విద్యార్థిగానే బతికితీరాలి

వంశీ కలుగోట్ల // ... విద్యార్థిగానే బతికితీరాలి // 
******************************************

వాడు అడిగాడు  
'నాన్నా జీవితం ఎప్పుడు మొదలవుతుంది?' అని
'ఈ బడిలో ఉన్నన్నాళ్ళూ బాగా చదువు 
 

ఆ తరువాత జీవితం అనుభవించవచ్చు' 
అని  నాన్న చెప్పాడు 

'నాన్నా జీవితం ఇప్పుడు మొదలవుతుందా?'  
అడిగాడు వాడు బడి అయిపోయాక
'ఈ ఇంటర్ రెండు సంవత్సరాలూ కష్టపడి 
 

ఇంజనీరింగ్ లోనో మెడిసిన్ లోనో సీట్ కొట్టరా   
ఆ తరువాత తిరుగుండదు' అన్నాడు నాన్న 

'నాన్నా మరి ఇపుడు జీవితం మొదలయినట్టేనా?' 
అని అడిగాడు వాడు   
ఇంజనీరింగ్/మెడిసిన్ లో సీట్ వచ్చాక
'ఈ నాలుగేళ్ళూ చదివేస్తే ... 
 

జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు'  
అన్నాడు నాన్న 

వాడు సమాధానపడ్డాడో  
లేక రాజీ పడ్డాడో తెలియదు  
ప్రతి మలుపులోనూ  
తెలియని బాధను 
లోపలి పొరల్లో దాచుకుని   
గడుపుతూనే ఉన్నాడు 

వాడికి తెలుసు   
తాను చస్తూ బ్రతుకుతున్నానని  
చచ్చి బ్రతకబోయేముందు   
వాడు రాసుకున్నాడు ...
"ఇకనైనా జీవితం మొదలవుతుంది 
 

అనుకున్న ప్రతి మలుపులోనూ   
పాఠాలు ఎదురు చూస్తూనే ఉంటాయి   
ముల్లుగర్ర సిద్ధంగా పెట్టుకుని   
విద్యార్థిగానే బతికితీరాలని చెబుతూ ..."

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

మా ఊరి బస్సు ...