Posts

Showing posts from January, 2016

పిపీలికాలు ...

వంశీ కలుగోట్ల// పిపీలికాలు ... // ************************************* 1 బహుశా ఇంతేనేమో  మనిషంటే ఒక పిపీలికమేనేమో  'ఎవరికీ పనికిరాని పిడికెడు ధూళిని' అన్న గాలిబ్ మాటకి అర్థమేనేమో  2 ఏదో ఒకరోజుకి  గాలిలో కలిసిపోయే బూడిద కాకుండా  జనాల్లో మిగిలిపోయే స్ఫూర్తిగా  మిగిలిపోయిన మహానుభావులలాగా  మనిషిగా కనీస బాధ్యతలు  నెరవేర్చాలని అనుకునేదెందరు 3 చిన్న చిన్న కోపాలకు  పనికిరాని పంతాలకు  అక్కరకు రాని అంతరాలకు  జీవితాలని అంతం చేసుకుంటూ  పిపీలికమై ఎగిరిపోతున్న  చేతకాని కాగితం పులులకు  కొవ్వొత్తుల వెలుగుల్లో వందనం  ఆవేశాన్ని అణచుకోలేక  ఓటమికి కారణం తెలుసుకొని  దారి మలచుకోలేక  ఎప్పుడో ఒకప్పుడు తప్పని మరణాన్ని  బలవంతంగా కౌగలించుకున్న  ధైర్యం ఉన్న పిరికివాళ్ళు  నడిపించే నాయకులు  వెలుతురు పంచే దివిటీలు ఎలా అవుతారో అర్థం కావట్లేదు 

చావు పండగలు ...

వంశీ కలుగోట్ల// చావు పండగలు ...// ****************************** ************ అసలు రాతలు రాసిందే  చావులు ఆగాలని అయితే  ఎన్ని చావులకని  స్పందిస్తూ ఉండను  చచ్చే జనాలు అందరూ  ఏదో ఒక ఎన్నికలప్పుడో  ఎవడో ఒక నాయకుడు చచ్చినప్పుడో చస్తే  పరామర్శలూ ఓదార్పు యాత్రలూ ఎన్నో  రాజకీయాలకు చావులూ పండగలే  నీ చావు నీది మాత్రమే కాక  సంచలనం కావాలంటే  దేవుడిని అడుక్కునో, బలవంతంగానో  ఆ చావేదో ఎన్నికలప్పుడే చావు  లేదంటే నాయకుడితో పాటు చావు 

కొన్ని అక్షరాలు ...

వంశీ కలుగోట్ల// కొన్ని అక్షరాలు ... // ****************************** **************** 1 నేను చూసివచ్చిన జీవితంలోంచి  ఏరుకున్న జ్ఞాపకాలను  అక్షరాలుగా మలచి కథలో కవితలో  రాద్దామని అనుకుంటూంటాను  దిక్కు తోచని పరిస్థితుల్లో  బలవన్మరణానికి పాల్పడుతున్న  రైతో, భావి పౌరుడో, బలహీనుడో  ఎవడో ఒకడి గురించిన వార్త ప్రతి ఉదయం నిద్దుర లేపుతుంటే  అవి అన్నీ పాత జ్ఞాపకాలను పాతరేసి  భావావేశాన్ని తట్టి లేపితే  ఆలోచనలు పక్కదారి ఎలా పడతాయి  ఏమేమో చెయ్యాలని అనుకుని  ఏమీ చెయ్యలేక బతుకుబండి లాగేస్తూ  జరుగుతున్నవి చూస్తోంటే  ఏమిటీ వైపరీత్యం అనుకుని  వదిలేసుకుని వదిలించుకుని వెళ్ళే  దారినపోయే దానయ్యలలో కలిసిపోవాలా  2 ఎన్ని సార్లు ఎంతమంది రాసినా  ఇంకా రాసి సాధించేది ఏముంది  రైతుల ఆత్మహత్యలు  ఇవ్వాళ మొదలైనవీ కావు  ఈ రాతలతో ఆగేవీ కావు  ఇంకేమీ సమస్యలే లేనట్టు  అక్కడికి నువ్వేదో కాడి పట్టి  అరక దున్ని వ్యవసాయం చేసినట్టు  ప్రశ్నలు కుమ్మరించే గొంతుకలకు  ఉదయాన్ని పుట్టించాల్సిన అవసరం లేదు  ఆనందించటం తెలిస్తే చాలు అని  చెప్పటానికైనా అక్షరాలను మలచాలని  3 ఎన్ని ప్రభుత్వా

ఒక మనిషి పోయాడు ...

వంశీ కలుగోట్ల// ఒక మనిషి పోయాడు ... // ****************************** *********** మామూలు మరణమో బలవన్మరణమో కానీ ఒకడు చనిపోయాడు 'ఒక మనిషి పోయాడు' అని యే ఒక్కరైనా అంటారేమోనని పరలోక ప్రయాణం ఆపుకుని మరీ పోయిన వాడి ఆత్మ ఆసక్తిగా ఆశతో ఎదురు చూస్తోంది మతానికొకడు పార్టీకొకడు వచ్చి పోయినవాడు ఏదో ఒక మతం వాడో మరింకేదో వర్గం వాడో అని రాజకీయం చేస్తున్నారు తప్ప పోయింది మనిషి అని గుర్తించట్లేదు  ఉరితాడు మెడకు బిగుసుకున్నప్పుడు కాదు మనిషిగా గుర్తించలేదు అని మళ్ళీ చచ్చేదారి లేక పోయింది ఒక మతంవాడో ఒక రాజకీయ వర్గం వాడో కాదు 'ఒక మనిషి పోయాడు' అని గొంతెత్తి అరిచి చెప్పాలనున్నా ఎవరికీ వినబడదని తెలిసి బాధతో విలవిల్లాడుతోంది ఆత్మ

సమాధానాల కోసం ...

వంశీ కలుగోట్ల// సమాధానాల కోసం ... // ****************************** *********** 1 ఆఫీసు నుండి ఇంటికొచ్చాక జలుబు, తలనెప్పి మైనస్ డిగ్రీల చలిలో వణికించే గాలిలో కలిసే తిరినప్పుడు మరోడికి రాని తలనెప్పి నాకే వచ్చిందంటే నన్ను తాకిన గాలిదేకులమో తెలుసుకుని ఈ వివక్షకు కారణమేమిటో కనుక్కోవాలనుంది 2 భూకంపం వచ్చిన ప్రాంతానికెళ్ళి పగుళ్ళు విచ్చిన భూమిని చూసి ఏ కులపోడిని కూల్చాలని చీలిందో అగిది తెలుసుకోవాలనుంది  3 వర్షం ముంచుకొచ్చి సముద్రం పొంగి, వరదగా మారి చెన్నై వాసిని సర్వం కోల్పోయి సహాయం కోసం నిలబెట్టిన నీటిది ఏ జాతో తెలుసుకోవాలనుంది 4 బడుగు రైతో అన్యాయానికి గురైన అమ్మాయో విసిగిన నిరుద్యోగో దాష్టీకానికి బలైన పేదవాడో కులాల సమరంలో కాలిపోయిన మేధావో ఎవడైతేనేం ఉరితాడుకు ఊపిరి తీసి శవంగా మార్చి బతికి సాధించలేనిది చచ్చి సాధించవచ్చేమో అనే ఆశ కల్పించి మరీ చంపుతుంది 5 కోడిగుడ్డు మీద ఈకలు పీకేటోడు బోడిగుండు మీద వెంట్రుకలు లెక్క పెట్టేవాడు ప్రశ్నకు ప్రశ్నే సమాధానమనేవాడు పరిశోధకుడు అయినప్పుడు గోడమీది పిల్లివాటమే అయినపుడు నిజమంటే ఒక అభిప్రాయమే కదా 

వాడంటే ఒక చైతన్యం ...

వంశీ కలుగోట్ల// వాడంటే ఒక చైతన్యం ... // ****************************** ************* తన గొంతు వినిపించాలనే ప్రయత్నం కాదు వాడిది గొంతెత్తి అరవలేని ఏడవలేని ప్రశ్నించలేని వేలాది గొంతుకలకు తన గొంతుక అరువిచ్చి వినిపిస్తాడు ఏమీ చెయ్యలేని నువ్వైనా నిన్ను మోస్తూన్న నేలైనా నిన్ను వాడుకునే నాయకుడైనా ప్రపంచ దేశాలూ పంచ భూతాలూ ఎవరైనా ఏదైనా వాడి అక్షరాల్లో ముక్కలుగా రాలి కాగితం మీద పడాల్సిందే తప్పెట మోతలకు పొంగిపోని తుపాకి కాల్పులకు భయపడని వాడు నీ చప్పట్లకు మురిసిపోతాడు కవి అంటావో రవి అంటావో వాడి లక్ష్యం మాత్రం నిన్ను నిద్దురలేపి చైతన్యం సాధించటం వాడు మామూలు మనిషి కాదు ఒక్కొక్కడు ఒక చైతన్యం 

మా ఊరి బస్సు ...

వంశీ కలుగోట్ల// మా ఊరి బస్సు ... // ****************************** ******* పట్టణంతో మా ఊరిని ప్రతిరోజూ అనుసంధానించే రాయబారి ఆ బస్సు గమ్యం చేర్చటమే లక్ష్యంగా బాధ్యత తెలిసిన ఆ బస్సు బరువును నింపుకుని బయలుదేరుతోంది  ప్రతిసారీలానే మళ్ళీ నేను వీడ్కోలు పలుకుతున్నాను  మనిషి మీద నమ్మకం లేకపోయినా కాస్త ఆలస్యంగానైనా సరే గమ్యం చేర్చుతుందని బస్సు మీద నమ్మకం  ఎత్తూ-పల్లం, గాలీ-వానా చూసుకుని అనువుగాని దారిపై అణిగి ఉండటం తగిన దారిలో తనదైన రీతిలో దూసుకెళ్ళటం తనవారని, తగనివారని పట్టింపులేమీ లేక బరువేదైనా బాధ్యతగా గమ్యం చేర్చటమే   ఎప్పుడూ పాఠాలు చెప్పదు ప్రమాదాలు ఉంటాయి పక్కకు తప్పుకోమని గొంతెత్తి అరవడం తప్ప (హార్న్) అంతకుమించి పాటించి చూపుతుంది  ఈ బస్సెప్పుడూ నాకు ఆదర్శంగానే కనిపిస్తుంది

కొన్ని సందేహాలు ...

వంశీ కలుగోట్ల// కొన్ని సందేహాలు ... // ****************************** ********* ఎలా ...  కొన్నాళ్ళుగా కాదు కాదు కొన్నేళ్లుగా  వెంటాడుతున్న ప్రశ్నలు 1 రాయాలి ...  కడుపు మండినప్పుడూ  ఆవేశం కలిగినప్పుడూ పేజీలకొద్దీ భావాలు పుట్టుకొస్తూనే ఉంటాయి  వాటిని అక్షరాలుగా కాగితం మీద పెట్టినప్పుడు  ఏదో తెలియని సంశయం  చదివే  వాడికి నచ్చుతుందా  అందంగా ఉందా, ఆనందించేలా ఉంటుందా అని  ఎప్పుడు రాసినా రాజకీయం గురించేనా అంటారని  ఏది రాసినా చివర్లో పరిష్కారం చెప్పటానికి ప్రయత్నిస్తావేంటి అని ప్రశ్నిస్తారేమోనని   ఎవరో నిర్దేశించిన చట్రంలో  నా రాతలు ఇమడట్లేదని తిరస్కరిస్తారేమోనని  ఎన్నో భయాలు ...  2 మనసుకు నచ్చింది చేస్తే  మరుసటి రోజుకు జీవితం ఎలా ఉంటుందోనని డబ్బొచ్చే పని చెయ్యకపోతే బ్రతుకు తీరు ఎలా ఉంటుందోనని  అడుగు అడుగుకూ అనుమానం  3 ఇన్నాళ్ళ, ఇన్నేళ్ళ పోరాటంలో ఏదో ఒకటి సాధించే ఉంటానేమో  కానీ తృప్తి లేదు బహుశా సాధించినదేదీ తృప్తినిచ్చేది కాదేమో నా వెంట వచ్చేది ఏదన్నా సాధించానా  అని ఇప్పుడే ఎలా తెలుస్తుంది

రంగుల లోకం ...

వంశీ కలుగోట్ల// రంగుల లోకం ... // ****************************** **** ఒరేయ్ పిచ్చోడా ఇక్కడ ఇలానే జరుగుతుంది దారుణం జరిగినా, దావానలం చెలరేగినా మానభంగమైనా, మతోన్మాదమైనా నీకు కనిపించేది నిజమో అబద్ధమో నిర్ణయించుకునే హక్కు నీకు లేదు రంగును బట్టే నిజం నిర్ణయించబడుతుంది ఇదిగో ఇదిగిదిగో ఈ కళ్ళద్దాల కుప్పలోంచి ఏదో ఒకటి తీసి పెట్టుకో ఇది ఆ పార్టీది , అది ఇంకో పార్టీది ఇదేమో ఆ మీడియా గ్రూప్ ది అదేమో ఇంకో వర్గం మీడియా వాళ్ళది నీకే రంగు నచ్చితే ఆ కళ్ళజోడు పెట్టుకో  ఏదో ఒక కళ్ళజోడు తీసుకుని కళ్ళకో, నెత్తికో ఎక్కడో ఒకచోట పెట్టుకుంటే అప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడేది కనీసం ఎవడికో ఒకడికి వినబడుతుంది  నువ్వు పిచ్చోడివి కాదు మేధావివి అని నిరూపించుకోవాలంటే ఏదో ఒక కళ్ళజోడు పెట్టుకుని తీరాల్సిందే కాదూ కూడదు అంటే కనుమరుగైపోతావు జాగ్రత్త

దృష్టి ...

వంశీ కలుగోట్ల// దృష్టి ... // ************************** 1 పోయిన ప్రాణమెవరిదో ఎవరికీ పట్టట్లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు  ప్రాణం తీసిన తూటా పేల్చిన తుపాకి వెనుక నిలబడి మీట నొక్కినవాడి మతమేది అని తప్ప 2 నేరం చేసిన వాడి వయసూ మనసు ఎదుగుదలా కాదు జరిగిన నేరం వల్ల బాధ అనుభవించినవారి వయసూ, మనసూ ఆధారంగా శిక్ష వేసే రోజోస్తే బావుండు 3 నీవు ఊరు దాటి వస్తే అది ఎదగటానికి ఒక ప్రయత్నం ఇంకోడు దేశం దాటి వెళితే మాతృభూమికి వెన్నుపోటు పొడవటం  బ్రతకడానికి నువ్వు ఊరోదిలితే బ్రతికించుకోవటానికి వాడు దేశం వదిలాడు నువ్వోక్కడివైతే వాడో కుటుంబం

వాగ్దానాలు ...

వంశీ కలుగోట్ల// వాగ్దానాలు ... // ****************************** ** గతమంటే వెంటాడే వాగ్దానాలే కనిపిస్తున్నాయి ఏమిటో ... ఆఫీసులో గత సంవత్సరం అప్రైసల్ సమావేశంలో అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పిన మాటలు గుర్తు చేసి ఏమేమి సాధించానో చెప్పందే జీతం పెంచనంటాడు మేనేజర్  ఇంటికెళితే పోయిన పుట్టిన రోజుకి ఇచ్చిన మాట ప్రకారం ఈ పుట్టిన రోజుకి వడ్డాణం చేయించకపోతే పుట్టింటికెళతానంటుంది పెళ్ళాం  స్కూల్ నుండి వచ్చిన కొడుకు ఈసారి మొదటి రాంక్ వస్తే సైకిల్ కొనిస్తానని చెప్పిన మాట గుర్తు చేసి మరీ ప్రోగ్రెస్ కార్డు చేతిలో పెడతాడు సంతకం కోసం  సెలవుల్లో ఇంటికొచ్చిన బంధువులు మా ఊరికొస్తే చూపిస్తానని చెప్పిన ప్రదేశాల లిస్టు ముందరపెట్టుకుని ఎదురు చూస్తారు పదే పదే నేను చెప్పిన విషయం గుర్తు చేస్తూ ...  తాగి ఇవన్నీ మర్చిపోదామని బారు కెళితే తోడొచ్చిన స్నేహితుడు ... ప్రమోషన్ వస్తే పార్టీ ఇస్తానన్న విషయం గుర్తు చేసి మరీ బిల్లు నన్నే కట్టమంటాడు  దీనమ్మా జీవితం ... వెనక్కి తిరిగి చూసుకుంటే ఇచ్చిన వాగ్దానాల గుర్తులు కనిపిస్తున్నాయే తప్ప సాధించిన ఘనతేమీ కనబడట్లేదు కనీ

నాపచేను నవ్వింది ...

వంశీ కలుగోట్ల// నాపచేను నవ్వింది ... // ****************************** ********** చిన్నప్పటినుండీ వింటూనే ఉన్నా 'నవ్విన నాపచేనే పండుతుంది' అన్న సామెత కానీ నాపచేను పండగా చూడలేదు నాపచేను పండదని మిడిసిపడి తెగ నవ్వుకున్న మాగాణి భూములన్నీ నాశనమవుతూంటే చూసి తగినశాస్తి జరిగిందని తెగ నవ్వుతున్న నాపచేలను ఇవ్వాళ చూస్తున్నాను

బోయీలు ...

వంశీ కలుగోట్ల// బోయీలు ... // ****************************** ****** ఆనాడు అవతారమెత్తిన విష్ణువు  వేదాలను, మనువుతో పాటు మరి కొందరిని కాపాడినప్పుడు  ప్రళయంలో పతనమైంది అంతా సామాన్యులే  సామాన్యుడు అంటే  దేవుడికి కూడా అలుసేనని  దేవుడికి కూడా పట్టనివాడు  ఎప్పటికీ అనాధే  అని అవతారమెత్తి  మరీ నిరూపించాడు యుద్ధం జరిగిన ఏనాడైనా  సైన్యం చచ్చిన తరువాతే సంధి కుదిరేది  ఆలెగ్జాండర్ నుంచి సద్దామ్ హుస్సేన్ దాకా  జగజ్జేతలైనా, నియంతలైనా నియమితులైనా, నిపుణులైనా  ముందు నిలబడ్డ సైన్యంలోని సామాన్యులంతా  చచ్చిన తరువాతే చచ్చారు ...  రాచరికాలు పోయినా రాజకీయాలు ఉన్నాయి  రాజ్యాలు పోయినా ప్రజాస్వామ్యాలు పుట్టుకొచ్చాయి  ఎన్ని మార్పులొచ్చినా  ఆకాశం దాకా ఎగరగలిగేలా ఎదిగినా  సామాన్యుడికి సమానత్వం మాత్రం లేదు  తరాల తరబడి  పల్లకీ ఉంటుందో ఉండదో తెలీదు  కానీ తరాలు మారినా  పల్లకీ మోసే బోయీలు మాత్రం ఉండాల్సిందే  అది ఉత్సవ విగ్రహమైనా  అధికారపీఠం మీది నాయకుడైనా