Posts

Showing posts from February, 2016

ఒక ప్రయాణం ...

వంశీ కలుగోట్ల// ఒక ప్రయాణం ... // ****************************** ****** తడబడుతున్నా నిలబడుతూ నిలకడగా తప్పటడుగులు వేసుకుంటూ ఎదిగిన మనిషిగా పయనం సాగిస్తున్నా  నేనున్న చీకటిలోంచి మరింకెక్కడో వెలుగుందనే నమ్మకంతో ప్రవహించే నదిలా పల్లం వైపు పారిపోతున్నా పతనమో లేకపోతే పరిణామక్రమమో అర్థం కాకపోయినా అడుగు అడుగుకూ చీకట్లు ముసురుకొస్తూంటే అర్ధమనస్కపు సంకల్పంతో సంధికాలపు సంధ్య వెలుగుల కోసమై పల్లం వైపు పరిగెడుతున్నా బతుక్కూ చావుకూ మద్య మిగిలున్న మానవత్వాన్ని అనుభవించి దోసెడు నవ్వులనూ పిడికెడు జీవితాన్నీ సంచీలో నింపుకు వెళదామని ప్రయత్నంలో అగాథంలోకో శిఖరం మీదకో అర్థం కాకపోయినా పరిగెడుతూనే ఉన్నా అనేకుడిగా విడిపోయిన నేను పునరేకీకృతం కావాలనే ప్రయత్నంలో చీకటిలోంచో లేక చీకటిలోకో అర్థం కాని అయోమయపు ప్రయాణం

గొర్రెలమంద ...

వంశీ కలుగోట్ల// గొర్రెలమంద ... // ****************************** కుందేటి కొమ్ము సాధించాలని కుక్కను కుర్చీమీద కూచోబెట్టాలని గుర్రానికి రెక్కలు మొలిపించాలని నిజాన్ని నిజమని మేధావులచేత ఒప్పించాలని ఎందుకురా అలవికాని కోరికలతో కాడి భుజాన వేసుకొని బయల్దేరతావు  ఒరేయ్   మాన్యుడననుకునే సామాన్యుడా  ఏమి జరిగినా అన్నీ మూసుక్కూచోక  గొంతెత్తాలానే యత్నమెందుకురా  ఏబ్రాసి యెదవన్నర యెదవా  నీ పనేదో నీవు చూసుకోక ... యాడికి బోతావురా నువ్ యాడ తిరిగినా ఎన్నికల యాలకి నిన్ను నీ మందను పోలింగ్ బూత్ కాడికి తోలుకోస్తాననే నమ్మకం ఉన్నోడే నాయకుడు నీ బతుకు నీది అనుకుంటున్నావేమో వాడు పెట్టే గడ్డికి ఆశపడి ఎప్పుడో మందలో కలిసి వాడి ఆస్థివైపోయావు కులమో, మతమో, ప్రాంతమో - దడి ఏదైతేనేం నువ్వు దాటిపోకుండా ఆపి ఉంచటానికి అయినా నువ్వు ఎదురు చూడాల్సింది ఇంకా ఎంత గడ్డి పెడతాడు అని కాదు వీడే కోసుకుతింటాడా లేకపోతే కసాయివాడికి అమ్ముతాడా అని అంతకు మించి నువ్వేమీ చెయ్యలేవు

జ్ఞాని ...

వంశీ కలుగోట్ల// జ్ఞాని ... // *************************** 1 చెడ్డీలేసుకునే రోజుల్లో నా చేతిలో ఉండే గోళీలకు గుడిలో ఉండే దేవుడికి సంబంధమేంటో తెలీదు కానీ గోళీలాట ఆడేముందు 'జై భజరంగభళీ' అనో మరింకే దేవుడినో తలచుకుని మొదలెట్టేవాడిని    బొంగరాల ఆట అయినా చిల్లా గోడే అయినా మరింకే ఆట అయినా సరే చీకట్లో పక్క గదిలోకి వెళ్ళాలన్నా లోలోపల దేవుడిని తలచుకుంటే అండ ఉంటాడనే నమ్మకం ఉండేది 2 మారుతున్న కాలంతో పాటు మనుగడ కోసం పోరాటంలో ఎదుగుదల తప్పనిసరైంది  ఎదుగుతూ వస్తోన్న కొద్దీ సంకల్పాన్ని మించిన భక్తి లేదని నన్ను/మనిషిని మించిన దేవుడు లేడని కొత్తగా తెలుసుకుంటూ పెరుగుతున్న తెలివితేటలతో జ్ఞానినై స్వతంత్రుడనయ్యాను 3 రద్దీ వల్ల ఆఫీసుకు ఆలస్యమైనప్పుడు రోడ్డు మీద పశువు అడ్డం వచ్చినప్పుడు టీవీలో వార్తలు చూసేటప్పుడూ నా వల్ల కాదనిపించిన ప్రతి సందర్భంలోనూ 'ఈ సమాజాన్ని ఆ దేవుడే మార్చాలి' అనుకుంటూ నేను లేడని అనుకున్న దేవుడిని మళ్ళీ ఒకసారి గుర్తుకు చేసుకుంటూంటాను