నేను వెలుతురు కోసం పరిగెడుతున్నానో లేక  వెలుతురు నన్ను చూసి పరిగెడుతోందో తెలియటం లేదు ఆ వెలుతురు ఎందుకు అందటంలేదో అర్థం కావట్లేదు

దాటొచ్చిన దూరాలన్నీ ...

వంశీ కలుగోట్ల// దాటొచ్చిన దూరాలన్నీ ... // ****************************** ************** దాటొచ్చిన దూరాలన్నీ పుస్తకాలై పలకరిస్తుంటాయి అనుభవాలన్నీ సుడిగాలికి కిటికీ తలుపుల్లా అల్లల్లాడుతుంటాయి నువ్వో కాకపోతే నీవారో చేసిన తప్పులకు ఆధారం ఆ గతం ఆ తప్పులు సరిదిద్దుకున్న గొప్పతనమూ నిక్షిప్తమై ఉంటుంది అందులో అదేమీ వృధాగా పోయే వరదనీరు లాంటిది కాదు గతమంటే తవ్వుకుంటే ఊరే జ్ఞాపకాల ఊట  అమాయకత్వం నుంచి తెలివి వైపు తెలివి నుంచి మేధావిత్వం వైపు నువ్వు చేసిన ప్రయాణంలో ముళ్ళు చేసిన గాయాలు తగిలిన ఎదురుదెబ్బలు కష్టాలన్నీ భరించి సాగిన నీ మొండితనం/పట్టుదల అన్నిటినీ ఇముడ్చుకున్న జ్ఞాపిక ఆ గతం ద్వేషాలూ, యుద్ధాలూ, వివక్షలు మాత్రమే కాదు గతంలో ప్రేమలూ, బాంధవ్యాలూ ఆప్యాయతలూ కూడా నిక్షిప్తమై ఉన్నాయి గతమంటే నాస్తి కాదు నేస్తం అది అనుభవాల ఆస్థి

వాడేమవుతాడో ...

వంశీ కలుగోట్ల// వాడేమవుతాడో ...// ****************************** ******   ఎప్పటినుంచో చూస్తున్నాను వాడెప్పుడూ అంతే అందరిలానే, అందరిలోనే ఉంటాడు కానీ, లోలోపల రగిలిపోతుంటాడు  ఏదో ఒకటి చెయ్యాలని తపిస్తుంటాడు రాస్తానంటాడు, ఆడతానంటాడు సినిమాలు తీస్తానంటాడు రాజకీయాలు చేస్తానంటాడు మరింకేదో సాధించాలని అంటాడు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు  కలగా మిగిలిపోతాడో కొంతమంది కన్నీటిచుక్కై రాలిపోతాడో కొందరి ధైర్యమై నిలుస్తాడో  నాయకుడై నడిపిస్తాడో  స్ఫూర్తిని రగిలిస్తాడో మరికొందరి భవిష్యత్తై నిలుస్తాడో చివరకు వాడేమవుతాడో

ఆవేదన ...

వంశీ కలుగోట్ల // ఆవేదన ... // ******************************* రంధ్రాలెన్ని చేసినా ఎన్నివందల అడుగులు లోతు తవ్వినా భూమిలోంచి చుక్కనీరు కూడా రావట్లేదు  పాలు తాగి రొమ్ముగుద్దే లక్షణాన్ని అలవర్చుకున్న మనిషిని భరించలేక భూమాతకు కన్నీరు కూడా ఇంకిపోయిందేమో ఎన్నిసార్లు కంపిస్తే ఈ ఆవేదన తగ్గుతుంది ఎన్ని ఉప్పెనలు, సునామీలు వచ్చి తడిపితే భూమాతకు స్వాంతన చేకూర్చగలవు

కొన్ని గీతలు ...

వంశీ కలుగోట్ల // కొన్ని గీతలు ... // ****************************** ** చేతిలో ఆయుధాలతో అటువైపు వాడు ఇటువైపు నేను నించున్నాం సరిహద్దు గీత ఎందుకు గీయబడిందో తెలియకపోయినా  ఎండకో, వానకో, చలికో తట్టుకోలేక ఇబ్బంది పడుతూన్నప్పుడు వాడికీ, నాకూ కూడా అనిపిస్తుంది ఇద్దరమూ మనుషులమే కదా ఒక గీత అడ్డు ఉన్నందువల్ల ఒకరికొకరం సహాయం చేసుకోలేకపోతున్నాం అని దుప్పటిలా మంచు కప్పేసినా  వరదై వాన నీరు ముంచెత్తినా  ఎడారి ఇసుక తుఫానులా కమ్మేసినా  ఆ గీత మా కళ్ళముందు కదలాడుతూనే ఉంటుంది  మా జీవితాలని వణికిస్తూనే ఉంటుంది  వాడెవరో నాకు తెలీదు నేనెవరో వాడికీ తెలీదు వాడికీ నాకూ మిత్రత్వమూ లేదు  శతృత్వమూ లేదు  మా వెనుక ఒక దేశం ఉందన్న ఆలోచన ఒక జాతి రక్షణ బాధ్యత మా భుజాల మీద ఉందన్న భావన  నా వెనుక ఉన్న దేశాన్ని/జాతిని వాడి వెనుక ఉన్నవారు వాడి వెనుక ఉన్న దేశాన్ని/జాతిని నా వెనుక ఉన్నవారు ఏదో చేస్తారనే ఊహతోనో గతంలో ఎవరో చేసిన ఏదో ఘటన గుర్తోచ్చో గీత దాటాలనుకుంటే ఒకరినొకరం చంపుకుంటాం వెనకున్న దేశపు జనాల సంతోషం/క్షేమం కోసం  అప్పటివరకూ భద్రంగా ఉండగాలిగామన్న సం

కొన్ని గొంతుకలు ...

వంశీ కలుగోట్ల// కొన్ని గొంతుకలు ... // ****************************** ******** 1 ఏదో చేస్తున్నావని విన్నాను చాలా మంచిపని చేస్తున్నావు ఈ రోజుల్లో పదిమందికి మంచి చెయ్యాలని ముందుకొచ్చే నీలాంటి వాళ్ళు ఎందరున్నారు చెప్పు నీలాంటివాళ్ళను చూసినప్పుడు మంచి జరుగుతుందని నమ్మకం వస్తోంది  అయినా ఇదేం సరిపోతుంది చెప్పు చేసేది, చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది నీ ఒక్కడి వల్లనో లేక నా వల్లనో అయ్యేపని కాదిది అందుకే వదిలేశా ఏదో ఉన్నన్నాళ్ళూ ఇంకోడికి సమస్య కాకుండా బతికి పొతే చాలు  2 ఆ ఏముందిలే ఏదో చేస్తున్నాడు కడుపు నిండినోడు ఎంగిలి చేత్తో కాసిని మెతుకులు రాలిస్తే అది కూడా గొప్పేనా  అయినా ఏదో ఆశ లేకుండా ఎందుకు చేస్తాడు రేపో కాకపొతే మాపో నాయకుడై ఇంతకింతా దోచుకోవడానికే ఇప్పుడీ చిల్లర సంతర్పణలు  3 ఇదిగో ఎందుకయ్యా నీకీ గోల ఏదో కాస్త సంపాదించుకుంటున్నావు పోయి నీ పనేదో నీవు చూసుకో ఈ గోలెందుకు చెప్పు నీకంటే ముందూ ఇలానే ఉంది నీ తరువాత కూడా ఇలానే ఉంటుంది తోలుమందం జనాలకు ఏమి చేసినా ఇంతే పో పో పోయి నీ పని చూసుకో  4 ఏందిరా భయ్ నీ ఎదవ సంత పనిలేని ఎదవ ఎవడో ఏదో గొరిగినట్టు

నాయకులు పుట్టుకొస్తున్నారు ...

వంశీ కలుగోట్ల// నాయకులు పుట్టుకొస్తున్నారు... // ****************************** ***************** 1 మౌనంగా ఉన్నన్నాళ్ళూ అంతా బాగానే ఉంది ఉన్నట్టుండి చెట్టుకొక నాలుక పుట్టుకొచ్చి నోటికొచ్చినదంతా వాగి మొదలుకే చేటు తెచ్చింది  2 దిబ్బలోని పెంటకు కొత్తగా బుద్ధి పుట్టుకొచ్చి తానూ పెద్దమనిషినేనంది పంచాయతీ చేస్తానని పంచెఎగ్గట్టి బయలుదేరింది పనిలేని ఎదవలంతా వెంటరాగా నాయకత్వం చేస్తానని ఊరేగడం మొదలుపెట్టింది  అంతకుమునుపు రాయేస్తే చిట్లుతుందని దూరంగా ఉన్న నీతిమంతులందరూ తలా ఇంత పెంట పూసుకుని తందాన తాళమేస్తూ గోల చేస్తున్నారు  3 లెక్కకు మిక్కిలిగా నాయకులు పుట్టుకొస్తూనే ఉన్నారు  నా తలలో వెంట్రుకలు రాలిపోతూనే ఉన్నాయి ఊడిన నా వెంట్రుకలన్నీ నాయకులయ్యాయేమో అని నా అనుమానం

అటాప్సి ...

వంశీ కలుగోట్ల// అటాప్సి ... // *************************** ఇంతే భయ్యా ... ఈ లోకం తీరింతే చచ్చినోడిపేరు చెప్పుకొని బతికున్నోళ్ళు పండగ చేసుకుంటారిక్కడ  ఎక్కడో ఎవడో పోయాడని మరింకేక్కడో అసలేమాత్రం సంబంధం లేనోడిని సావగొడతారిక్కడ  బతకలేక చచ్చినోడికి దండలేసి దణ్ణాలు పెట్టి హీరోని చేసి ఉద్యమాలు చేసుకుంటారిక్కడ  చచ్చినోడి సమాధి ముందు కొవ్వొత్తులు వెలిగించి బతికున్నోడి నోటికాడ ముద్దను లాగేసుకుంటారిక్కడ  పుట్టినప్పుడు మనిషి పోయింతర్వాత మనిషి మధ్యలో బతికున్నకాలమంతా ఏదో ఒక కులపోడివిగానో వర్గం/వర్ణం వాడివిగానో మాత్రమే గుర్తింపబడతావు భయ్యా  కాదని నువ్వు అన్నావంటే నీకేదో మాయ రోగముందని బతికున్నపుడే నీకు అటాప్సి చేసేయ్యగలరు భయ్యో

వలస ...

వంశీ కలుగోట్ల// వలస ... // ***************************** బాగుండటం అంటే వేసిన పంట బాగా పండి చేతికి కాస్త డబ్బు వస్తే అయినవాళ్ళతో కలిసి పండగలు సంబరంగా జరుపుకోవడం అనుకునేవాళ్ళం చిన్నప్పుడు  ఏదో ఒక కంపెనీ నిర్మాణానికో ప్రాజెక్ట్ ముంపు భూముల లెక్కలోనో రింగు రోడ్డో లేక మరింకే పేరునో ఉన్న పొలం ఎంతెక్కువకు పొతే అంతకు లాగించేసి చేతికందిన దానితో ఊరొదిలి ఊరేగడమే బాగుండటమని ఇప్పుడనుకుంటున్నారు పొలం పోయింది పల్లె పోయింది పల్లె బతుకు పోయింది  వలసవెళ్ళిన పట్నంలో కూలిబతుకులతో కుంగిపోయి పాత బతుకులోని ఆనందం మనసు పొరల అడుగున ఎండిపోయిన నీటి ఊటలా అప్పుడప్పుడూ తడిమి తడి చేస్తూంటే పల్లెకు వెనక్కి వెళ్ళలేక పట్నంలో ఇమడలేక 'పోతున్నారు' చెబితే ఎవడు వింటాడు 'ఎదగటం అంటే కోల్పోవటం కాదని'

నిప్పులు ...

వంశీ కలుగోట్ల// నిప్పులు ...// ****************************** యేబ్రాసి యెదవలందరూ ముసుగులేసుకుని నీతులు వల్లిస్తున్నారు రెండు ఆకర్షణల మధ్య రాత్రి చీకట్ల పొరలలో  నాలుగు గోడల లోపల  నగ్నత్వం వారికి ఇష్టమే కానీ, నిజాల పగటి వెలుగులో భావాల నగ్నత్వాన్ని తట్టుకోలేక నిలదీస్తున్నారు  కులం పేరు చెప్పుకుని తాతల గొప్పలు చెప్పుకుని చేతిలో నోట్లు పట్టుకుని ఎవరి తీరున వారు తమ బతుకులను కులానికో, ధనానికో తాతల గొప్పలకో తగిలించి ఊపుకుంటూ ఊరేగుతున్నారు   ముఖాలకున్న ముసుగులు తీస్తే కదా ఒక్కొక్కడి వికృతత్వాలు బయటపడేది వెలుగులో వేదం వల్లించి చిత్తాన్ని చీకట్లో ప్రదర్శించుకునే నీచుల మధ్య భావాలను నగ్నంగా ఎగరేస్తున్న నన్ను చూసి, నిలదీస్తున్నారు  అవును వాళ్ళందరూ నిప్పులే బతుకులను కాలుస్తూ భవితలను కాలరాస్తూ ఎదుగుతున్నారు భాస్మాసురుల్లా

గోడలు ...

వంశీ కలుగోట్ల// గోడలు ... // ****************************** మిత్రమా నీవు దళితుడివో, శూద్రుడివో రెడ్డివో, రాజువో లేక మరింకెవరివో నీ రంగు, గోత్రం ఏదైతేనేం నువ్వు మానవత్వపు తానులో ఒక ముక్కవేనన్న నమ్మకం నాది  అవును, నాది అగ్ర వర్ణమే రక్తపు రుచిమరిగిన ఈగ, దోమల జాతివాడెవడో బహుశా నా రక్తం రుచి చూసి తీర్మానించాడు కాబోలు లేక పుట్టుక ముందే నా బుద్ధెరిగిన మహా విద్వాంసుడెవడో సర్టిఫికెట్టు ఇచ్చి ధృవీకరించా డేమో తెలియదు నా వర్ణం, రక్తం అగ్రమని మిత్రమా నీ రక్తం, వర్ణం నిర్ధారించినవాడే నా రక్తం, వర్ణం నిర్ధారించాడు వాడికా హక్కెవడిచ్చాడో తెలియదు కానీ, నేనూ మనిషినే  నాలో ద్వేషం లేదు పగ, కుత్సితం లేవు అసహ్యం, అసహనం లేవు ఉన్నదంతా ప్రేమే నీకూ, నాకూ మధ్య ఉన్న గోడ ఒక్క ఆలింగనంతో బద్దలవుతుందంటే రా ప్రయత్నించి చూద్దాం  నీ జాతి అయినా నా జాతి అయినా తగవు తీరుస్తానని పుట్టుకొచ్చిన నాయకులను నమ్మకు వాడికి మన మధ్య సయోధ్య నచ్చదు మన రెండు జాతుల శవాల దిబ్బల మీద భవనాలు కట్టుకోవాలనుకునే నికృష్టపు జాతి వెధవలు వాళ్ళంతా వాడికి మనమధ్య స్నేహం నచ్చదు

వాడంతే ...

వంశీ కలుగోట్ల // వాడంతే ... // ****************************** వాడేమీ సమాజానికీ సంకుచితాలకూ బందీ కాడు  భావోద్వేగాలకు బంధువూ కాడు  కులమతాలకూ, రాజకీయాలకూ తొత్తు కాడు  అందరూ కలిసి ఒక కంచె కట్టి ఆ దడిలోనే వాడి భావాలను  ఇమిడ్చి రాయమంటే ఎలా  రాయకపోతే కవి కాదంటావా  అయినా వాడేమీ ఇన్నాళ్ళూ  నీ ఒప్పు కోసమో మెప్పు కోసమో రాయలేదు  వాడిలో చలనం కలిగించే, బాధించే సంఘటనేదో జరిగినపుడు రాయాలనిపించే భావన కలిగినపుడు  వాడే వాడికి తోచింది రాసుకుంటాడు  నీకు నచ్చినట్టు రాయలేదని నిలదీస్తావెందుకు తెలుసుకో/గుర్తు పెట్టుకో  వాడెప్పుడూ నువ్వు మెచ్చేది రాయలేదు  వాడు రాసింది నువ్వు మెచ్చావు