Posts

Showing posts from July, 2016

నీవెవరని?

వంశీ కలుగోట్ల// నీవెవరని? // **************************** నీ మరణం  వంద కాగడాలు వెలిగిస్తుందట  నువ్వేమన్నా   చమురువా  నీ మరణం  వంద ప్రశ్నలను రేకెత్తిస్తుందట  నువ్వేమన్నా ప్రశ్నల పొత్తానివా    నిష్క్రమించిన తరువాత  నువ్వు అన్నీ అవుతావు  బతికున్నప్పుడే  ఎవరికీ ఏమీ కావు    ఒకవైపున  అణగదొక్కాలని ప్రయత్నించేవాడు  మరోవైపున  అండగా నిలబడలేని వాడు  మరింకోవైపున  వాడుకోవాలని చూసేవాడు  వీరందరి మధ్యన ఉండి  బతికినా చచ్చినా  అమ్మకపు వస్తువేనని అర్థమయ్యి  నిష్క్రమించావా  ఉన్నప్పుడు ఏమి సాధించావో  నీకైనా తెలుసునో లేదో కానీ  నీ మరణం మాత్రం  చాలామంది నిరుద్యోగులకు  పని కల్పించింది  నీరసించిన శ్రేణులకు  ఊపునిచ్చింది  పోరాడితే పోయేదేమీ లేదు  బానిస సంకెళ్ళు తప్ప  అని నినదించిన గొంతు  అలసిపోయి  ఎందుకు ఉరితాడుకు వేలాడిందని  ఎంతమంది ఆలోచించారు  వీళ్ళందరూ ఇంతే  నీ మరణం గురించి తప్ప  బతుకు గురించి  ఆలోచించని మహానుభావులు  నీ/మీ లాంటోళ్ళ చావులు  కొందరికి పండగ  దండగమారి చావుల మధ్య  ఉలిక్కిపడేలా చేసిన  నీ చావులాంటి చా

... బ్రతకాలి

వంశీ కలుగోట్ల // ... బ్రతకాలి // ****************************** 1  పోరాటం చేతకాకో ... అవమానాలను, అసమానతలను వివక్షను తట్టుకోలేని అసహనంతోనో ఇంతకుముందరి వాళ్ళలా స్ఫూర్తి జ్యోతి అవుదామనే కోరికతోనో తమ్ముడూ నువ్వు నిష్క్రమించావా ...  నీ చావు కొందరికి అవకాశం కల్పించింది రాజకీయనిరుద్యోగులకు ఊతమిచ్చింది   నీ నెత్తుటి మరకలు పులుముకున్న కాగితాలపై రాసిన కవితలూ, నినాదాలూ జెండాలై ఎగురుతూనే ఉంటాయి నీలాంటి మరొకడు నిష్క్రమించేవరకూ  2 కిరణమై వెలుగును చిమ్మి ఉత్తేజాన్ని ఇవ్వవచ్చునేమో కానీ, నీ మరణం బాధిస్తుంది  అన్యాయాన్ని ఎత్తి చూపుతుందేమో కానీ, అశృవులను రాల్పిస్తుంది అయినవాళ్లను ఒంటరిని చేస్తుంది  ఉద్యమానికి ఊపిరి పోయవచ్చు సంచలనాలు సృష్టించవచ్చు కానీ, తమ్ముడూ నీ మరణం కుటుంబలో వెలితిని సృష్టిస్తుంది  నువ్వు బ్రతకాలి, పోరాడాలి నీ మరణం కాదు నీ పోరాటం స్ఫూర్తినివ్వాలి

... సమాధానాలు

వంశీ కలుగోట్ల // ... సమాధానాలు // ****************************** ******   ఎన్నిసార్లు ప్రేమిస్తావని అడిగాడు ఎన్ని ఉదయాలు నిద్రలేస్తావని అడిగితే ఏమని చెప్పాలి? చచ్చే రాత్రివరకూ ప్రతి ఉదయమూ మేలుకుంటూనే ఉంటాం కదా   *                *                * ఎన్నిసార్లని పక్కవాడిని నమ్ముతావు తగిలిన వెన్నుపోట్లు చాల్లేదా అని అడిగాడు సముద్రపు ఒడ్డున కూచున్నప్పుడు ఎన్ని కెరటాలను లెక్కపెట్టావంటే ఏమని సమాధానం చెప్పాలి? పడిపోయిందని లెక్క పెట్టటం ఆపనా ఎగసిందని లెక్క పెడుతూనే ఉండనా   *                *                * ఎన్ని రాతలని రాస్తావు ఎవడైనా మారాడా అని అడిగాడు మార్పు కోసం ఎన్ని పోరాటాలు జరగాలి అని అడిగితే ఏమని చెప్పాలి? మారేవరకూ పోరాటం ఆగదు కదా *                *                * హృదయంలోని భావాలను రసాయనాల త్రాసులో కొలిచేవాడికి ఆ భావ సంచలనాలేమి తెలుస్తాయి ఆ సమాధానాలేమి అర్థమవుతాయి

... సినిమా తీయాలి

వంశీ కలుగోట్ల // ... సినిమా తీయాలి // ****************************** *********** అలుపెరగని ప్రయత్నాల ఫలితంగా  మొత్తానికి నిర్మాత ఒకడు దొరికాడు  'మాంచి కథ ఏదైనా ఉంటే తీసుకురా  సినిమా తీద్దాం' అని భరోసా ఇచ్చాడు  హార్రర్ కథ తయారు చేసుకుని  నిర్మాత దగ్గరకు తీసుకెళ్ళాను  బూతు సీన్లేన్ని రాశావని అడిగాడు  అసలు బూతే లేదని చెపితే  కథ మార్చి తీసుకురమ్మన్నాడు  సరేనని, ఈసారి హాస్యరసంతో  మరో కథ రాసుకుని వెళ్ళాను  బూతు సీన్లేన్ని రాశానని అడిగాడు  బిక్కమొహమేసుకుని వెనక్కొచ్చాను  ఈసారి మాంచి పవర్ఫుల్  మాస్ మసాలా కథ రాసుకుని వెళ్ళాను  మళ్లీ, బూతుసీన్ల లెక్క అడిగాడు  తానడుగుతూన్నది వదిలేసి కథలు మాత్రమే రాస్తున్న నావేపు అదోరకం జాలిగా చూస్తూ  'కథలు రాయడం రాదా?' అని అడిగాడు  నాకు కథలు రాయడం రాదో  లేక కథలంటేనే బూతో అర్థం కాలేదు

అసురుడెవ్వడు ...

వంశీ కలుగోట్ల // అసురుడెవ్వడు ... // ****************************** *******   నీ లోలోపల దాచి ఉంచిన అసురుడిని పురాణాలలో వెతుకుతావెందుకు?  ఎపుడో వేల సంవత్సరాల  క్రితం ఎవరో రాసింది నిజమో లేక కల్పనాచాతుర్యమో సురుడెవ్వడు అసురుడెవ్వడు అంటూ మీమాంస ఇప్పుడెందుకు? మిత్రమా, ఇప్పుడు కావలసింది అదంతా నిజమా లేక కల్పనా సురుడెవ్వరు అసురుడెవ్వరు అంటూ తీర్పులు కాదు అసలుదే అబద్ధమన్నపుడు అందులోని విషయాల గురించి ఇక రచ్చ ఎందుకు  ఆ పురాణాలు దాటొచ్చి చూడు భూములు మింగుతున్న బకాసురులు లక్షల కోట్లు సరిపోని వాతాపి ఇల్వలులు భవిష్యత్తును మింగేస్తున్న రాహుకేతువులు జీవితాలను నాశనం చేస్తున్న భస్మాసురులు ఒకరా ఇద్దరా లెక్కకు మిక్కిలిగా నీ చుట్టూ మనుతూనే ఉంటే  వారందరినీ వదిలేసి పురాణాల మీద పడ్డావేమిటి  ఈనాటి అసురులు  నీకంటూ భవిష్యత్తేమైనా మిగిలిస్తే ఆ పురాణాల నిగ్గు  ఎప్పటికైనా తేలగొట్టవచ్చు 

... వెలుగుపువ్వు

వంశీ కలుగోట్ల // ... వెలుగుపువ్వు // ****************************** ****** నువ్వెప్పుడూ కానరాని తీరానివే  ఎంత పరిగెత్తినా చేరలేని గమ్యానివే  నీ పరిచయం ప్రేమని పుట్టించింది  నీ విరహం జ్వాలను రగిలించింది  నీ ఊహ ఉత్తేజాన్ని నింపింది  నువ్వు మాత్రం ఏమీ చేయకుండా  అలా చూస్తూ వెళ్ళిపోతావు  ఏమీ చెయ్యలేదని నీవంటావు  చెయ్యకపోవడమేమిటి  వెళుతూ వెళుతూ నువ్వు చూసే ఆ చూపు  వీడ్కోలు చెప్పే నీ చెయ్యి  'ఉంటానంటూ' వెళ్లిపోయే నీ రూపం  నరనరాన నిండిపోయి నీ వైపే లాగుతూంటే  ఏమీ చెయ్యకపోవటమేంటి  ఒక్కో సాయంత్రాన్ని నువ్వు తీసుకెళ్తుంటే  ఎన్ని ఉదయాలని మోసుకురమ్మంటావు  వెన్నెలలన్నీ నీకిచ్చి అమావాస్య అయ్యాను  ఇప్పుడు వెలుగు లేదని వద్దంటే ... ఎలా  నీ నీడనయ్యాక నా వెలుగు ఇంకా ఇంకెక్కడుంది ప్రేమని పుట్టించిన నీవే  నిర్దాక్షిణ్యంగా చంపేస్తానంటే  చంపేసి, ఒక వెన్నెలని నాటి పో నీకోసం వెలుగు పువ్వై పూస్తాను ... 

నువ్వెప్పుడూ అనూహ్యమే ...

వంశీ కలుగోట్ల // నువ్వెప్పుడూ అనూహ్యమే ... // ****************************** ****************** తలుపు వెనకనుండి తొంగి చూస్తూ కొంటె చూపులతో తడుముతావనుకున్నాను బిగికౌగిలితో ఉక్కిరిబిక్కిరి చేస్తావనుకోలేదు * సిగ్గుతో ముద్దబంతిలా అవుతావనుకున్నాను ఉత్సాహంతో ఎగసే ఉప్పెనవుతావనుకోలేదు * ఆలస్యానికి చిరాకుపడతావేమోననుకున్నాను కానీ, చిరుముద్దుతో ఆహ్వానిస్తావనుకోలేదు * దూరంగా ఉండబోతున్నామంటే బాధనుకున్నాను దగ్గరితనపు ఆనందాన్ని మోసుకొస్తావనుకోలేదు * నువ్వు నిజమేననుకుని అందుకోబోయాను అందమైన ఊహవై దూరంగా వెళ్ళిపోయావు ... * పరిమితులకు లోబడిన నా ఆలోచనలకు నీ ఊహ ... నువ్వు, ఎప్పుడూ అనూహ్యమే

... నీడలు

వంశీ కలుగోట్ల // ... నీడలు // ************************** నువ్వు కూచున్నది చెట్టు కింద కాదు పడగ నీడన  రా, ఇజాల మాటున వెలుతురు సోకని నీడలు నీకెందుకు ? నిజం నీడలా ఉండదు నీరెండలా హాయినివ్వదు మధ్యాహ్నపు ఎండలా భగ భగ మండుతుంటుంది నిజం తెలుసుకోవాలంటే వెలుతురులోకి వెళ్ళటమొక్కటే దారి ఆ దారికి దివిటీలు లేవు మార్గదర్సకులూ లేరు  ఎవరెన్ని పలుకులు పలికినా ప్రతి ఇజమూ ఒక నీడే ప్రతి మతమూ ఒక పడగే  పడగల నీడల మాటున రోజులు గడిపేస్తావో నిజం కోసం నీడలను వదిలి వెలుగువైపు సాగుతావో ...

... మనసా

వంశీ కలుగోట్ల // ... మనసా // ****************************** * చప్పట్లు కొట్టే చేతులు వహ్వాపలికే గొంతులు  అండ నిలబడతాయని వెర్రిగా నమ్మేవెందుకే మనసా  గాలికి పోయేది నీటి ఉరవడికి కొట్టుకుపోయేది  నిలబడి చూస్తే నీ దగ్గరకొచ్చేనా మనసా  వీడు చెప్పేది విని వాడు చెప్పేది చేసి  సొంత గొంతు వినక వెర్రిగ ఊరేగుతున్నావే మనసా

... లెక్కల్లో తేడా

వంశీ కలుగోట్ల // ... లెక్కల్లో తేడా // **************************************** ఈ దేశంలో ...  జీవన విధానాలు క్షీణిస్తూనే ఉన్నాయి  ఇక్కడ పుట్టిన విధానాలు విమర్శలకు  గురవుతూనే ఉన్నాయి  పరాయి గడ్డపై పుట్టిన మతాలు  సంఖ్యాపరంగా విస్తరిస్తూనే ఉన్నాయి  జనాల నమ్మకాలతో  డబ్బు చేసుకోవడానికి  దైవ దూతల రూపంలో వ్యాపారులు  పుట్టుకొస్తూనే ఉన్నారు  ఈ దేశంలో ...  పాలకులు తిరగటానికి  ప్రత్యేకవిమానాలకు డబ్బులుంటాయి  కానీ, పాయిఖానాల నిర్మాణానికి  పాఠశాలల నిర్మాణానికి డబ్బుండదు  కావాలంటే  ఈ దేశంలో ఎవడినైనా పిలిచి  ప్రశ్నించి చూడు  'ఆలయం కానీ, చర్చి కానీ, మసీదు కానీ  లేని ప్రాంతాలెన్ని ఉన్నాయి?' అని  మళ్లీ మరోసారి అడిగి చూడు  'పాఠశాలు, పాయిఖానాలు లేని ప్రాంతాలెన్నని' లెక్కల్లో ఎంత తేడా ఉందో తెలుస్తుంది 

... మేధావి

వంశీ కలుగోట్ల // ... మేధావి // ****************************** గొప్ప గొప్ప పుస్తకాలన్నీచదివి మేధావిత్వం ఒంటబట్టిన తరువాత దేవుడు లేడని, ఉంటే ఒక్కడే అని మతాలన్నీ మాయలే అని నేనున్నాను ఎదురెళ్ళిన నన్ను చూసి పామరుడొకడు 'నమస్కారం సామీ' అన్నాడు మనిషిలో దేవుడిని చూడగలిగిన ఆ పామరుడి అమాయకత్వం ముందు దేవుడి తత్వంలో కూడా మంచిని చూడలేని నా మేధావిత్వం వెలవెలబోయింది

... దృష్టి

వంశీ కలుగోట్ల // ... దృష్టి // *************************** దేశాలన్నీ తిరిగొచ్చాక నేనన్నాను ప్రపంచం చిన్నది అని ఇంటిబయట అరుగు మీద కూచుని ఆకాశం చూసి వాడన్నాడు అవును, ప్రపంచం చాలా చిన్నది అని *                  *                  * ఊరొదిలి పోయి, కష్టాలు పడి ఒక ఉద్యోగం సంపాదించాక నేనున్నాను బతకాలంటే పోరాడాలి అని ఉన్న ఊర్లో వ్యవసాయం చేస్తూ సాయంకాలం ఇంటికొచ్చాక వాడన్నాడు అవును, బతకాలంటే కష్టపడాల్సిందే అని *                  *                  * సౌండ్ ప్రూఫ్ రూంలో కూచుని ఇంస్ట్రుమెంటల్ మ్యూజిక్ వింటూ నేనన్నాను సంగీతం ఒక అద్భుతం అని గాలికి ఊగుతున్న పైరు సవ్వడి చెట్లమీద పక్షుల కూతలు వింటూ వాడన్నాడు అవును, సంగీతం అద్భుతం అని