Posts

Showing posts from April, 2016

సూడు సిద్దప్పా ...

వంశీ కలుగోట్ల// సూడు సిద్దప్పా ...// ****************************** ***** 1 సూడు సిద్దప్పా ప్రపంచం నీగురించి మాట్లాడుకుంటే పక్కింటోడు మూతి విరుస్తాడు ప్రపంచం ఎప్పుడూ అంతే ఎవడెప్పుడెలా ఎదుగుతున్నాడా అని గమనిస్తుంది పక్కింటోడి తీరే అంత తను తప్ప అందరూ ఎదుగుతున్నారని అసూయ 2 సూడు సిద్దప్పా ప్రపంచానికి  ఎదిగే ప్రతివాడూ చుక్కాని లాగానో, ఊతకర్రలాగానో కనిపిస్తాడు పక్కనోడికి మాత్రం ఆ ఎదుగుదల తన అవకాశాలని దెబ్బతీసి పైపైకి ఎదుగుతున్నట్టుగా ఉంటుంది 3 సూడు సిద్దప్పా ఎక్కడి నీతి అక్కడ పాటించాలి అప్పా నువ్వున్నసోటుకి ఆవు వచ్చిందనుకో కావాలంటే దణ్ణం పెట్టుకో లేదంటే ఊరుకో ఏమీ విపరీతం జరగదు అదే పులి వచ్చిందనుకో కాలిసత్తువ కొద్దీ పరిగెత్తాల్సిందే అలా కాదు అక్కడే కూసుంటాను అంటే ప్రాణాలు పోతాయ్, పులి ఆవు లాంటిది కాదు

అక్షరాలు ...

వంశీ కలుగోట్ల// అక్షరాలు ... // ******************************* 1 కనిపించీ కనిపించక వినిపించీ వినిపించక నాలో నేను ... నాతొ నేను  వ్యక్తమో అవ్యక్తమో తెలియని భావాలన్నిటినీ మూటగట్టుకుని అక్షరాలుగా ఒలకబోసుకుంటూ రాలిపడిన సిరా చుక్కల అంచున జీవితాన్ని వెతుక్కుంటున్న స్వాప్నికుడిని 2 వెన్నెల్లో ఆడుకోవడానికి అందమైన ఆడపిల్లలు కాదు సముద్రపు ఒడ్డున ఇసుకలో గీతలు గీసుకోవడానికి అమాయకపు చిన్న పిల్లలూ కాదు నా అక్షరాలు కొన్ని భావాలను ఎగరేసే ఝెండాలు 3 జాతి మొత్తం నిద్దుర లేచేవేళ రక్తమోడుతున్న రంగుతో తూరుపుదిక్కున తెల్లారుతుంది నా అక్షరాలు వెళ్లి ఎవడి గుండెల చీకటిని చీల్చాయో అనిపించేలా

నవ్వుతూ ఉండిపో ...

వంశీ కలుగోట్ల// నవ్వుతూ ఉండిపో ... // **************************************** నవ్వుతూ ఉండిపో ... నువ్వుగా మిగిలిపో సిరిమువ్వకు మౌనం లేదు ... చిరునవ్వుకు మరణం లేదు *                 *                * నిజం చెప్పనా నేస్తం చిత్రంగా నాకు ఏడుపు రావట్లేదు విషాదం లేనే లేదు నీ మౌనాన్ని తట్టుకోలేక వెక్కిరిస్తూ కరిగిపోతోంది కాలం ఇంతకాలం పక్కనలేనని కోపమా ఏం చెయ్యను నేస్తం ఆశల పోరులో మునిగిపోయాను నీ స్నేహంలో సేద దీరదామని అనుకుంటే నువ్వు నిష్క్రమించావు నీ పరోక్షంలో విషాదాన్ని పలకరిద్దామని ప్రతి చోటా వెదికా ... విషాదం నీ దగ్గరే ఉంది కానీ, పంచుకోవడానికి నీవు లేవు  అయినా నువ్వెక్కడకెళతావు మమ్మల్ని కాదని దిగంతాలకావల నువ్వున్నా చిరుదివ్వెని వెలిగిస్తే మిణుగురువై రావా అయినా మేం వెళ్లనిస్తేగా చిరునవ్వుల రవ్వల్ని రువ్వుతూ నీవైపోచ్చే చీకటిని పారదోలుతాం *                 *                * డియర్ కిట్టూ ... నవ్వుతూ ఉండిపో, నువ్వుగా మిగిలిపో  --- భాసర సరస్వతీ అమ్మవారి దర్సనానికానీ వెళ్లి గోదావరి నదిలో ఊబిలో కూరుకుపోయి ఆప్తమిత్రుడు రామకృష్ణ ఆకస్మికంగా మమ్మల

ప్రళయమా ... ఉలికిపడు

వంశీ కలుగోట్ల// ప్రళయమా ... ఉలికిపడు// *************************************** భయముండేది ప్రళయమొస్తే ప్రపంచమేమవుతుందో అని  వరద చూపిన భీభత్సాన్ని ఉప్పెన సృష్టించిన ఉత్పాతాన్ని భూకంపపు తీవ్రతలను అగ్ని పర్వతపు లావాను గ్రీష్మ తాపాన్ని నీటి కొరతను ... ఒకటా రెండా ఎన్నని లేక్కలేసేది ఎదుర్కొంటూ పోరాడుతూ ఎదుగూ బొదుగూ లేని జీవితాలు వ్యాపారం చేసే తెలివిమంతులు రాజకీయం చేసే అవకాశవాదులు ... ... ఎవడూ, ఏ ఒక్కడూ నాశనమవలేదు ఇంతకుమించి ప్రళయమంటే ఏమిటో ఆ ప్రళయమొచ్చి పీకడానికి ఏం మిగిలుందో అందుకే ఎవడూ భయపడట్లేదు ఇక్కడ ...

ఇంకా మనిషినే ...

వంశీ కలుగోట్ల// ఇంకా మనిషినే ... // ************************************ ఓయ్ దేవుడా! నేను ఇంకా మనిషినే నేను మరిచిపోయింది కేవలం ఒక్కటంటే ఒక్క లక్షణం అది తప్ప నేను మరిచిపోయింది ఇంకేమీ లేదు కావాలంటే చరిత్రంతా చదివి చూసుకో ఓపికుంటే గతాన్నంతా తవ్వి శోధించి చూసుకో  ఎదగటం మరిచిపొయాననుకుంటున్నావేమో చూడు - చుక్కలదాకా పయనించే స్థాయికి సాంకేతికతను మెరుగుపర్చుకున్నాను చూడట్లేదా  వేటాడటం మరిచిపొయాననుకుంటున్నావేమో కేవలం జంతువులను మాత్రమే కాదు సాటి మనుషులను కూడా వేటాడి వేటాడి చంపేంతటి స్థాయికి ఎదిగాను తెలీట్లేదా  నువ్వూ చూస్తూనే ఉన్నావు కదా ఎక్కడినుండి ఎక్కడిదాకా నా పయనం సాగిందో నేను నువ్వయ్యే రోజు కూడా దగ్గరలోనే ఉంది  మరిచిపోయింది కేవలం ఒక్క 'మానవత్వాన్ని' మాత్రమే మిగతాదంతా సేమ్ టు సేమ్ - ఏమీ మారలేదు

... ఎవడెలా పుడతాడో?

వంశీ కలుగోట్ల// ... ఎవడెలా పుడతాడో? // ************************************* మేమిద్దరమూ కలిసి సినిమాకెళ్ళాం వాడికి ఆ హీరో సిగెరట్ తాగే తీరు నచ్చింది నాకు ఆ హీరో చివర్లో ఇచ్చే సందేశం నచ్చింది  ఇద్దరమూ క్రికెట్ మ్యాచ్ చూడటానికెళ్ళాం మ్యాచ్ చూస్తుంటే వాడికి జాతీయత గుర్తొచ్చింది నాకేమో మ్యాచ్ చూడటం సరదాకోసం అనిపించింది  ఊరి చివర చెరువు గట్టు మీద కూచున్నాం అక్కడికి బిందె పట్టుకుని వచ్చిన వాళ్ళని చూసి వాడికి వర్గం, కట్టుబాట్లు గుర్తొచ్చాయి నాకు వాళ్ళ దాహం కనిపించింది ... ... ... ఒకే విషయం వాడిని ఒకలా, నన్ను ఒకలా ఆలోచింపజేస్తుంది వాడిలోంచి రాజకీయ నాయకుడు నాలోంచి తిరుగుబాటుదారుడు పుట్టొచ్చు వాడిలోంచి ఒక జాతీయవాది నాలోంచి ఒక కవి/రచయిత పుట్టొచ్చు ఎవడెప్పుడెలా పుడతాడో ఎవరికీ తెలుసు

... ఆవేశాన్ని చూడాలనుకోకు

వంశీ కలుగోట్ల// ... ఆవేశాన్ని చూడాలనుకోకు // ********************************************** ఏం నేను మనిషిని కాదనుకుంటున్నావా లేక నాకు అలవాట్లు ఉండవనుకుంటున్నావా నాకున్న అలవాట్లు మంచివో, చెడ్డవో చెప్పడానికి నీవెవరని కావాలంటే ప్లెబిసైట్ పెట్టుకొని చూసుకో నా మాటలను, చేష్టలను ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో నీకే తెలుస్తుంది  అయినా, మనది ప్రజాస్వామ్యమని నీకు తెలీదా అంటే ఎక్కువమంది ఒప్పుకుంటే ఓకే అనే కదా మరి అలాంటప్పుడు నీకెందుకు దూల  చాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే పోయి ప్రజాభిప్రాయ సేకరణ చేసుకో పో నేను మాట్లాడినా నేను సిగరెట్ తాగినా అసలేం చేసినా ప్రజల కోసమే, వారి ఆనందం కోసమే ప్రజలకోసమే మేమున్నాం ... నువ్వేదైనా అనుకో కానీ, నేనూ మనిషినే అని గుర్తుంచుకో నాకూ ఆవేశం వస్తుంది, దాన్ని చూడాలనుకోకు నా ఆవేశాన్ని నువ్వు తట్టుకోలేవు, మాడిపోతావు

క్రికెట్ ...

వంశీ కలుగోట్ల// క్రికెట్ ... // ************************** సి కె నాయుడు సునీల్ గవాస్కర్ కపిల్ దేవ్ సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రవిడ్ సౌరభ్ గంగూలీ మహేంద్ర సింగ్ ధోని ... ... వీరి కులమేదో, ప్రాంతమేదో ఏనాడైనా పట్టించుకున్నారా ఆటను చూసి అభిమానించారు ఆరాధించి అగ్రపీఠం వేసి కూచోబెట్టారు నేనేం చేశానని మధ్యలో నా మీద పడి ఏడుస్తున్నారు  నాకోసం నాదంటూ ఏదైనా ఉందా నేనున్నదే మీ ఆనందం కోసం కదా వైపరీత్యాలు సంభవించినప్పుడు చారిటి మ్యాచ్ లు జరిపి ఆ వచ్చిన డబ్బేదో సహాయకార్యక్రమాలకు ఉపయోగపడటానికి కారణం నేనే కదా, నా మీద నీకున్న అభిమానమే కదా నేను మంచికే ఉపయోగపడుతున్నాను కానీ ఏనాడూ చెడు తలపెట్టలేదే నమ్మించి నట్టేట ముంచే నాయకుడిని నీ కులానికి చెందినవాడని నీ ప్రాంతం వాడని నీకు నచ్చినవాడని చెప్పి నెత్తికెక్కించుకుని ఊరేగుతావే వాడు నిన్నూ, నీ భవిష్యత్తునూ సర్వనాశనం చేస్తున్నా కూడా చేష్టలుడిగి చూస్తావు కానీ నన్ను మాత్రం ఆడిపోసుకుంటావు  విభేదాలన్నీ మరచి కనీసం ఒక్కరోజైనా మీలో అధిక శాతం మందిని ఒక్కతాటిపై నిలిపి 'మనం' అనే భావన కలిగించగలిగే శక్తి

... వాదానిదే విజయం

వంశీ కలుగోట్ల// ... వాదానిదే విజయం // ************************************* ఆలయపు గోడమీదో మసీదు అరుగు మీదో చర్చి మెట్ల మీదో కూచుని వాడంటాడు కులాలు లేవు, మతాలు లేవు మనుషులంతా ఒక్కటే పురాతన వాదాలన్నీ ప్రతిబంధకాలే అని వాడికింకా తెలిసినట్టు లేదు తన వెనకున్న కులం తనకి అధికారాన్ని ఇవ్వగలదని అధికారంలో ఉన్నప్పుడు తప్పులన్నీ కప్పిపుచ్చగలదని వాడికింకా తెలిసినట్టు లేదు నా వెనకున్న కులం నన్ను ఎదగనివ్వదని నా దరిద్రం కూడా ప్రభుత్వపు సహాయ పథకాలు అందుకోవటానికి పనికిరాదని వాడికింకా తెలిసినట్టు లేదు వాదాల ముసుగున సాగిన అణచివేతను శతాబ్దాల చరిత్ర సాక్షిగా అనుభవించిన సమాజం తిరగబడిన సమయంలో త్రాసుమొగ్గులో తేడా వచ్చిందే కానీ విజయం వాదాలదే అని వాడికింకా తెలిసినట్టు లేదు పురాతన వాదాలన్నిటికీ పాతరేసి విజయం సాధించడమంటే మేమిద్దరమూ ఒకే వైపు ఉండటమని చరిత్ర మారుస్తామని చెబుతూ చెరోవైపున నిలుచున్న మా ఇద్దరి లాంటోళ్ళను చూసి పురాతన వాదాలన్నీ విజయగర్వంతో నవ్వుకున్నాయి ...

ఇజాలు ...

Image
వంశీ కలుగోట్ల// ఇజాలు ... // ***************************** నచ్చిన పిచ్చితనం వెంట నడవడమే ఒక మహా ఆదర్శం అయితే ప్రతి పిచ్చితనమూ ఒక ఇజమే ప్రతి పిచ్చోడు ఒక మహా మేధావే  పిచ్చితనాన్నే నిజమనుకుని ప్రతి గాలిగాడూ నాదీ ఒక ఇజమని ఊపుకుంటూ ఊరేగుతున్నాడు  నిజానికి యే ఇజాలు లేవు భయ్యా ఎవడికి పట్టిన పిచ్చిని వాడు ఒక ఇజం అనుకుంటూ సంబరపడుతున్నారు నువ్వు చేసే పనే నీ ఇజం మిగతా ఇజాలన్నీ గాలి కబుర్లే నమ్ము, నమ్మకపో - ఇది నా ఇజం

లోకం తీరు ...

వంశీ కలుగోట్ల// లోకం తీరు ... // ****************************** ** 1 అలా ఇలా ఉంటుంది అని కవితలు రాసుకోవడం తప్ప తీరం దాటని కెరటం అందం గురించి ఎవరికీ ఏమీ తెలీదు ఉప్పెన కూల్చేసిన బతుకుల లెక్క మాత్రం ప్రపంచానికంతటికీ తెలుస్తుంది, గుర్తుంటుంది 2 బెర్లిన్ గోడ పగిలినప్పుడు ఎన్ని హృదయాలు ఉప్పొంగిపోయాయో తెలియదు కానీ బెర్లిన్ విడగొట్ట బడినప్పుడు పగిలిన హృదయాల లెక్క మాత్రం భూమి  పొరల అడుగున భద్రంగా  పాతిపెట్టబడి ఉంది అని ప్రపంచానికి తెలుసు 3 అఖండ భారతదేశం అంటూ ఎవరేర్పరచారో ఆ అఖండ దేశాన్ని ఎవరన్నా ఏకచ్చత్రాధిపత్యంగా పాలించారేమో ఎవరికీ తెలియదు, గుర్తుండదు ఆ అఖండ దేశాన్ని విడగొట్టినోళ్ళను మాత్రం ఎప్పటికీ మర్చిపోరు

నివాళి

Image
కవిత్వం బాధలోంచో, ప్రేమలోంచో పుడుతుందని అంటారు. నిజమో కాదో ఆ రెండింటివల్ల కాకుండా మరో భావనతో కవిత్వం మొదలెట్టిన వారెవరైనా ఉంటే చెప్పాలి. నా విషయంలో ఆ రెండు భావాలు ఒకేసారి నేనూ అక్షరాలను, వాక్యాలను కవితలుగా మలచగలనని నాకు అర్థమయ్యేలా చేశాయి. మా నాన్న కలుగోట్ల విజయాత్రేయ గారు మమ్మల్ని వదిలి వెళ్ళినపుడు తొలిసారిగా నాకు అర్థమైన విషయమది. 1996 వ సంవత్సరంలో ఆయన నిష్క్రమణ కారణంగా బాధ, ప్రేమ భావనలు నా తొలికవితకు నాంది అయ్యాయి. ఈ 'నివాళి' నా తొలి కవిత ... కవిత అనొచ్చో లేదో, ఏదైనా కానీ నా భావాలను అక్షరరూపంలోకి మలచడం మొదలెట్టిన ఖ్సనాలు కాబట్టి దాన్ని నేను నా తొలికవితగానే పరిగణిస్తున్నాను ... జస్ట్ ఊరికే మిత్రులతో పంచుకోవాలనిపించింది. 

సినీ'మాయ' భయాలు ...

వంశీ కలుగోట్ల // సినీ'మాయ' భయాలు ... // ******************************************* ఇంటిముందు ఉన్న పిచ్చిమొక్కని పీకేద్దామంటే 'మొక్కే కదా అని పీకేస్తే ...' అంటూ ఇంద్రసేనారెడ్డి వస్తాడేమో అనిపిస్తుంది *          *          * ఆకాశంలో మెరుపులు మెరిసినప్పుడల్లా యే ఆదికేశవరెడ్డో ఎక్కడన్నా జైలు ముందర తొడ కొట్టాడేమో అని దడ పుడతాది *          *          * మా ఏరియాలో ఎండలు మండిపోయినప్పుడల్లా ఈ ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి మళ్ళీ మా సీమకు తిరిగి ఎప్పుడొస్తారో అనిపిస్తుంది *          *          * నేను కొన్న పుస్తకానికి రెండోవైపున   ఏముందో అని చూడాలంటే భయమేస్తుంది చూస్తే ఎక్కడ మాడిపోతానో అని *          *          * ఈ మధ్యన అసలు ధియేటర్ కి వెళ్ళాలనే ఆలోచన రాగానే దడ పుడుతోంది ఎక్కడ సృజనాత్మక చిత్రాలు 'ఎటాక్' చేస్తాయో అని

మోక్షమార్గం ...

వంశీ కలుగోట్ల// మోక్షమార్గం ... // ******************************* కసాయివాడంటే  కరుకుమనసున్న వాడు కాదు ఎటువంటి వివక్షలూ అనుమానాలూ లేకుండా ఖచ్చితంగా మోక్షాన్ని ప్రసాదించగల  ... మహానుభావుడు  నువ్వు మొక్కే మహానుభావులు నువ్వు పూజించే దూతలు నువ్వు విశ్వసించే ప్రవచనకారులు వాళ్ళంతా ముసుగేసుకున్న కసాయిలే మోక్షం పొందే మార్గం చెపుతామని మోసం మాత్రమే చేస్తారు  నీకు నిజంగా మోక్షం కావాలంటే అంత దమ్మే కనుక ఉంటే పో ... పోయి కసాయివాడి ఎదురుగా బలిపీఠమ్ మీద తల ఉంచి చూడు కసాయివాడు మోసం చెయ్యడు వాడి చేతిలోని కత్తి గురితప్పదు

వాదులు ...

వంశీ కలుగోట్ల// వాదులు ... // *********************************** ఎవడో ఏదో ప్రవచించాడని  కళ్ళు మూసుకుని గొర్రెల మందలో ఒకడిలా  వాడి వెనుక తోకేత్తుకుని పరిగెత్తే  ప్రతి బుర్రతక్కువ వెధవా 'వాది'గా మహా మేధావిగా గుర్తింపబడుతున్నారు అసలు 'వాదం' విలువ చచ్చి  అదీ ఒక మతమై కూచుంది  వాదులందరూ ఉన్మాదులవుతున్నారు ప్రశ్నించిన ప్రతివాడూ 'వాది' కాడు  నమ్మిన ప్రతివాడూ భక్తుడు కాడు 

... దాటొచ్చి చూడు

వంశీ కలుగోట్ల//... దాటొచ్చి చూడు // ****************************** ****** ఉడుకురక్తం ఉరకలెత్తి, ఆవేశం పొంగిపొర్లి అన్యాయాన్ని ఎదిరించటానికి పోరుబాట పట్టి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కనిపించేదంతా 'నీ' వారి బాధలే  కనీసం అప్పుడైనా గుర్తుకువస్తుందా నిన్ను అడ్డగించిన కుటుంబసభ్యులది మూర్ఖత్వం కాదు నీ మీద ఉన్న ప్రేమ, అభిమానం అని నీకోసం జాలువారిన రెండు కన్నీటిచుక్కలు బలహీనతకు తార్కాణం కాదు నువ్వే తమ బలమనుకున్నవారి బాధ అని నోట మాటరాక మూగబోయిన మనిషి దిక్కులేని, బతకలేని వ్యక్తి కాదు నీతోనే బతుకని వచ్చిన మనిషి అని  నిక్కమైన నిజాలు తెలుసుకునేసరికి నిప్పుల వ్యూహం మధ్యలో ఉంటావు నీకోసం నిరీక్షించిన బతుకులు నిరాశతో కూలిపోయాయని తెలుసుకున్నప్పుడు 'త్యాగం అంటే నీది కాదురా నీకోసం కరిగిపోయిన మాది' అని ఘోషిస్తున్న ఆ ఆత్మల గోడు వినగలవా తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల్లా కొన్ని బతుకులు అంతే, అలా ముగిసిపోతుంటాయి స్థూపాలపై నీ పేరు చూసుకోలేక అమరత్వాన్ని ఆపాదించి సంతోషపడలేక ఎప్పటికీ ఘోషిస్తూనే

దేవుడు అంతా చూస్తన్నాడు భయ్యా ...

వంశీ కలుగోట్ల// దేవుడు అంతా చూస్తన్నాడు భయ్యా ... // ****************************** ************************** భయ్యా, నీకు తెలుసో లేదో కానీ ఈ మధ్యన దేవుడు ఫేస్ బుక్ లో ఆక్టివ్ గా ఉన్నాడు వాట్స్ ఆప్ లో ఛాట్ చేస్తున్నాడు సోషల్ మీడియాలో తెగ ట్రెండీ గా తయారవుతున్నాడు  నీకు ఇంకా అనుమానంగా ఉంటే ఒకసారి నీ ఫేస్ బుక్ లోకి వెళ్లి చూడు ఎవడో ఒకడు ఏదో ఒక దేవుని బొమ్మ పెట్టి దానికింద రాసుంటాడు చూసుకో 'అయిదు నిమిషాల్లో షేర్ చెయ్యకపోతే నీకు అయిదు సంవత్సరాల దురదృష్టం' అని మరింకేవడో ఇంకో బొమ్మ పెట్టి 'ఇదే అసలు దేవుడి బొమ్మ వందమందికి షేర్ చెయ్యకపోతే నీ ఖర్మ' అని రాసుంటాడు  దేవుడు చూస్తున్నాడు భయ్యా తన ఫోటో లైకకపోయినా షేర్ చెయ్యకపోయినా నీమానాన నిన్ను ఊరికే వదిలేస్తాడనుకుంటున్నావా లెక్క పెట్టుకుంటున్నాడు తప్పులన్నీ నీ ఖర్మ కాలి తగలడకముందే గబాల్న షేర్ చేసి పడెయ్యి భయ్యా  ఇంకోసారి ఫేస్ బుక్ ఓపెన్ చేసి చూడు ఏనుగు తలకాయతోనో పంది శరీరంతోనో లేకపోతే రెండు తలలు, నాలుగు కాళ్ళు/చేతులతో ఒక విచిత్ర పిల్ల జీవి బొమ్మ పెట్టి 'ఇక

పిడికెడు ధూళి ...

వంశీ కలుగోట్ల// పిడికెడు ధూళి ...// ****************************** **** ఎవరో ఒక మేధావి  మూలాలు వెతికి చూసినపుడు నేను హిందువునైతేనేమి లేక ముస్లిమునైతేనేమి క్రైస్తవుడినో కాకపొతే మరే వర్గపు వాడినో నేనెవరైనా సరే సమాజం లెక్కలో గాలిబ్ చెప్పినట్టు 'ఎవరికీ పనికిరాని పిడికెడు ధూళిని' మాత్రమే ఎప్పుడో యుగాలనాటి, శతాబ్దాల క్రితపు  చరిత్రను తవ్వుకోవడమెందుకులే మొన్న మొన్నటి గతాన్ని తలచుకున్నా ఒక్కటిగా ఉన్న దేశం ముక్కలుగా విడిపోయినప్పుడు ఆక్రమణలు, అరాచకాలు దాడులు జరిగినప్పుడు సబర్మతి రైలు బోగీ తగలబెట్టబడినప్పుడు దానికి ప్రతిగా హింసాకాండ జరిగినప్పుడు ముంబై పేలుళ్లు, గోకుల్ ఛాట్ ప్రకంపనలు పార్లమెంట్ ముట్టడి, తాజ్ హోటల్ పై దాడి ఒకటా రెండా - ఎన్నని ప్రస్తావించేది  కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా దాష్టీకానికి బలైనదెవరైనా ఉగ్రదాడిలో ఊపిరి వదిలినదెవరైనా హింసాకాండలో అసువులు బాసినదెవరైనా పోయినదెవరో తెలీకపోయినా రాజకీయం రంగప్రవేశం చేసి ఏదో ఒక మతం/వర్గం రంగు పులిమి సామాన్యులను బలి చేస్తోంటే మనమేం చేయ్యగలిగామని నా మూలాలు వెతికి నన్నూ ఏదో ఒ