జ్ఞాని ...

వంశీ కలుగోట్ల// జ్ఞాని ... //
***************************
1
చెడ్డీలేసుకునే రోజుల్లో

నా చేతిలో ఉండే గోళీలకు
గుడిలో ఉండే దేవుడికి సంబంధమేంటో
తెలీదు కానీ
గోళీలాట ఆడేముందు
'జై భజరంగభళీ' అనో మరింకే దేవుడినో
తలచుకుని మొదలెట్టేవాడిని 
 
బొంగరాల ఆట అయినా
చిల్లా గోడే అయినా
మరింకే ఆట అయినా సరే
చీకట్లో పక్క గదిలోకి వెళ్ళాలన్నా
లోలోపల దేవుడిని తలచుకుంటే
అండ ఉంటాడనే నమ్మకం ఉండేది

2
మారుతున్న కాలంతో పాటు
మనుగడ కోసం పోరాటంలో
ఎదుగుదల తప్పనిసరైంది 

ఎదుగుతూ వస్తోన్న కొద్దీ
సంకల్పాన్ని మించిన భక్తి లేదని
నన్ను/మనిషిని మించిన దేవుడు లేడని
కొత్తగా తెలుసుకుంటూ
పెరుగుతున్న తెలివితేటలతో
జ్ఞానినై స్వతంత్రుడనయ్యాను

3
రద్దీ వల్ల ఆఫీసుకు ఆలస్యమైనప్పుడు
రోడ్డు మీద పశువు అడ్డం వచ్చినప్పుడు
టీవీలో వార్తలు చూసేటప్పుడూ
నా వల్ల కాదనిపించిన ప్రతి సందర్భంలోనూ
'ఈ సమాజాన్ని ఆ దేవుడే మార్చాలి'
అనుకుంటూ నేను లేడని అనుకున్న దేవుడిని
మళ్ళీ ఒకసారి గుర్తుకు చేసుకుంటూంటాను

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...