... సినిమా తీయాలి
వంశీ కలుగోట్ల // ... సినిమా తీయాలి //
*****************************************
అలుపెరగని ప్రయత్నాల ఫలితంగా
మొత్తానికి నిర్మాత ఒకడు దొరికాడు
'మాంచి కథ ఏదైనా ఉంటే తీసుకురా
సినిమా తీద్దాం' అని భరోసా ఇచ్చాడు
హార్రర్ కథ తయారు చేసుకుని
నిర్మాత దగ్గరకు తీసుకెళ్ళాను
బూతు సీన్లేన్ని రాశావని అడిగాడు
అసలు బూతే లేదని చెపితే
కథ మార్చి తీసుకురమ్మన్నాడు
సరేనని, ఈసారి హాస్యరసంతో
మరో కథ రాసుకుని వెళ్ళాను
బూతు సీన్లేన్ని రాశానని అడిగాడు
బిక్కమొహమేసుకుని వెనక్కొచ్చాను
ఈసారి మాంచి పవర్ఫుల్
మాస్ మసాలా కథ రాసుకుని వెళ్ళాను
మళ్లీ, బూతుసీన్ల లెక్క అడిగాడు
తానడుగుతూన్నది వదిలేసి
కథలు మాత్రమే రాస్తున్న
నావేపు అదోరకం జాలిగా చూస్తూ
'కథలు రాయడం రాదా?' అని అడిగాడు
నాకు కథలు రాయడం రాదో
లేక కథలంటేనే బూతో అర్థం కాలేదు
Comments
Post a Comment