Posts

Showing posts from August, 2016

మాటలు ... మాయలు

వంశీ కలుగోట్ల // మాటలు ... మాయలు // ****************************** ************ 1 రారా యని రమణి పిలువగ  రసికుండూరకుండునా  వేంచేయుడెచటకని సతి  సమయానికి అడ్డు పడిన  'పిల్ల'గాలికి అలా తిరిగి చల్లబడియొచ్చెదనని  మాటకారితనము చూపడా  2 మదికి మదిరకి బంధమేమిటని మత్తెక్కిన మహిషుడినడిగిన చెప్పక ఊరకుండునా మదిలోని బాధను మధిర మరిపించునని మాయమాట

భక్తి - వాదం

వంశీ కలుగోట్ల // భక్తి - వాదం // ****************************** ***** పాపము పెట్రేగెనని ఉగ్రముదాల్చి ఫాలనేత్రముల్ రాల్చిన ప్రస్ఫులిత  జ్వాలల కీలల విజృంభణతో పర్వతమంత హిమమే కరిగి వరదై ఊరూవాడలని ముంచెత్తినో ఏమో  యని భక్తుడు వి'భ్రాంతి' చెంద  కాదు యని వాడు తన వాదనతో వచ్చే పుర్రెలోని బుద్దులు పెడతలలు పట్టగ విశ్వరూపం దాల్చిన కాలుష్యపు కోరలు సాచిన 'గ్లోబల్ వార్మింగ్' అంటూ వాడు వివరించ యత్నించె  దారులు వేరైననేమి గమ్యమొక్కటే ఫాలనేత్రములో కానిచో కాలుష్యపు కోరలో కాలుచున్న బతుకులెవ్వరివని యోచించక వాదపు వాదరకిరువైపులనుంచుని తలకొకరీతిన్ మేధావిత్వపు వాచాలత్వమును ప్రదర్శించుచూ కాలమును వృధా చేయుచునే యున్నారు 

... ఒంటరి

వంశీ కలుగోట్ల // ... ఒంటరి // ****************************** 1 వాడన్నాడు గర్వంగా ... 'నా కత్తికొసన ప్రపంచాన్ని ఆడిస్తాను' అని యుద్ధం ముగిశాక శవాల కుప్ప మధ్యలో నిలబడ్డాక కానీ, వాడికి అర్థమవ్వలేదు కత్తికొస నుంచి జారుతున్న రక్తపు చుక్కలు తప్ప ఆడించడానికి కానీ పాలించటానికి కానీ మిగిలున్నదేమీ లేదని విజయం అంచున  తానొంటరిగా నిలుచున్నానని 2 విజయం నిన్ను ప్రపంచం ముందు నిలబెడుతుంది ఒంటరిగా నువ్వు మిగిలిపోతావు నీ వెనుక నిలబడ్డవాళ్లు నీ భుజం తట్టి మెచ్చుకునేవాళ్ళు నిన్ను బలిపీఠం పై నిలబెట్టేవారే నీ  విజయాన్ని చూసి రొమ్ము విరుచుకుని 'ఎదో ఒకరోజు నేనూ సాధిస్తా' అంటూ రంకెలేసేవారిని దగ్గరకు తీసుకుని చెప్పు  'ఒంటరి కావటానికి సిద్ధమైతే ...' శిఖరం అధిరోహించమని నువ్వు సాధించిన విజయాలు గోడకు వేలాడుతుంటే నువ్వు మాత్రం, ఒక మూలన ఒంటరితనంలో కొట్టుకుపోతుంటావు (విజయం తరువాత వచ్చే సమస్యలను, ఒంటరితనాన్ని తట్టుకునేలా సిద్ధం కావాలని చెప్పడం మాత్రమే ఇక్కడ నా ఉద్దేశ్యం. విజయం అంటే బాధ్యతతో కూడిన ఆనందం. అందుకే యుద్ధం వల్ల వచ్చే విజయం, కృషి/పట్టు

అనదర్ డే అనదర్ డాలర్

వంశీ కలుగోట్ల // అనదర్ డే అనదర్ డాలర్ // **************************************** """ ఎప్పటిలానే  'అనదర్ డే అనదర్ డాలర్' అనుకుంటూ  ఆఫీసుకు వెళ్లాను ...  !!!!!!!!!!!!!!!!!!!!!! ... ఏమైంది ఇవాళ  కీబోర్డ్ లేదు, మౌస్ లేదు  మానిటర్ జాడే లేదు  సిపియు గురించి చెప్పక్కరలేదు  ఏ డెస్క్ మీదా ఏమీ లేవు  ఆఫీసు మొత్తం చూస్తే  ఉప్పెన ఊడ్చేసిన ఊరులా ఉంది  ఎవరో కనిపిస్తే  'ఏమయ్యింది' అని అడిగాను  'యంత్రాలకు స్వాతంత్య్రం ఇచ్చారు' అని చెప్పారు  ఇప్పుడెలా ... ఏమి చెయ్యాలి? యంత్రం లేకపోతే బతికేదెలా?""" ...  ...  ...  అలారం శబ్దానికి మెలకువ వచ్చింది  కళ్ళు తెరచేసరికి వెలుతురు కమ్మేసింది  'హమ్మయ్యా ... అదంతా కలేనా లేకపోతె యంత్రాలకు స్వాతంత్య్రం ఏంటి?' అనుకుంటూ ఆ రోజుకి మొదలయ్యాను 

... అబద్ధాలు

వంశీ కలుగోట్ల // ... అబద్ధాలు // ***************************** 1 నేనంటే ఒక అబద్ధం  ... అంతే నిజమనుకునే ప్రతి ఒక్కరూ అబద్దమే నిజమంటే ఒకటే - అదే అబద్ధం 2 ఏదో ఒక ముసుగేసుకుని ఒకడు వెళ్లి ఇంకోడిని చంపుతుంటే లేని నిజమెక్కడ బయటపడుతుందో అని ఒక అబద్ధం ఇంకో అబద్దాన్ని చంపి పాతరేస్తున్నట్టు అనిపిస్తుంది 3 పుస్తకాలలో రాసిన ధర్మసూత్రాలను ఆదర్శంగా ఆచరిస్తున్నానని స్వీయవంచన చేసుకుంటూ బతుకీడుస్తున్న మహానటుల మధ్యన మామూలోడిగా బతకడం ఎంత కష్టమో ...

చరిత్ర ఆ విధంగా రాయబడింది ...

వంశీ కలుగోట్ల // చరిత్ర ఆ విధంగా రాయబడింది ... // ****************************** ********************* 'రక్తం చిందించకుండా రాజ్యం సాధిస్తాను' అన్నాడు వాడు గౌతమ బుద్దుడు లాంటివాడు  అనుకున్నారు అందరూ  కుట్రపన్ని, వెన్నుపోటుతో ఒక్క రక్తపు చుక్క చిందకుండా వాడు రాజయ్యాడు  వాడు మళ్ళీ అన్నాడు ఈసారి గర్వంగా 'రక్తం చిందించకుండా రాజ్యం సాధించాను' అని  ఎదురు తిరిగిన వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళు తరువాత మళ్ళీ ఎక్కడా కనబడలేదు వాళ్ళ రక్తపు చుక్కలు చిందాయో లేదో  ఎవరికీ తెలియదు చరిత్రలో ఆ విషయం రాయబడలేదు రాజ్యాన్ని రక్షించటానికి ప్రజలను పాలించటానికి తన జీవితాన్ని అతడు త్యాగం చేశాడు అని వాడి జనాలు అన్నారు  చరిత్ర ఆ విధంగా రాయబడ్డది భవిష్యత్తరాలు వాడి చరిత్రను స్ఫూర్తిగా చదువుకున్నాయి

... రంధ్రాన్వేషణ

వంశీ కలుగోట్ల // ... రంధ్రాన్వేషణ // ****************************** **** పరిచిన గొంగళి మీద కూచుని అన్నం తింటున్నారు వాళ్లిద్దరూ  నా అన్నంలో వెంట్రుకలొచ్చాయి అన్నాడు వాడు నా అన్నంలో కూడా వచ్చాయి అన్నాడు వీడు * వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారు ...  ఏ దేవుడు చెప్పాడు వాడిని చంపమని అని అడిగాడు వాడు ఏ జంతువు అడిగింది తనను తినమని ఎదురు ప్రశ్నించాడు వీడు  నీ ప్రార్థనాలయంలోకి వాడినెందుకు రానివ్వట్లేదు అని అడిగాడు వాడు నీ ప్రార్థనాలయ ప్రవేశానికి నీవెందుకు అన్ని నిబంధనలూ అడ్డంకులూ పెట్టావు అని అడిగాడు వీడు  నీ చరిత్ర అంతా అహంకారపు అణచివేతలే అన్నాడు వాడు నీ చరిత్ర అంతా విద్వేషపూరిత హత్యలే అని వీడన్నాడు ... ... ... ఒకటా రెండా ... తిన్నది అరిగేదాకా ఇద్దరూ ఒక్కొక్కరి తప్పులు/రంధ్రాలు అన్వేషించుకుంటూనే ఉన్నారు * మళ్ళీ గొంగళి మీద కూచుని అన్నం తింటున్నారు వాళ్లిద్దరూ వెంట్రుకలు వెతుక్కుంటూ రంధ్రాన్వేషణకి సిద్ధమవుతూ ...

... ఒక నేను

వంశీ కలుగోట్ల // ... ఒక  నేను // ****************************** నిన్నటి గతాన్ని గుర్తుగా  రేపటి భవిష్యత్తును కలగా  ఇవ్వాళ్టి వర్తమానాన్ని శ్రమగా  కొన్ని అబద్దాలు  కొన్ని నిజాలు కలబోసి  అన్నింటినీ మూటగట్టి విసిరేస్తే  'నేను'గా ఇక్కడకొచ్చి పడ్డాను  * భవిష్యత్తు కోసం నేనిక్కడ పునాదులు వేస్తుంటే గతం కోసం వాళ్ళు గోతులు తవ్వుతున్నారు

... ఎప్పటికీ ఉంటారు

వంశీ కలుగోట్ల // ... ఎప్పటికీ ఉంటారు // ****************************** ********* అన్నీ పంచుకోవాలి అనుభవించి ఆస్వాదించాలి నువ్వు నా దగ్గరనుండి సంతోషం మూటగట్టుకెళ్ళాలి * నేను నీ తోడుగా ఉండాలి కానీ, నేను లేకుండా కూడా నువ్వు ఎదగాలి * నీకోసం నిలబడతాను అనేది మాట కాదు శ్వాసను నింపుకున్న దేహం * చెరువు గట్టో, సముద్రపు ఒడ్డో గుడి వెనకో, సత్రం అరుగో స్థలాలు మారుతుంటాయి కానీ, స్నేహం మారదు * సాయంత్రాలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి కానీ, స్నేహితులు మాత్రం ఎప్పటికీ ఉంటారు - మనలా

... వెంటాడే గాయాలు

వంశీ కలుగోట్ల // ... వెంటాడే గాయాలు // **************************************** 1 ఎదో ఆవేదన ... గుండెను తడుతూనే ఉంది ఎందుకు? కలలుగన్న తీరాలకు కలిసి సాగుదామని వేసుకుంటున్న రహదారికి తూట్లు పొడిచి నిజమని నమ్మిన మిత్రుడు నమ్మకద్రోహం చేసినందుకా ? దారి మారింది కనుక ఇక అవసరం లేదనుకుని ఒక్కమాటా చెప్పకుండా వెళ్ళిపోయింది 'స్నేహితుడు' అయినందుకా? 2 ప్రతి ప్రస్తుతానికీ ఒక గతముంటుంది ప్రతి ఆవేదనకూ వెనుక ఒక ద్రోహం ఉంటుంది ప్రతి 'విడిపోవడం' వెనుక ఇద్దరు వ్యక్తుల అహం ఉంటుంది రెండు తప్పులుంటాయి  తన సమస్యేమిటో నా తప్పేమిటో అర్థం కాలేదు బహుశా రెండూ ఒకటేనేమో ... 3 ఎవరన్నారు ప్రేమలో విఫలమైతేనో విడిపోతేనే అయ్యే గాయం మాత్రమే వెంటాడుతూ ఉంటుందని స్నేహంలో ఒక ద్రోహమో, విడిపోవడమో వెంటాడటం కాదు గాయపరుస్తూనే ఉంటుంది 4 ప్రయత్నమే కానీ వెంటాడే గాయానికి అక్షరం ఏమాత్రం న్యాయం చేయగలదు? గుండెకు మాత్రమే తెలుసు గాయం స్రవించే రక్తపు చుక్కల లెక్క 5 ఒక బంధం తెగినపుడు తప్పెవరిదో తెలీదు  కాలంతో సాగుతున్నప్పుడు గాయం వెంటాడ

బతుకమ్మ పాట

ఎప్పుడో 2002/03 సంవత్సరంలో రాసిన బతుకమ్మ పాట ఇది. అప్పట్లో నల్గొండ జిల్లాలోని కీసర, బొమ్మలరామారం దగ్గర్లో ఉన్న సాయిధామమ్ ఆశ్రమ పాఠశాలలో తెలుగు మరియు గణిత అధ్యాపకుడిగా పనిచేసిన రోజుల్లో సహోద్యోగిని సుజాత గారి అభ్యర్థన మేరకు, తాను ఇచ్చిన సమాచారం ఆధారంగా రాశాను. ఇందులో తప్పులున్నాయని అనిపిస్తే చెప్పవలసిందిగా మనవి; అలాగే ఆ తప్పులకు మన్నించమని కూడా. ఎందుకంటే నాకు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలతో పెద్దగా పరిచయం లేదు, అప్పట్లో అక్కడి సహోద్యోగులు ఇచ్చిన సమాచారం, ప్రోత్సాహంతో తెలిసిన వివరాలతో రాశాను. మరో విషయం - సుజాత టీచర్ గారి ఆధ్వర్యంలో ఈ పాట సాయిధామమ్ ఉన్నత పాఠశాల తరగతి విద్యార్థినులు నృత్యరూపకంగా ప్రదర్శించి మండలస్థాయి బహుమతి గెలుచుకున్నారు. వంశీ కలుగోట్ల // బతుకమ్మ పాట // ****************************** ************ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో తల్లితండ్రుల కలల రూపంగా ఉయ్యాలో గౌరమ్మ పుట్టింది ఉయ్యాలో గౌరమ్మ వెలసింది ఉయ్యాలో గౌరమ్మ ఎదిగింది ఉయ్యాలో బడిలోన జేరింది ఉయ్యాలో చదువు సంధ్యల్లోన తానే మేటి ఉయ్యాలో చదువు సంధ్యల్లోన తానే సాటి ఉయ్యాలో గౌరమ్మ

... నేను

వంశీ కలుగోట్ల // ... నేను // **************************** 1 నేనంటే ఏమిటని చెప్పుకోవడానికేమీ లేదు గత కాలపు ఘన చరిత్రకు మొండిగోడలు సాక్ష్యంగా మిగిలిపోయిన ఒక గ్రామానికి/దేశానికి చెందిన వాడిని 2 జ్ఞాపకాలలో మాత్రమే బ్రతుకుతూ రోజులు గడిపే వృద్దుడిని కాను మాటలు మాత్రమే చెప్పే మేధావిని కాను వర్తమానంలో గతాన్ని పునరుజ్జీవింపజెయ్యాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో కలిసివచ్చిన కొందరితో చేతనైన ఆచరణతో బతుకుతున్న మామూలోడిని 3 గతమంటే  యుద్దపు గాయాలు వర్గపోరాటాలు మిగిల్చిన జ్ఞాపకాలు మతాలు పంచిన మూర్ఖత్వాలు మాత్రమే అని కొట్టిపడేసే మేధావుల/జ్ఞానుల మధ్యలో నాలాంటి మామూలోడు అజ్ఞానే అవుతాడు

... పోవాల్సింది నీ ప్రాణం కాదు

వంశీ కలుగోట్ల // ... పోవాల్సింది నీ ప్రాణం కాదు // ********************************************** నీది మరణం త్యాగం కాదు అవకాశవాదులకు ఊతమిచ్చే ... అసందర్భపు చావు ప్రపంచానికి తిండి పెట్టే కష్టం నీది ప్రకృతితో పోరాడిన చరిత్ర నీది ఇవ్వాళ రాజకీయాలకు తలొంచుతున్నావా! నీ అస్థిత్వానికి ముప్పు తెచ్చే దార్శనికులు రాజ్యమేలుతున్న కాలమిది నువ్వు వెన్ను చూపి వెళ్ళిపోతే పోరాటం మాని నిష్క్రమిస్తే నీకు భవిష్యత్తు లేకుండా చేస్తారు నీవు లేకపోతే భవిష్యత్తే లేదని పొలం లేకపోతే తిండే ఉండదని అర్థం కాని నాయకులు దార్శనికులుగా కొనియాడబడుతూ అధికారం వెలగబెడుతున్నారిక్కడ ఇటువంటి సమయంలో నీవు వల్లకాదని నిష్క్రమిస్తే పోరాటం ఆపి ప్రాణం వదిలేస్తే భవిష్యత్తు అంతా అంధకారమే నువ్వు మొదలైంది పోరాటంతో నీకంటూ అంతముందంటే అది పోరాటంతోనే కావాలి ... బలవన్మరణంతో కాకూడదు  పొలంలో కలుపును తియ్యటమే కాదు సమాజంలో కుళ్ళును కడిగెయ్యటం కూడా వ్యవసాయమే అవుతుంది ...  రైతన్నా లే ... వ్యవసాయం మొదలెట్టు పోలలోనో కాకపొతే సామాజంలోనో కానీ, పోవాల్సింది నీ ప్రాణం కాదు