వాగ్దానాలు ...

వంశీ కలుగోట్ల// వాగ్దానాలు ... //
********************************
గతమంటే వెంటాడే వాగ్దానాలే కనిపిస్తున్నాయి ఏమిటో ...

ఆఫీసులో
గత సంవత్సరం అప్రైసల్ సమావేశంలో
అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పిన మాటలు గుర్తు చేసి
ఏమేమి సాధించానో చెప్పందే
జీతం పెంచనంటాడు మేనేజర్ 


ఇంటికెళితే
పోయిన పుట్టిన రోజుకి ఇచ్చిన మాట ప్రకారం
ఈ పుట్టిన రోజుకి వడ్డాణం చేయించకపోతే
పుట్టింటికెళతానంటుంది పెళ్ళాం 

స్కూల్ నుండి వచ్చిన కొడుకు
ఈసారి మొదటి రాంక్ వస్తే సైకిల్ కొనిస్తానని
చెప్పిన మాట గుర్తు చేసి మరీ
ప్రోగ్రెస్ కార్డు చేతిలో పెడతాడు సంతకం కోసం 

సెలవుల్లో ఇంటికొచ్చిన బంధువులు
మా ఊరికొస్తే చూపిస్తానని చెప్పిన ప్రదేశాల లిస్టు
ముందరపెట్టుకుని ఎదురు చూస్తారు
పదే పదే నేను చెప్పిన విషయం గుర్తు చేస్తూ ... 

తాగి ఇవన్నీ మర్చిపోదామని బారు కెళితే
తోడొచ్చిన స్నేహితుడు ...
ప్రమోషన్ వస్తే పార్టీ ఇస్తానన్న విషయం గుర్తు చేసి మరీ
బిల్లు నన్నే కట్టమంటాడు 

దీనమ్మా జీవితం ...
వెనక్కి తిరిగి చూసుకుంటే
ఇచ్చిన వాగ్దానాల గుర్తులు కనిపిస్తున్నాయే తప్ప
సాధించిన ఘనతేమీ కనబడట్లేదు
కనీసం వచ్చే జన్మలోనైనా
రాజకీయ నాయకుడిగా పుడితే బావుణ్ణు
ఇచ్చినమాట తప్పడం
ఇంటిపేరుగా మలచుకుని  రాజ్యమేలొచ్చు


Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...