Posts

Showing posts from 2016

గమనం ...

వంశీ కలుగోట్ల // గమనం ... // ****************************** ఆగిపోయిన చోటునుంచే             మొదలవ్వాలనే ప్రయత్నం అవునూ ఇంతకీ ఎక్కడ ఆగిపోయాను? మనిషితనం వదిలేసి ఆధునికత్వం మొదలైనచోటా ఎదగటం అంటే ఎదుటివాడిని అణచేయటం అని పాఠం నేర్చుకున్నచోటా మనిషి అంటే మతం అని అర్థం చెప్పుకున్న చోటా అడుగడుగునా నన్ను నిలిపేసిన గోతులు కనబడుతూనే ఉన్నాయి అంటే పయనించిందంతా             పతనం వైపేనా

విద్యార్థిగానే బతికితీరాలి

వంశీ కలుగోట్ల // ... విద్యార్థిగానే బతికితీరాలి //   *************************** *************** వాడు అడిగాడు    'నాన్నా జీవితం ఎప్పుడు మొదలవుతుంది?' అని 'ఈ బడిలో ఉన్నన్నాళ్ళూ బాగా చదువు    ఆ తరువాత జీవితం అనుభవించవచ్చు'  అని  నాన్న చెప్పాడు  'నాన్నా జీవితం ఇప్పుడు మొదలవుతుందా?'   అడిగాడు వాడు బడి అయిపోయాక 'ఈ ఇంటర్ రెండు సంవత్సరాలూ కష్టపడి    ఇంజనీరింగ్ లోనో మెడిసిన్ లోనో సీట్ కొట్టరా    ఆ తరువాత తిరుగుండదు' అన్నాడు నాన్న  'నాన్నా మరి ఇపుడు జీవితం మొదలయినట్టేనా?'   అని అడిగాడు వాడు    ఇంజనీరింగ్/మెడిసిన్ లో సీట్ వచ్చాక 'ఈ నాలుగేళ్ళూ చదివేస్తే ...    జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు'    అన్నాడు నాన్న  వాడు సమాధానపడ్డాడో    లేక రాజీ పడ్డాడో తెలియదు    ప్రతి మలుపులోనూ    తెలియని బాధను  లోపలి పొరల్లో దాచుకుని    గడుపుతూనే ఉన్నాడు  వాడికి తెలుసు    తాను చస్తూ బ్రతుకుతున్నానని    చచ్చి బ్రతకబోయేముందు    వాడు రాసుకున్నాడు ... "ఇకనైనా జీవితం మొదలవుతుంది    అనుకున్న ప్రతి మలుపులోనూ    పాఠాలు ఎ

... జ్ఞాపకం

వంశీ కలుగోట్ల // ... జ్ఞాపకం // ****************************** **** వాడు ఎవరని అంటే  వాడు చెప్పుకునే కులం కాదు  నమ్మే మతమూ కాదు  చేసే పని కాదు  చెప్పే మాట కాదు  నిష్క్రమించినరోజున  రెండు కన్నీటిచుక్కలు  మిగిల్చే చిన్న జ్ఞాపకం  మాత్రమే వాడు  ఉన్నోళ్లు చూసేది  వాడు ఏమి  సాధించి పోయాడో  అని కాదు  వాడు ఏమి  మిగిలించి పోయాడో అని  వాడి జ్ఞాపకపు విలువ  వాడు వదిలి వెళ్లిన  విషయాన్ని బట్టి ఉంటుంది 

వేదాంతం - విజ్ఞానం

వంశీ కలుగోట్ల // వేదాంతం - విజ్ఞానం // ****************************** *************** పొగ పొరలేమిసేయును కరిగి కనులముందే పొరలుగా కరిగిపోయేను యని వేదాంతసారమును వివరించ యత్నించే ధూమపానబానిసయొకడు విషపు చుక్క యది ఒకేనొక్కటి యైననేమి కడివెడు పాలనైనను బలితీసుకొనగలదని విజ్ఞానపు పొరలను విడదీసి వాడు వివరించే

... ఎవరిగోల వారిది

వంశీ కలుగోట్ల // ... ఎవరిగోల వారిది // ****************************** ********* మొక్క ఎదుగుతోంది             చెట్టుగా పదిమందికి నీడనిస్తూ మనిషి ఎదుగుతున్నాడు             గొప్పోడిగా పమందిని అణగదొక్కుతూ ... *            *            * వాడన్నాడు అది             ఆవేశమని వైద్యుడన్నాడు అది             రక్తపోటని మూర్ఖులనుకున్నారు అది             తమకోసం పోరాటమని *            *            *             ఆమె అంటుంది వాడి  ప్రేమ గొప్పది అని             వాడు ఇచ్చిన బహుమతులన్నీ చూపుతూ              వీడు పంచిన జీవితాన్ని కాలదన్నుతూ

... ప్రేమగా జీవించు

వంశీ కలుగోట్ల // ... ప్రేమగా జీవించు // ****************************** ************** ఏ తీరున యోచించినన్ ఏ దిక్కున పరికించినన్ కన్పట్టుచుండిరి ప్రియుల్ భావింపకుమన్యదా నాపలుకుల్ పలురకములీ  ప్రియుల్ యనిదెల్పుటయే దప్పించి లేదిచట మారుద్దేశము మదిభారము బోవునని ఎవరో సెలవివ్వగన్ మధుశాలకు నేను బోవ కన్పడిరి యచట మధుపాన ప్రియుల్ ప్రకృతి పరవశింపజేయున్ యని పచ్చటి పల్కుల విని ఉద్యానవనమున కేగ కాంచితిని యచటన్ కాంతా ప్రియులన్ చల్లగాలికి తిరుగుదుమని పిల్లగాలికి యారాటపడుచు సంజె చీకట్లమాటున వాడలవెంట తిరుగుచున్న వారదిగో రసిక ప్రియుల్ ప్రపంచమును ప్రక్కకు త్రోసివేసి అక్షరమును ఆస్వాదించుటకున్ మించిన యానందమున్నదాయంచు గ్రంథాలయ మునకేగు  చున్నారాదిగో పుస్తక ప్రియుల్ తలిదండ్రుల, మిత్రుల మించి తెరమీది బొమ్మలను వేల్పులుగ తలచుచు దారినబోవుచున్నా రదిగో సినిమా ప్రియుల్  ... ... వివరించవలెనా ఇంకనూ ప్రేమించగలిగే మనసున్న చాలున్ ఎందెందు వెదకున కనబడు ప్రేమను మరచి ఇంకా యేల ఈ తిరుగులాటల్ తీవ్రవాదముల్

మాటలు ... మాయలు

వంశీ కలుగోట్ల // మాటలు ... మాయలు // ****************************** ************ 1 రారా యని రమణి పిలువగ  రసికుండూరకుండునా  వేంచేయుడెచటకని సతి  సమయానికి అడ్డు పడిన  'పిల్ల'గాలికి అలా తిరిగి చల్లబడియొచ్చెదనని  మాటకారితనము చూపడా  2 మదికి మదిరకి బంధమేమిటని మత్తెక్కిన మహిషుడినడిగిన చెప్పక ఊరకుండునా మదిలోని బాధను మధిర మరిపించునని మాయమాట

భక్తి - వాదం

వంశీ కలుగోట్ల // భక్తి - వాదం // ****************************** ***** పాపము పెట్రేగెనని ఉగ్రముదాల్చి ఫాలనేత్రముల్ రాల్చిన ప్రస్ఫులిత  జ్వాలల కీలల విజృంభణతో పర్వతమంత హిమమే కరిగి వరదై ఊరూవాడలని ముంచెత్తినో ఏమో  యని భక్తుడు వి'భ్రాంతి' చెంద  కాదు యని వాడు తన వాదనతో వచ్చే పుర్రెలోని బుద్దులు పెడతలలు పట్టగ విశ్వరూపం దాల్చిన కాలుష్యపు కోరలు సాచిన 'గ్లోబల్ వార్మింగ్' అంటూ వాడు వివరించ యత్నించె  దారులు వేరైననేమి గమ్యమొక్కటే ఫాలనేత్రములో కానిచో కాలుష్యపు కోరలో కాలుచున్న బతుకులెవ్వరివని యోచించక వాదపు వాదరకిరువైపులనుంచుని తలకొకరీతిన్ మేధావిత్వపు వాచాలత్వమును ప్రదర్శించుచూ కాలమును వృధా చేయుచునే యున్నారు 

... ఒంటరి

వంశీ కలుగోట్ల // ... ఒంటరి // ****************************** 1 వాడన్నాడు గర్వంగా ... 'నా కత్తికొసన ప్రపంచాన్ని ఆడిస్తాను' అని యుద్ధం ముగిశాక శవాల కుప్ప మధ్యలో నిలబడ్డాక కానీ, వాడికి అర్థమవ్వలేదు కత్తికొస నుంచి జారుతున్న రక్తపు చుక్కలు తప్ప ఆడించడానికి కానీ పాలించటానికి కానీ మిగిలున్నదేమీ లేదని విజయం అంచున  తానొంటరిగా నిలుచున్నానని 2 విజయం నిన్ను ప్రపంచం ముందు నిలబెడుతుంది ఒంటరిగా నువ్వు మిగిలిపోతావు నీ వెనుక నిలబడ్డవాళ్లు నీ భుజం తట్టి మెచ్చుకునేవాళ్ళు నిన్ను బలిపీఠం పై నిలబెట్టేవారే నీ  విజయాన్ని చూసి రొమ్ము విరుచుకుని 'ఎదో ఒకరోజు నేనూ సాధిస్తా' అంటూ రంకెలేసేవారిని దగ్గరకు తీసుకుని చెప్పు  'ఒంటరి కావటానికి సిద్ధమైతే ...' శిఖరం అధిరోహించమని నువ్వు సాధించిన విజయాలు గోడకు వేలాడుతుంటే నువ్వు మాత్రం, ఒక మూలన ఒంటరితనంలో కొట్టుకుపోతుంటావు (విజయం తరువాత వచ్చే సమస్యలను, ఒంటరితనాన్ని తట్టుకునేలా సిద్ధం కావాలని చెప్పడం మాత్రమే ఇక్కడ నా ఉద్దేశ్యం. విజయం అంటే బాధ్యతతో కూడిన ఆనందం. అందుకే యుద్ధం వల్ల వచ్చే విజయం, కృషి/పట్టు

అనదర్ డే అనదర్ డాలర్

వంశీ కలుగోట్ల // అనదర్ డే అనదర్ డాలర్ // **************************************** """ ఎప్పటిలానే  'అనదర్ డే అనదర్ డాలర్' అనుకుంటూ  ఆఫీసుకు వెళ్లాను ...  !!!!!!!!!!!!!!!!!!!!!! ... ఏమైంది ఇవాళ  కీబోర్డ్ లేదు, మౌస్ లేదు  మానిటర్ జాడే లేదు  సిపియు గురించి చెప్పక్కరలేదు  ఏ డెస్క్ మీదా ఏమీ లేవు  ఆఫీసు మొత్తం చూస్తే  ఉప్పెన ఊడ్చేసిన ఊరులా ఉంది  ఎవరో కనిపిస్తే  'ఏమయ్యింది' అని అడిగాను  'యంత్రాలకు స్వాతంత్య్రం ఇచ్చారు' అని చెప్పారు  ఇప్పుడెలా ... ఏమి చెయ్యాలి? యంత్రం లేకపోతే బతికేదెలా?""" ...  ...  ...  అలారం శబ్దానికి మెలకువ వచ్చింది  కళ్ళు తెరచేసరికి వెలుతురు కమ్మేసింది  'హమ్మయ్యా ... అదంతా కలేనా లేకపోతె యంత్రాలకు స్వాతంత్య్రం ఏంటి?' అనుకుంటూ ఆ రోజుకి మొదలయ్యాను 

... అబద్ధాలు

వంశీ కలుగోట్ల // ... అబద్ధాలు // ***************************** 1 నేనంటే ఒక అబద్ధం  ... అంతే నిజమనుకునే ప్రతి ఒక్కరూ అబద్దమే నిజమంటే ఒకటే - అదే అబద్ధం 2 ఏదో ఒక ముసుగేసుకుని ఒకడు వెళ్లి ఇంకోడిని చంపుతుంటే లేని నిజమెక్కడ బయటపడుతుందో అని ఒక అబద్ధం ఇంకో అబద్దాన్ని చంపి పాతరేస్తున్నట్టు అనిపిస్తుంది 3 పుస్తకాలలో రాసిన ధర్మసూత్రాలను ఆదర్శంగా ఆచరిస్తున్నానని స్వీయవంచన చేసుకుంటూ బతుకీడుస్తున్న మహానటుల మధ్యన మామూలోడిగా బతకడం ఎంత కష్టమో ...

చరిత్ర ఆ విధంగా రాయబడింది ...

వంశీ కలుగోట్ల // చరిత్ర ఆ విధంగా రాయబడింది ... // ****************************** ********************* 'రక్తం చిందించకుండా రాజ్యం సాధిస్తాను' అన్నాడు వాడు గౌతమ బుద్దుడు లాంటివాడు  అనుకున్నారు అందరూ  కుట్రపన్ని, వెన్నుపోటుతో ఒక్క రక్తపు చుక్క చిందకుండా వాడు రాజయ్యాడు  వాడు మళ్ళీ అన్నాడు ఈసారి గర్వంగా 'రక్తం చిందించకుండా రాజ్యం సాధించాను' అని  ఎదురు తిరిగిన వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళు తరువాత మళ్ళీ ఎక్కడా కనబడలేదు వాళ్ళ రక్తపు చుక్కలు చిందాయో లేదో  ఎవరికీ తెలియదు చరిత్రలో ఆ విషయం రాయబడలేదు రాజ్యాన్ని రక్షించటానికి ప్రజలను పాలించటానికి తన జీవితాన్ని అతడు త్యాగం చేశాడు అని వాడి జనాలు అన్నారు  చరిత్ర ఆ విధంగా రాయబడ్డది భవిష్యత్తరాలు వాడి చరిత్రను స్ఫూర్తిగా చదువుకున్నాయి

... రంధ్రాన్వేషణ

వంశీ కలుగోట్ల // ... రంధ్రాన్వేషణ // ****************************** **** పరిచిన గొంగళి మీద కూచుని అన్నం తింటున్నారు వాళ్లిద్దరూ  నా అన్నంలో వెంట్రుకలొచ్చాయి అన్నాడు వాడు నా అన్నంలో కూడా వచ్చాయి అన్నాడు వీడు * వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారు ...  ఏ దేవుడు చెప్పాడు వాడిని చంపమని అని అడిగాడు వాడు ఏ జంతువు అడిగింది తనను తినమని ఎదురు ప్రశ్నించాడు వీడు  నీ ప్రార్థనాలయంలోకి వాడినెందుకు రానివ్వట్లేదు అని అడిగాడు వాడు నీ ప్రార్థనాలయ ప్రవేశానికి నీవెందుకు అన్ని నిబంధనలూ అడ్డంకులూ పెట్టావు అని అడిగాడు వీడు  నీ చరిత్ర అంతా అహంకారపు అణచివేతలే అన్నాడు వాడు నీ చరిత్ర అంతా విద్వేషపూరిత హత్యలే అని వీడన్నాడు ... ... ... ఒకటా రెండా ... తిన్నది అరిగేదాకా ఇద్దరూ ఒక్కొక్కరి తప్పులు/రంధ్రాలు అన్వేషించుకుంటూనే ఉన్నారు * మళ్ళీ గొంగళి మీద కూచుని అన్నం తింటున్నారు వాళ్లిద్దరూ వెంట్రుకలు వెతుక్కుంటూ రంధ్రాన్వేషణకి సిద్ధమవుతూ ...

... ఒక నేను

వంశీ కలుగోట్ల // ... ఒక  నేను // ****************************** నిన్నటి గతాన్ని గుర్తుగా  రేపటి భవిష్యత్తును కలగా  ఇవ్వాళ్టి వర్తమానాన్ని శ్రమగా  కొన్ని అబద్దాలు  కొన్ని నిజాలు కలబోసి  అన్నింటినీ మూటగట్టి విసిరేస్తే  'నేను'గా ఇక్కడకొచ్చి పడ్డాను  * భవిష్యత్తు కోసం నేనిక్కడ పునాదులు వేస్తుంటే గతం కోసం వాళ్ళు గోతులు తవ్వుతున్నారు

... ఎప్పటికీ ఉంటారు

వంశీ కలుగోట్ల // ... ఎప్పటికీ ఉంటారు // ****************************** ********* అన్నీ పంచుకోవాలి అనుభవించి ఆస్వాదించాలి నువ్వు నా దగ్గరనుండి సంతోషం మూటగట్టుకెళ్ళాలి * నేను నీ తోడుగా ఉండాలి కానీ, నేను లేకుండా కూడా నువ్వు ఎదగాలి * నీకోసం నిలబడతాను అనేది మాట కాదు శ్వాసను నింపుకున్న దేహం * చెరువు గట్టో, సముద్రపు ఒడ్డో గుడి వెనకో, సత్రం అరుగో స్థలాలు మారుతుంటాయి కానీ, స్నేహం మారదు * సాయంత్రాలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి కానీ, స్నేహితులు మాత్రం ఎప్పటికీ ఉంటారు - మనలా

... వెంటాడే గాయాలు

వంశీ కలుగోట్ల // ... వెంటాడే గాయాలు // **************************************** 1 ఎదో ఆవేదన ... గుండెను తడుతూనే ఉంది ఎందుకు? కలలుగన్న తీరాలకు కలిసి సాగుదామని వేసుకుంటున్న రహదారికి తూట్లు పొడిచి నిజమని నమ్మిన మిత్రుడు నమ్మకద్రోహం చేసినందుకా ? దారి మారింది కనుక ఇక అవసరం లేదనుకుని ఒక్కమాటా చెప్పకుండా వెళ్ళిపోయింది 'స్నేహితుడు' అయినందుకా? 2 ప్రతి ప్రస్తుతానికీ ఒక గతముంటుంది ప్రతి ఆవేదనకూ వెనుక ఒక ద్రోహం ఉంటుంది ప్రతి 'విడిపోవడం' వెనుక ఇద్దరు వ్యక్తుల అహం ఉంటుంది రెండు తప్పులుంటాయి  తన సమస్యేమిటో నా తప్పేమిటో అర్థం కాలేదు బహుశా రెండూ ఒకటేనేమో ... 3 ఎవరన్నారు ప్రేమలో విఫలమైతేనో విడిపోతేనే అయ్యే గాయం మాత్రమే వెంటాడుతూ ఉంటుందని స్నేహంలో ఒక ద్రోహమో, విడిపోవడమో వెంటాడటం కాదు గాయపరుస్తూనే ఉంటుంది 4 ప్రయత్నమే కానీ వెంటాడే గాయానికి అక్షరం ఏమాత్రం న్యాయం చేయగలదు? గుండెకు మాత్రమే తెలుసు గాయం స్రవించే రక్తపు చుక్కల లెక్క 5 ఒక బంధం తెగినపుడు తప్పెవరిదో తెలీదు  కాలంతో సాగుతున్నప్పుడు గాయం వెంటాడ

బతుకమ్మ పాట

ఎప్పుడో 2002/03 సంవత్సరంలో రాసిన బతుకమ్మ పాట ఇది. అప్పట్లో నల్గొండ జిల్లాలోని కీసర, బొమ్మలరామారం దగ్గర్లో ఉన్న సాయిధామమ్ ఆశ్రమ పాఠశాలలో తెలుగు మరియు గణిత అధ్యాపకుడిగా పనిచేసిన రోజుల్లో సహోద్యోగిని సుజాత గారి అభ్యర్థన మేరకు, తాను ఇచ్చిన సమాచారం ఆధారంగా రాశాను. ఇందులో తప్పులున్నాయని అనిపిస్తే చెప్పవలసిందిగా మనవి; అలాగే ఆ తప్పులకు మన్నించమని కూడా. ఎందుకంటే నాకు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలతో పెద్దగా పరిచయం లేదు, అప్పట్లో అక్కడి సహోద్యోగులు ఇచ్చిన సమాచారం, ప్రోత్సాహంతో తెలిసిన వివరాలతో రాశాను. మరో విషయం - సుజాత టీచర్ గారి ఆధ్వర్యంలో ఈ పాట సాయిధామమ్ ఉన్నత పాఠశాల తరగతి విద్యార్థినులు నృత్యరూపకంగా ప్రదర్శించి మండలస్థాయి బహుమతి గెలుచుకున్నారు. వంశీ కలుగోట్ల // బతుకమ్మ పాట // ****************************** ************ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో తల్లితండ్రుల కలల రూపంగా ఉయ్యాలో గౌరమ్మ పుట్టింది ఉయ్యాలో గౌరమ్మ వెలసింది ఉయ్యాలో గౌరమ్మ ఎదిగింది ఉయ్యాలో బడిలోన జేరింది ఉయ్యాలో చదువు సంధ్యల్లోన తానే మేటి ఉయ్యాలో చదువు సంధ్యల్లోన తానే సాటి ఉయ్యాలో గౌరమ్మ

... నేను

వంశీ కలుగోట్ల // ... నేను // **************************** 1 నేనంటే ఏమిటని చెప్పుకోవడానికేమీ లేదు గత కాలపు ఘన చరిత్రకు మొండిగోడలు సాక్ష్యంగా మిగిలిపోయిన ఒక గ్రామానికి/దేశానికి చెందిన వాడిని 2 జ్ఞాపకాలలో మాత్రమే బ్రతుకుతూ రోజులు గడిపే వృద్దుడిని కాను మాటలు మాత్రమే చెప్పే మేధావిని కాను వర్తమానంలో గతాన్ని పునరుజ్జీవింపజెయ్యాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో కలిసివచ్చిన కొందరితో చేతనైన ఆచరణతో బతుకుతున్న మామూలోడిని 3 గతమంటే  యుద్దపు గాయాలు వర్గపోరాటాలు మిగిల్చిన జ్ఞాపకాలు మతాలు పంచిన మూర్ఖత్వాలు మాత్రమే అని కొట్టిపడేసే మేధావుల/జ్ఞానుల మధ్యలో నాలాంటి మామూలోడు అజ్ఞానే అవుతాడు

... పోవాల్సింది నీ ప్రాణం కాదు

వంశీ కలుగోట్ల // ... పోవాల్సింది నీ ప్రాణం కాదు // ********************************************** నీది మరణం త్యాగం కాదు అవకాశవాదులకు ఊతమిచ్చే ... అసందర్భపు చావు ప్రపంచానికి తిండి పెట్టే కష్టం నీది ప్రకృతితో పోరాడిన చరిత్ర నీది ఇవ్వాళ రాజకీయాలకు తలొంచుతున్నావా! నీ అస్థిత్వానికి ముప్పు తెచ్చే దార్శనికులు రాజ్యమేలుతున్న కాలమిది నువ్వు వెన్ను చూపి వెళ్ళిపోతే పోరాటం మాని నిష్క్రమిస్తే నీకు భవిష్యత్తు లేకుండా చేస్తారు నీవు లేకపోతే భవిష్యత్తే లేదని పొలం లేకపోతే తిండే ఉండదని అర్థం కాని నాయకులు దార్శనికులుగా కొనియాడబడుతూ అధికారం వెలగబెడుతున్నారిక్కడ ఇటువంటి సమయంలో నీవు వల్లకాదని నిష్క్రమిస్తే పోరాటం ఆపి ప్రాణం వదిలేస్తే భవిష్యత్తు అంతా అంధకారమే నువ్వు మొదలైంది పోరాటంతో నీకంటూ అంతముందంటే అది పోరాటంతోనే కావాలి ... బలవన్మరణంతో కాకూడదు  పొలంలో కలుపును తియ్యటమే కాదు సమాజంలో కుళ్ళును కడిగెయ్యటం కూడా వ్యవసాయమే అవుతుంది ...  రైతన్నా లే ... వ్యవసాయం మొదలెట్టు పోలలోనో కాకపొతే సామాజంలోనో కానీ, పోవాల్సింది నీ ప్రాణం కాదు

నీవెవరని?

వంశీ కలుగోట్ల// నీవెవరని? // **************************** నీ మరణం  వంద కాగడాలు వెలిగిస్తుందట  నువ్వేమన్నా   చమురువా  నీ మరణం  వంద ప్రశ్నలను రేకెత్తిస్తుందట  నువ్వేమన్నా ప్రశ్నల పొత్తానివా    నిష్క్రమించిన తరువాత  నువ్వు అన్నీ అవుతావు  బతికున్నప్పుడే  ఎవరికీ ఏమీ కావు    ఒకవైపున  అణగదొక్కాలని ప్రయత్నించేవాడు  మరోవైపున  అండగా నిలబడలేని వాడు  మరింకోవైపున  వాడుకోవాలని చూసేవాడు  వీరందరి మధ్యన ఉండి  బతికినా చచ్చినా  అమ్మకపు వస్తువేనని అర్థమయ్యి  నిష్క్రమించావా  ఉన్నప్పుడు ఏమి సాధించావో  నీకైనా తెలుసునో లేదో కానీ  నీ మరణం మాత్రం  చాలామంది నిరుద్యోగులకు  పని కల్పించింది  నీరసించిన శ్రేణులకు  ఊపునిచ్చింది  పోరాడితే పోయేదేమీ లేదు  బానిస సంకెళ్ళు తప్ప  అని నినదించిన గొంతు  అలసిపోయి  ఎందుకు ఉరితాడుకు వేలాడిందని  ఎంతమంది ఆలోచించారు  వీళ్ళందరూ ఇంతే  నీ మరణం గురించి తప్ప  బతుకు గురించి  ఆలోచించని మహానుభావులు  నీ/మీ లాంటోళ్ళ చావులు  కొందరికి పండగ  దండగమారి చావుల మధ్య  ఉలిక్కిపడేలా చేసిన  నీ చావులాంటి చా

... బ్రతకాలి

వంశీ కలుగోట్ల // ... బ్రతకాలి // ****************************** 1  పోరాటం చేతకాకో ... అవమానాలను, అసమానతలను వివక్షను తట్టుకోలేని అసహనంతోనో ఇంతకుముందరి వాళ్ళలా స్ఫూర్తి జ్యోతి అవుదామనే కోరికతోనో తమ్ముడూ నువ్వు నిష్క్రమించావా ...  నీ చావు కొందరికి అవకాశం కల్పించింది రాజకీయనిరుద్యోగులకు ఊతమిచ్చింది   నీ నెత్తుటి మరకలు పులుముకున్న కాగితాలపై రాసిన కవితలూ, నినాదాలూ జెండాలై ఎగురుతూనే ఉంటాయి నీలాంటి మరొకడు నిష్క్రమించేవరకూ  2 కిరణమై వెలుగును చిమ్మి ఉత్తేజాన్ని ఇవ్వవచ్చునేమో కానీ, నీ మరణం బాధిస్తుంది  అన్యాయాన్ని ఎత్తి చూపుతుందేమో కానీ, అశృవులను రాల్పిస్తుంది అయినవాళ్లను ఒంటరిని చేస్తుంది  ఉద్యమానికి ఊపిరి పోయవచ్చు సంచలనాలు సృష్టించవచ్చు కానీ, తమ్ముడూ నీ మరణం కుటుంబలో వెలితిని సృష్టిస్తుంది  నువ్వు బ్రతకాలి, పోరాడాలి నీ మరణం కాదు నీ పోరాటం స్ఫూర్తినివ్వాలి

... సమాధానాలు

వంశీ కలుగోట్ల // ... సమాధానాలు // ****************************** ******   ఎన్నిసార్లు ప్రేమిస్తావని అడిగాడు ఎన్ని ఉదయాలు నిద్రలేస్తావని అడిగితే ఏమని చెప్పాలి? చచ్చే రాత్రివరకూ ప్రతి ఉదయమూ మేలుకుంటూనే ఉంటాం కదా   *                *                * ఎన్నిసార్లని పక్కవాడిని నమ్ముతావు తగిలిన వెన్నుపోట్లు చాల్లేదా అని అడిగాడు సముద్రపు ఒడ్డున కూచున్నప్పుడు ఎన్ని కెరటాలను లెక్కపెట్టావంటే ఏమని సమాధానం చెప్పాలి? పడిపోయిందని లెక్క పెట్టటం ఆపనా ఎగసిందని లెక్క పెడుతూనే ఉండనా   *                *                * ఎన్ని రాతలని రాస్తావు ఎవడైనా మారాడా అని అడిగాడు మార్పు కోసం ఎన్ని పోరాటాలు జరగాలి అని అడిగితే ఏమని చెప్పాలి? మారేవరకూ పోరాటం ఆగదు కదా *                *                * హృదయంలోని భావాలను రసాయనాల త్రాసులో కొలిచేవాడికి ఆ భావ సంచలనాలేమి తెలుస్తాయి ఆ సమాధానాలేమి అర్థమవుతాయి

... సినిమా తీయాలి

వంశీ కలుగోట్ల // ... సినిమా తీయాలి // ****************************** *********** అలుపెరగని ప్రయత్నాల ఫలితంగా  మొత్తానికి నిర్మాత ఒకడు దొరికాడు  'మాంచి కథ ఏదైనా ఉంటే తీసుకురా  సినిమా తీద్దాం' అని భరోసా ఇచ్చాడు  హార్రర్ కథ తయారు చేసుకుని  నిర్మాత దగ్గరకు తీసుకెళ్ళాను  బూతు సీన్లేన్ని రాశావని అడిగాడు  అసలు బూతే లేదని చెపితే  కథ మార్చి తీసుకురమ్మన్నాడు  సరేనని, ఈసారి హాస్యరసంతో  మరో కథ రాసుకుని వెళ్ళాను  బూతు సీన్లేన్ని రాశానని అడిగాడు  బిక్కమొహమేసుకుని వెనక్కొచ్చాను  ఈసారి మాంచి పవర్ఫుల్  మాస్ మసాలా కథ రాసుకుని వెళ్ళాను  మళ్లీ, బూతుసీన్ల లెక్క అడిగాడు  తానడుగుతూన్నది వదిలేసి కథలు మాత్రమే రాస్తున్న నావేపు అదోరకం జాలిగా చూస్తూ  'కథలు రాయడం రాదా?' అని అడిగాడు  నాకు కథలు రాయడం రాదో  లేక కథలంటేనే బూతో అర్థం కాలేదు

అసురుడెవ్వడు ...

వంశీ కలుగోట్ల // అసురుడెవ్వడు ... // ****************************** *******   నీ లోలోపల దాచి ఉంచిన అసురుడిని పురాణాలలో వెతుకుతావెందుకు?  ఎపుడో వేల సంవత్సరాల  క్రితం ఎవరో రాసింది నిజమో లేక కల్పనాచాతుర్యమో సురుడెవ్వడు అసురుడెవ్వడు అంటూ మీమాంస ఇప్పుడెందుకు? మిత్రమా, ఇప్పుడు కావలసింది అదంతా నిజమా లేక కల్పనా సురుడెవ్వరు అసురుడెవ్వరు అంటూ తీర్పులు కాదు అసలుదే అబద్ధమన్నపుడు అందులోని విషయాల గురించి ఇక రచ్చ ఎందుకు  ఆ పురాణాలు దాటొచ్చి చూడు భూములు మింగుతున్న బకాసురులు లక్షల కోట్లు సరిపోని వాతాపి ఇల్వలులు భవిష్యత్తును మింగేస్తున్న రాహుకేతువులు జీవితాలను నాశనం చేస్తున్న భస్మాసురులు ఒకరా ఇద్దరా లెక్కకు మిక్కిలిగా నీ చుట్టూ మనుతూనే ఉంటే  వారందరినీ వదిలేసి పురాణాల మీద పడ్డావేమిటి  ఈనాటి అసురులు  నీకంటూ భవిష్యత్తేమైనా మిగిలిస్తే ఆ పురాణాల నిగ్గు  ఎప్పటికైనా తేలగొట్టవచ్చు 

... వెలుగుపువ్వు

వంశీ కలుగోట్ల // ... వెలుగుపువ్వు // ****************************** ****** నువ్వెప్పుడూ కానరాని తీరానివే  ఎంత పరిగెత్తినా చేరలేని గమ్యానివే  నీ పరిచయం ప్రేమని పుట్టించింది  నీ విరహం జ్వాలను రగిలించింది  నీ ఊహ ఉత్తేజాన్ని నింపింది  నువ్వు మాత్రం ఏమీ చేయకుండా  అలా చూస్తూ వెళ్ళిపోతావు  ఏమీ చెయ్యలేదని నీవంటావు  చెయ్యకపోవడమేమిటి  వెళుతూ వెళుతూ నువ్వు చూసే ఆ చూపు  వీడ్కోలు చెప్పే నీ చెయ్యి  'ఉంటానంటూ' వెళ్లిపోయే నీ రూపం  నరనరాన నిండిపోయి నీ వైపే లాగుతూంటే  ఏమీ చెయ్యకపోవటమేంటి  ఒక్కో సాయంత్రాన్ని నువ్వు తీసుకెళ్తుంటే  ఎన్ని ఉదయాలని మోసుకురమ్మంటావు  వెన్నెలలన్నీ నీకిచ్చి అమావాస్య అయ్యాను  ఇప్పుడు వెలుగు లేదని వద్దంటే ... ఎలా  నీ నీడనయ్యాక నా వెలుగు ఇంకా ఇంకెక్కడుంది ప్రేమని పుట్టించిన నీవే  నిర్దాక్షిణ్యంగా చంపేస్తానంటే  చంపేసి, ఒక వెన్నెలని నాటి పో నీకోసం వెలుగు పువ్వై పూస్తాను ... 

నువ్వెప్పుడూ అనూహ్యమే ...

వంశీ కలుగోట్ల // నువ్వెప్పుడూ అనూహ్యమే ... // ****************************** ****************** తలుపు వెనకనుండి తొంగి చూస్తూ కొంటె చూపులతో తడుముతావనుకున్నాను బిగికౌగిలితో ఉక్కిరిబిక్కిరి చేస్తావనుకోలేదు * సిగ్గుతో ముద్దబంతిలా అవుతావనుకున్నాను ఉత్సాహంతో ఎగసే ఉప్పెనవుతావనుకోలేదు * ఆలస్యానికి చిరాకుపడతావేమోననుకున్నాను కానీ, చిరుముద్దుతో ఆహ్వానిస్తావనుకోలేదు * దూరంగా ఉండబోతున్నామంటే బాధనుకున్నాను దగ్గరితనపు ఆనందాన్ని మోసుకొస్తావనుకోలేదు * నువ్వు నిజమేననుకుని అందుకోబోయాను అందమైన ఊహవై దూరంగా వెళ్ళిపోయావు ... * పరిమితులకు లోబడిన నా ఆలోచనలకు నీ ఊహ ... నువ్వు, ఎప్పుడూ అనూహ్యమే

... నీడలు

వంశీ కలుగోట్ల // ... నీడలు // ************************** నువ్వు కూచున్నది చెట్టు కింద కాదు పడగ నీడన  రా, ఇజాల మాటున వెలుతురు సోకని నీడలు నీకెందుకు ? నిజం నీడలా ఉండదు నీరెండలా హాయినివ్వదు మధ్యాహ్నపు ఎండలా భగ భగ మండుతుంటుంది నిజం తెలుసుకోవాలంటే వెలుతురులోకి వెళ్ళటమొక్కటే దారి ఆ దారికి దివిటీలు లేవు మార్గదర్సకులూ లేరు  ఎవరెన్ని పలుకులు పలికినా ప్రతి ఇజమూ ఒక నీడే ప్రతి మతమూ ఒక పడగే  పడగల నీడల మాటున రోజులు గడిపేస్తావో నిజం కోసం నీడలను వదిలి వెలుగువైపు సాగుతావో ...

... మనసా

వంశీ కలుగోట్ల // ... మనసా // ****************************** * చప్పట్లు కొట్టే చేతులు వహ్వాపలికే గొంతులు  అండ నిలబడతాయని వెర్రిగా నమ్మేవెందుకే మనసా  గాలికి పోయేది నీటి ఉరవడికి కొట్టుకుపోయేది  నిలబడి చూస్తే నీ దగ్గరకొచ్చేనా మనసా  వీడు చెప్పేది విని వాడు చెప్పేది చేసి  సొంత గొంతు వినక వెర్రిగ ఊరేగుతున్నావే మనసా

... లెక్కల్లో తేడా

వంశీ కలుగోట్ల // ... లెక్కల్లో తేడా // **************************************** ఈ దేశంలో ...  జీవన విధానాలు క్షీణిస్తూనే ఉన్నాయి  ఇక్కడ పుట్టిన విధానాలు విమర్శలకు  గురవుతూనే ఉన్నాయి  పరాయి గడ్డపై పుట్టిన మతాలు  సంఖ్యాపరంగా విస్తరిస్తూనే ఉన్నాయి  జనాల నమ్మకాలతో  డబ్బు చేసుకోవడానికి  దైవ దూతల రూపంలో వ్యాపారులు  పుట్టుకొస్తూనే ఉన్నారు  ఈ దేశంలో ...  పాలకులు తిరగటానికి  ప్రత్యేకవిమానాలకు డబ్బులుంటాయి  కానీ, పాయిఖానాల నిర్మాణానికి  పాఠశాలల నిర్మాణానికి డబ్బుండదు  కావాలంటే  ఈ దేశంలో ఎవడినైనా పిలిచి  ప్రశ్నించి చూడు  'ఆలయం కానీ, చర్చి కానీ, మసీదు కానీ  లేని ప్రాంతాలెన్ని ఉన్నాయి?' అని  మళ్లీ మరోసారి అడిగి చూడు  'పాఠశాలు, పాయిఖానాలు లేని ప్రాంతాలెన్నని' లెక్కల్లో ఎంత తేడా ఉందో తెలుస్తుంది 

... మేధావి

వంశీ కలుగోట్ల // ... మేధావి // ****************************** గొప్ప గొప్ప పుస్తకాలన్నీచదివి మేధావిత్వం ఒంటబట్టిన తరువాత దేవుడు లేడని, ఉంటే ఒక్కడే అని మతాలన్నీ మాయలే అని నేనున్నాను ఎదురెళ్ళిన నన్ను చూసి పామరుడొకడు 'నమస్కారం సామీ' అన్నాడు మనిషిలో దేవుడిని చూడగలిగిన ఆ పామరుడి అమాయకత్వం ముందు దేవుడి తత్వంలో కూడా మంచిని చూడలేని నా మేధావిత్వం వెలవెలబోయింది

... దృష్టి

వంశీ కలుగోట్ల // ... దృష్టి // *************************** దేశాలన్నీ తిరిగొచ్చాక నేనన్నాను ప్రపంచం చిన్నది అని ఇంటిబయట అరుగు మీద కూచుని ఆకాశం చూసి వాడన్నాడు అవును, ప్రపంచం చాలా చిన్నది అని *                  *                  * ఊరొదిలి పోయి, కష్టాలు పడి ఒక ఉద్యోగం సంపాదించాక నేనున్నాను బతకాలంటే పోరాడాలి అని ఉన్న ఊర్లో వ్యవసాయం చేస్తూ సాయంకాలం ఇంటికొచ్చాక వాడన్నాడు అవును, బతకాలంటే కష్టపడాల్సిందే అని *                  *                  * సౌండ్ ప్రూఫ్ రూంలో కూచుని ఇంస్ట్రుమెంటల్ మ్యూజిక్ వింటూ నేనన్నాను సంగీతం ఒక అద్భుతం అని గాలికి ఊగుతున్న పైరు సవ్వడి చెట్లమీద పక్షుల కూతలు వింటూ వాడన్నాడు అవును, సంగీతం అద్భుతం అని

... వార్తలు/వాస్తవాలు

వంశీ కలుగోట్ల // ... వార్తలు/వాస్తవాలు // *************************************** ఒక భారీ వర్షం  నగరాన్ని పలకరించిన వేళ  మురుగునీటి ఉధృతికి  మాన్ హోల్ మూత తెరుచుకుంది  అవసరమైనదేదో కొందామని  ఇంటినుండి బయటకొచ్చిన సామాన్యుడు  దానికి బలయ్యాడు ఒక కుటుంబం బాధ పడింది  మరుసటి రోజున  పత్రికల్లో అదొక వార్తగా వచ్చింది *                 *                 * బాధ్యతలు తరుముతుంటే  బతుకు పోరాటంలో భాగంగా  రోజూలానే వాడు బైక్ మీద  ఆఫీసుకి బయల్దేరాడు తాగుడు హైజాక్ చేసిన మనిషొకడు  డ్రైవర్ గా నడుపుతున్న లారీ ఒకటి  వెనకనుండి వాడిని గుద్దింది  తప్పిచుకునే అవకాశమూ లేదు  వాడి జీవితం అక్కడే ముగిసిపోయింది ఒక కుటుంబం బాధ పడింది  మరుసటి రోజున  పత్రికల్లో అదొక వార్తగా వచ్చింది *                 *                 * రోజూలానే సాయంకాలం  తన హాస్టల్ గదికి తిరిగొచ్చింది ఆ అమ్మాయి  తెలియదు ఆ అమ్మాయికి  కాలేజ్ లో  తనను కోరిక తీర్చమని అడిగిన పశువుది   పక్క గదిలో ఉండే సీనియర్ అమ్మాయిదీ  ఒకటే కులమని, తనది వేరే కులమని  తెలుసుకుని అర్ధమయ్యేసరికి  ఉరితాడుకు ఆ జీవితం  బలైపో

... ప్రేమించటానికే తీరిక లేదు

వంశీ కలుగోట్ల // ... ప్రేమించటానికే తీరిక లేదు  // ****************************** ************************** వాడొచ్చాడు నా ఇంటికి  అదేదో మతాన్ని, ఇంకేదో పద్ధతిని  మనల్ని తిడుతున్న ఆ వర్గాన్ని  ద్వేషించమన్నాడు  పుట్టినతరువాత  అందరూ అంటగట్టిన కులాన్ని/మతాన్ని  పరిరక్షించుకోవాలంటూ  నాకు కర్తవ్యబోధ చేయసాగాడు 'ప్రకృతిని, ప్రపంచాన్ని  మానవత్వాన్ని, మనిషిని  ప్రేమించటంలో  నేను తీరికలేకుండా ఉన్నాను  ద్వేషించేంతటి సమయం నాకు లేదు'  అని చెప్పాను  ఆ వర్గంలో/కులంలో/మతంలో  చెడబుట్టానని తిడుతూ వెళ్ళిపోయాడు  ఆ ఆవేశం  చూస్తుంటే జాలేసింది  అసలు తత్వం తెలుసుకోలేక  గిరి గీసుకుని  తనను తాను ఒక పరిమితుల చట్రంలో  బంధించుకుంటున్న ఆ మేధావిని చూసి 

... నేల దుఃఖం

వంశీ కలుగోట్ల // ... నేల దుఃఖం // ****************************** ఆ దారి తాను వేసిందేనని వాడు అందరితో అంటున్నాడు తరాల తరబడి అక్కడే ఉన్న నేల అది విని దుఃఖించింది బాధతో  తన నుంచి వేరు చేయబడిన వృక్షాల సంఖ్యను లెక్కించుకుంటూ తనలో తాను అనుకుంది 'ఇంతవరకూ ముందుకు నడవడానికి గమ్యం చేరటానికి దారులు వేసుకునే వాళ్ళను చూసాను తమ పతనానికి తామే దారులు వేసుకుంటున్న వాళ్ళని మొదటిసారి చూస్తున్నాను'

వాడు ... వీడు ... ఇంకోడు ...

వంశీ కలుగోట్ల // వాడు ... వీడు ... ఇంకోడు ... // ****************************** *********************** 1 వాడెవడో అన్నాడు  నన్ను మించినోడు లేదు  నా అంతటి దార్శనికుడు లేడు  ప్రపంచానికే పాఠాలు చెప్పాను  అభివృద్ధికి దారి వేశాను  మీరు సాగిపోండి అని  సాగుతున్న జనానికి  కాసేపటికి అలుపొచ్చాక  సేదదీరదామని చూస్తే  నీడనివ్వటానికి చెట్టూ లేదు  తిండి పెట్టటానికి పొలమూ లేదు  దార్శనికత అందించిన ఫలితాలు  అర్థమయ్యాయో లేదో  2 పెరటిలో ఉన్న చెట్టు  సొంత వైద్యానికి పనికి రాదంట  తాను ఊరందరికీ  ధైర్యాన్నివ్వడానికి ఎప్పుడూ సిద్ధమే  కానీ, తన బాధను తీర్చేవారు లేరని  భరించలేని బాధ  ఎవరికెవరీ లోకంలో  ఎవరి బాధకు ఎవరు ఓదార్పు  దేవుడే చూసుకుంటాడు  కానీ, ప్రయత్నం ఆగదు  ఆశ ఆగనివ్వదు కదా  3 ఎంత ...తనముంటే ఏమి లాభం  ఊరందరి పెళ్ళిళ్ళకూ వెళ్లడమే తప్ప  తనకు పెళ్ళి కావటం లేదు  అందరి పెళ్ళిళ్ళలో  వంటకాలు బావున్నాయనడమే తప్ప  పెళ్ళి భోజనం పెట్టే యోగం లేదేమో  ఊరందరికీ ఏనాడో ఒకనాడు  తానూ నచ్చనా  అందరూ కలిసి  తనకూ పెళ్ళి చేయకపోతారా అని  ఎదురు చూపులు ఎప్పటికి తీరతాయో కోర

... అర్థమవ్వాలి

వంశీ కలుగోట్ల // ... అర్థమవ్వాలి // ********************************* వాడు వేరు ఇంకోడు వేరని అర్థం చేసుకోవటానికి వాడికి గొడవ అవసరమయ్యింది *             *             * మాటకూ మౌనానికి మధ్య తేడా అధికారమేనని తెలుసుకోవటానికి వాడికి పదవి అవసరమయ్యింది *             *             * తనది అనుకున్న ప్రతిదీ తనది కాదని తెలుసుకోవటానికి వాడికి మరణం అవసరమయ్యింది

నన్ను నాకిచ్చెయ్యి

వంశీ కలుగోట్ల // నన్ను నాకిచ్చెయ్యి // ******************************************* నాలోంచి నేను పారిపోవాలనిపిస్తుంది  నీతో ధైర్యం చేసి మాట్లాడలేనప్పుడు  నన్ను నేను కొత్తగా చూసుకున్నాననిపిస్తుంది  నీ కళ్ళలో నన్ను చూసుకున్నప్పుడు  నీతో మాట్లాడగలిగిన ప్రతిక్షణం  ఒక జీవితమంత విలువైంది నాకు  నీవు పాట పాడుతున్నప్పుడు  నేను గాలినై అందులో కలిసిపోవాలనిపిస్తుంది  అనుక్షణం నీ చూపు వెంటాడుతుంటే  నీ ఊసులు మదిని కదిలిస్తుంటే  పారిపోలేక నిను ప్రార్థిస్తున్నా  నాన్ను నాకు తిరిగి ఇచ్ఛేయ్యామని ...  ఎందుకంటే నాలోని నేను  ఎప్పుడో నీ నీడనయ్యాను గనుక 

శుభాకాంక్షలు

వంశీ కలుగోట్ల // శుభాకాంక్షలు //  ************************************ సూర్యుడికన్నా ముందే  నీకు శుభాకాంక్షలు చెప్పాలనుంది  పరిమళించిన గులాబీని  నీ చెంతకు చేర్చాలనుంది  ఉషోదయ కిరణాల కాంతిలో  మెరిసే నీ కన్నుల్లో  నా సంతోషాన్ని చూసుకోవాలనుంది  చిరుగాలి స్వరాలు పేరుస్తోంటే  ప్రకృతి అంతా నా చెంత నిలిచి  నీకోసం ఎదురు చూస్తోంది  నాకన్నా ముందు నీకు  శుభాకాంక్షలు చెప్పాలని 

ద్వి ...

వంశీ కలుగోట్ల // ద్వి ... // ************************* మొదటి అడుగు పడినప్పుడు వాళ్ళందరూ 'ఏం చేశాడురా?' అన్నారు ప్రయాణం పూర్తయ్యాక వాళ్ళందరూ 'ఏంచేశాడురా!' అన్నారు *              *              * వెలుతురు భరించలేక వాళ్ళందరూ చలువ కళ్లద్దాలు పెట్టుకున్నారు రాత్రయ్యాక చీకటయ్యిందని వాళ్ళందరూ దీపాలు వెలిగించి కూచున్నారు *              *              * బతుకు కోసం ఊరొదిలితే వాళ్ళందరూ 'పిరికోడు' అన్నారు ఉద్యోగం కోసం దేశం వదిలితే వాళ్ళందరూ 'గొప్పోడు' అన్నారు *              *              * పలకరింపుగా నమస్కరిస్తే వాళ్ళందరూ నన్ను పట్టించుకోలేదు ఎన్నికలప్పుడు నమస్కరిస్తే వాళ్ళందరూ నన్ను నాయకుడని అన్నారు

నాస్టాల్జియా అనబడు జ్ఞాపకాలు ...

వంశీ కలుగోట్ల // నాస్టాల్జియా అనబడు జ్ఞాపకాలు ... // ****************************** ************************* ఊరు దాటి వెళ్లాలంటే  సమయానికి అందగలిగితే ఆర్టీసీ బస్సు  లేదంటే ఎడ్ల బండి అంతే  అదీ కాదంటే పదకొండో నంబరు బస్సు (కాలినడక) బస్టాండ్ దగ్గర ఒకవైపు ఒక కోనేరు  మరోవైపు ఒక పెద్ద వేపచెట్టు, దాని కింద అరుగు  అమ్మానాన్నలకు ఎలా ఉండేదో తెలీదు కానీ  బస్సు ఎంత ఆలస్యమయినా  మాకు విసుగుండేది కాదు  వనభోజనానికో లేక  విహారయాత్రకో వెళ్లినట్టుండేది  *                *                * మా ఊరి నుండి కర్నూలుకి  వెళ్ళేటప్పుడు కానీ, వచ్ఛేప్పుడు కానీ  రోడ్డుకు ఇరువైపులా  రహదారి మీదకి వంగినట్టు ఉండే  చెట్లను చూస్తే భలే ఉండేది  నడి వేసవి కాలంలో కూడా  ఆ దారిలో పయనం బావుండేది  *                *                * ఇప్పుడు ఆ బస్టాండ్ దగ్గరకు వెళితే  ఒక నిరాశవీచిక కమ్మేస్తుంది  అక్కడ కోనేరు లేదు  నిర్మానుష్యంగా నిర్జీవంగా  దూరంగా విసిరేసినట్టు అనిపిస్తుంది  అసలు అక్కడ ఉండాలనిపించట్లేదు  మా ఊరి నుండి కర్నూలుకు  ఇప్పుడు ఆ దారిలో వెళుతుంటే  మనసు అదో ర