Posts

Showing posts from 2015

మరో కొత్త సంవత్సరం ...

వంశీ కలుగోట్ల// మరో కొత్త సంవత్సరం ... // ****************************** ************ కొత్తగా పథకాలు వేసుకోవడానికి పథికుడిగా మారడానికి నేనేమీ ఇన్నాళ్ళూ చేష్టలుడిగి, చైతన్యం కోల్పోయి  అన్నీ మూసుకుని మూలాన కూచోలేదు  అయినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పథకాలు వేసి ఆచరించినా ప్రతి సంవత్సరం వయసు ఒక అంకె పెరుగుతూనే ఉంది నెత్తిమీది జుట్టు ఊడుతూనే ఉంది సంపాదించిన డబ్బు సరిపోవట్లేదు కొన్న వస్తువులు తృప్తినివ్వట్లేదు ... పాత అప్పులు తీరట్లేదు దీనమ్మా జీవితం ... పాత సంవత్సరం ఏమిచ్చిందో  అర్థం కాక కొత్త సంవత్సరం ఏమి తెస్తుందో తెలీక ప్రతి సంవత్సరం చివరిరోజన నేను అనుభవించే వేదన ఎవరికి తెలుసు ఖాళీ అయిన విష్కి బాటిల్ కా కాలిపోయిన సిగరెట్టుకా మాటలు రాని కాలానికా అయినా ప్రతిసారీ అదే తంతు ... నా పథకాలు నేను వేసుకుంటూంటే సంవత్సరం/కాలం తనఇచ్చానికి తను చేస్తోంది అందుకే ఇక మీదట పథకాలు లేవ్ ఆచరణల్లేవ్ ... జో హోనేవాలా వో హోగా ... సోచ్ నా మత్, ఫికర్ నా మత్ జీయెంగె జిందగీ ... హర్ పల్, దిల్ భర్ ఇస్ సాల్ ... ఔర్ హర్ సాల్, జీయో మేరె లాల్ --- అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

స్వగతం ...

వంశీ కలుగోట్ల// స్వగతం ... // ****************************** నన్ను మళ్ళీ ప్రేమించలేవా నా సర్వస్వం కోల్పోయి నీ ప్రేమకోసం ఎదురు చూస్తున్నాను అప్పుడప్పుడు నీ కోపం ఉధృతమై ఉప్పెనలా ఊడ్చి పారేసినపుడు నీ శోకం వరదై ముంచేసి కూల్చేసినపుడు చేష్టలుడిగి బిత్తరపోవడం తప్ప నేనేం చేయగలిగాను అవును, ఒప్పుకుంటున్నాను   ప్రకృతి లేదూ పర్యావరణం లేదూ అని తోసిపారేసింది నేనే నీ కంటే సంపదలే ముఖ్యమని   డబ్బుంటే ఏదైనా సాధించొచ్చని అనుకున్నా   కానీ ... నిన్ను కాపాడుకోకుంటే   నాకు ఉనికి అనేదే ఉండదని   ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది  నీ ప్రేమని తప్ప మరింక దేన్నీ తట్టుకోలేనని నాకు అర్థం అయింది ఓ ప్రకృతీ ... నా సర్వస్వం కోల్పోయి నీ ప్రేమకోసం ఎదురు చూస్తున్నాను నన్ను మళ్ళీ ప్రేమించు

అప్పట్లో పండగలుండేవి భయ్యా ...

వంశీ కలుగోట్ల // అప్పట్లో పండగలుండేవి భయ్యా ... // ****************************** **************** భయ్యా నీకు తెలుసో లేదో తెలీదు కానీ  మేము సేడ్డీలేసుకుని తిరిగే రోజుల్లో  మా ఊర్లో పండగ అంటూ ఒకటి ఉండేది భయ్యా  మా యాదిగాడు, యాకోబు గాడు, జోసేఫూ, నేనూ  పండగ గురించి పెద్దగా తెలియక పోయినా  మస్తు ఎంజాయ్ సేసేటోల్లం భయ్యా ...  పండగ వస్తంది అంటే ముందు రోజు నుంచే  ఇంట్లో హంగామా మొదలయ్యేది భయ్యా  ఆడోల్లందరూ అర్దరాత్రి దాకా మేల్కొని  గోరింటాకు పెట్టుకుంటూ ఉండేవోల్లు  తెల్లారగానే ఇంటి ముందు కళ్లాపి జల్లి  పెద్ద పెద్ద రంగుల ముగ్గులేసే వాళ్ళు  సంక్రాంతికైతే ఆ ముగ్గుల మీద గొబ్బెమ్మలు అదనం  మేమైతే భయ్యా ... గోలీలాట, బొంగరాలాట, చిల్లా గోడే  దాగుడుమూతలు, దొంగా పోలీస్ ఇలా ఆటలే ఆటలు  మామూలుగా టైంకి ఇంటికి తీసుకొచ్చే ఆకలి కూడా  ఆ వేళ గుడికెళ్ళిపోయింటాదేమో తెలియదు  పిండివంటల లిస్టు ఇంటివేపు పిలుస్తూ హడావిడి చేసినా ఆటల్లో ఉండే మజా మిస్సయ్యేలా ఉండేది కాదు  భయ్యా ... సాయంత్రమైతే వాగు ఒడ్డున ఇసుకలో  ఎడ్ల పందేలు, బండ లాగుడు పందేలు, పరుగు పందేలు లాటివి ఎన్నో  ఆ పందాల హంగామా అంతా అ

హృదయం క(వ్య)థ ...

వంశీ కలుగోట్ల// హృదయం క(వ్య)థ ...// ****************************** ****************** ఈ హృదయాన్ని గురించి ఆలోచించినపుడు       ... నాకే చిత్రంగా అనిపిస్తుంది  ఎన్ని దెబ్బలు తగిలినా  సాటి హృదయాలెన్ని గాయాలు చేసినా  తన భావజాలాన్ని  తన ప్రేమభావాన్ని  తన స్నేహతాపాన్ని  ఈ హృదయం ...  అణచుకోలేదెందుకని!  అణగారిపోదెందుకని!  అటు స్నేహించడమూ  ఇటు ప్రేమించడమూ  గాయాలు తగిలితే  గేయాలతో స్వాంతన పొందడమూ  బహుశా ... అలవాటైపోయిందేమో  ఈ హృదయంలో ఇంకా  ఎంత ప్రేముందో ... ఎంత స్నేహముందో  తెలియడం లేదు  అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది  నా హృదయంలో కనుక  ఇంత స్నేహమూ ఇంత ప్రేమా లేకపోయుంటే  తగిలిన గాయాల ధాటికి  నేనెప్పుడో గేయమై గాలిలో  కలిసిపోయే వాడినేమో అని 

ఒక అసహనపు కల ...

వంశీ కలుగోట్ల// ఒక అసహనపు కల ... // ****************************** ************ ఒక్కో జెండాని నెత్తికెత్తుకుని ప్రజల పక్షాన పోరాడుతున్నామంటూ పార్టీలను భుజాన మోస్తూ బాకా ఊదే పత్రికలన్నీ చదువుకుని నా తీరున నాకు నచ్చినదేదో రాసేసుకుని ఆ రోజుకు ఇక చాలని నిద్రించాను        *          *          * "... అప్పుడు వ్యతిరేకించానని వాడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నానని వీడు వేట కుక్కల్లా వెంటపడుతున్నారు రహస్యంగా తలదాచుకున్నాం ముష్కరమూక ఇల్లంతా వెతికినా ఎవరూ కనబడక వెనుతిరిగారు  ఎందుకో తెలీదు కలుగులోంచి రహస్య మార్గం గుండా నేనొక్కడినీ బయటకొచ్చాను కొత్తగా ఏదైనా రాయటానికి ఎవరి వెతలనో ఏరుకుందామని కావచ్చు కనిపించిన నన్ను చూసి అసలు నేనెవరో కూడా తెలీకపోయినా నా రంగు వేరని, నే పట్టుకున్న జెండా వేరని వెంటపడి తరుముతున్నారు  ఏ తలుపూ తెరుచుకోక దారివెంట పరిగెడుతూంటే మూసుకుని ఉన్న ప్రతి తలుపు వెనుకా నిస్సహాయతతో కూడిన భయం వినబడుతూనే ఉంది  అంగ అంగకూ ఆశలు వదిలేసుకుంటుంటే ఒక తలుపు తెరుచుకుంది తెరిచిందెవరో తెలీదు కానీ లోపల ఉన్నదంతా పిల్లలే రేపటికోసం కలలుకంటూన్న

మాటలు - చేతలు

వంశీ కలుగోట్ల// మాటలు - చేతలు// ****************************** ******* ఆయనేమో ఆకాశందాకా ఎదిగి చూపుతానంటారు అనుచరులేమో విలువలను పాతాళానికి తొక్కేస్తున్నారు ఆయనేమో ప్రపంచదేశాల పక్కన కూచోబెడతానంటారు మళ్ళీ పక్కరాష్ట్రంలో పట్టు కోసం నానా పాట్లు పడతారు  అందరికీ కావాల్సిన వాడినేనంటారు, అన్నీ చేస్తానంటారు తీరా చూస్తే అటు సొంత సీమను ..................స్తున్నారు  కనిపించిన ప్రతిదాన్నీ జాతికి అంకితం చేస్తానంటారు వెనకున్న కులపోళ్లెమో జాతి అంటే తామే అనుకుని అల్లుకుపోతారు  ద్యావుడా ... ఆయనేమి చెపుతున్నాడో వీళ్ళేమి అర్థం చేసుకుంటున్నారో

ఎదిగిన మనుషులు ...

వంశీ కలుగోట్ల// ఎదిగిన మనుషులు ... // ****************************** ********** ముల్లుగట్టె బట్టుకుని ఎద్దు ముడ్డి ఎనకాల నడుసుడు సెడ్డీల కాలం నుంచీ అలవాటే  చిన్నప్పుడు బడికి పంపితే సంతకాలు పెట్టేకాడికి సదువుకుని పొలం పనుల్లో పడిపోయిన  తోటి సదువుకున్నోల్లందరూ పట్నంల, ఇదేసాల్లో ఉద్దోగాలు సేసుకుంటా ఎదిగిపోయినారు  మేం సిన్నప్పుడు సదివిన స్కూల్ల సదువుకుని పైకొచ్చినోల్లందరూ అదేదో రి యూనియన్ అని మల్లోకసారి కలుద్దాం రమ్మన్నరు  యాడనో ఉన్న సిన్ననాటి దోస్తులందరు వస్తన్నరు గదా కలుద్దమని ఆడికి బోయిన పిలిసి కడవ సేతిల బెట్టి నీళ్ళు తెమ్మన్నరు కింద బెట్టిన చాయ్ గిలాసులు తియ్యమన్నరు  పని సేప్పెటోల్లె తప్ప పలకరించేటోడు కనబడలేదు పని మానుకొనుడెందుకని పొలంకు పోయిన ... రోజూలెక్కనే ఏ కల్మసం లేకుండా గాలికి తలకాయలూపుతూ మొక్కలన్నీ నన్ను పలకరించినయ్ 

లేచిన ప్రతిగొంతుకా ...

వంశీ కలుగోట్ల// లేచిన ప్రతిగొంతుకా ... // ****************************** ********* ప్రశ్నించే ప్రతివాడూ            ... పడని వాడే లేచిన ప్రతి గొంతుకా             ... ప్రతిపక్షందే అధికారంలో వేరేవాడున్నప్పుడు  నేను ప్రశ్నిస్తే  వెన్ను తట్టి అండగా నిలబడతానని  జనాన్నేసుకుని వచ్చాడు  నేనే మహాత్ముడినన్నాడు  రోజులు మారిపోయాయి  ప్రభుత్వాలూ మారిపోయాయి  కొత్తగా వచ్చినాయన దేవుడు లాంటోడు పట్టిన దయ్యాన్ని వదిలిస్తాడనుకున్నాం  అయినా దెయ్యత్వం అంటే            ... లక్షణమే తప్ప వ్యక్తి కాదని  పాత/నిత్య సత్యం మళ్ళీ  కొత్తగా అనుభవంలోకి వచ్చింది  ఆనాడు అండగా నిలబడి  ప్రశ్నను ఉద్యమంగా మార్చిన వాడే  ఇప్పుడు ప్రశ్నే వినబడకూడదంటున్నాడు  నా గొంతుక కూడా  ప్రతిపక్షందే అంటున్నాడు  అవును నేను, నాలా ప్రశ్నించే వారు నిత్య ప్రతిపక్షవాదులు

దేవుడు - సన్యాసి

వంశీ కలుగోట్ల// దేవుడు - సన్యాసి// ****************************** ****** దైవత్వం అంటే మానవత్వాన్ని రక్షించేది కదా పిచ్చి కాకపొతే ఆ దైవత్వాన్ని రక్షిస్తానంటూ ఒకడొస్తే నమ్మి నాయకుడిని చేసి నెత్తినెక్కించుకుని ఊరేగడమేమిటి      *          *          * పెళ్ళాన్ని వదిలేసిన వాడు పుణ్యాన్ని ఆశించిన వాడు కాషాయం కట్టుకున్న ప్రతివాడూ సన్యాసి కాడు, కాలేడు అయినా సన్యాసం అంటే వదిలేయ్యటమో పారిపోవటమో కాదు సన్యాసం అంటే జయించటం

నీవు ...

వంశీ కలుగోట్ల// నీవు ... // ***************************** ఎందుకు  ఎపుడూ ఎవరితోనో  నిన్ను పోల్చాలనుకుంటావు  చందమామలాగానో  గులాబీలాగానో  మెరిసే తారకలాగానో  ఇంకెలాగోనో  మరేవరిలాగానో ఎందుకివన్నీ ...? ఎవరిలానో ఉన్నావనో  ఎవరినో మరిపిస్తావనో  నిన్ను ఇష్టపడలేదు  'నిన్ను'గానే ప్రేమించాను  'నీవు'గా ఉంటేనే నీకు అందం 

నేనెవరంటే ...

వంశీ కలుగోట్ల// నేనెవరంటే ... // ******************************** నువ్వు విషాదంగా ఉన్నపుడు            నీకు దూరంగా ఉంటాను! అంతర్మధనంలో  నిన్ను నీవు తెలుసుకోవాలని  నువ్వు ఆనందంగా ఉన్నపుడు            నీ దరికి రాను! నీలో అది నిలిచిపోవాలని  నువ్వు విజయాలు సాధిస్తే            ఆకాశానికెత్తేయను  సాధించాల్సింది ఇంకా  చాలా ఉందని గుర్తు చేస్తాను  నువ్వు బాధల్లో ఉన్నపుడు            నేను ఓదార్చను! అధిగమించే శక్తినిమ్మని ప్రార్థిస్తాను  నువ్వు కిందపడితే            చేయందించి పైకి లేపను నింగికెగసే దమ్ము ధైర్యం  నీకుండాలని కోరుకుంటాను  నువ్వు దూరంగా వెళతానంటే            నేను బాధపడను జీవనపోరాటంలో ముందుకెళుతున్నావని సంతో షిస్తాను  నేనెవరని చెప్పమంటే ఏ ముసుగు లేని  స్నేహం అనే బంధాన్ని  నీతో కలుపుకున్నోడిని  (సందర్భం సరిగ్గా గుర్తులేదు కానీ 2004 వ సంవత్సరంలో రాసినది/రాసుకున్నది)

ఓ కాలమా ...

వంశీ కలుగోట్ల// ఓ కాలమా ... // ****************************** ******* ఈ మేఘాల్ని తీసుకెళ్ళిపోతావేమో                      ... వర్షించకుండానే   నా నిద్దురని చెరిపేస్తావేమో                      ... స్వప్నం పలకరించకముందే  అని భయపడుతూనే ఉంటాను  అందుకే ... ఓ కాలమా  నిన్ను అందుకుందామని            ... పరుగులు పెడుతుంటాను  కానీ, నువ్వేమో క్షణం ఆలస్యం చెయ్యకుండా            ... నిర్దాక్షిణ్యంగా కరిగిపోతావు  నిన్నెలా నిక్షిప్తం చేసేది? 

ఆహ్వానం ...

వంశీ కలుగోట్ల// ఆహ్వానం ...// ************************************ రెక్కలు విప్పుకురా ఓ రాబందూ  శవాల్ని పీక్కుతినే గుంటనక్కా  మీకందరికీ ఇదే నా ఆహ్వానం  సకుటుంబ సపరివార సమేతంగా  మీరంతా తరలి రండి  ఇక్కడున్నదంతా జీవమున్న శవాలు  మీకిక విందుభోజనం తయారు  కోట్లాది భారతీయుల చేవచచ్చిన  శరీరాలు కుళ్ళిపోతున్నాయి సిగ్గు చచ్చిన ఈ మనుషులను  పౌరుషం చచ్చిన ఈ పౌరులను  జనాభా పెంచే యంత్రాలుగా  మారిన నా ఈ ప్రియ భారతీయ జీవచ్చవాలు   మీకోసం తయారుగా ఉన్నాయి  చేవచచ్చిన నాయకులిచట  వెన్నెముక లేని శరీరాలతో  చెబుతుంటారు శ్రీరంగనీతులు  అంతా ఇక్కడున్నదంతా జీవచ్చవాలే  రెక్కలు విప్పుకురా ఓ రాబందూ 

కప్పు కాఫీ కోసం ...

వంశీ కలుగోట్ల// కప్పు కాఫీ కోసం ...//   ****************************** ***** అరేయ్ కాఫీ ఒరేయ్ కాఫీ తమ్ముడూ కాఫీ అన్నయ్యా కాఫీ అక్కా, చెల్లీ, అమ్మా, నాన్నా బావా, మామా ... ప్రేమగా పిలిచే పిలుపేదైతేనేం అందించే చెయ్యి వరసేదేతైనేం కప్పు కాఫీ లోపల పడితే ఆ కిక్కే వేరప్పా ... తిరుణాల కెళ్ళినా తీర్థయాత్రకెళ్ళినా పక్కూరికెళ్ళినా పెళ్ళైనా చావైనా కాఫీలేని చోటేది అయ్యర్ హోటలో మస్తాన్ బడ్డీ కొట్టో శెట్టి గారి దుకాణమో పొద్దున్నే మత్తు వదలగొట్టటానికి కప్పు కాఫీ కడుపులోపల పడాల్సిందే  కప్పు కాఫీ కోసం కులమూ మతమూ స్థలమూ అన్నీ వదిలేసి అందరిలో ఒకడినైపోయిన నేను  కాఫీ లోపల పడగానే రాత్రంతా తొక్కిపెట్టిన కల్మషాలను బయటపెట్టి మనిషితోలు కప్పుకుని మృగత్వాన్ని ప్రదర్శిస్తూ మరో రోజును ఆ విధంగా ముందుకు తీసుకుపోతూ ... ... కప్పు కాఫీ కోసం అన్నీ వదులుకోగలిగిన నేను సాటి మనిషి కోసం ఏదీ వదులుకోలేక మరో కప్పు కాఫీ కోసం రేపటి ఉదయానికై ఎదురు చూస్తూ ...

బాటసారి ...

వంశీ కలుగోట్ల// బాటసారి ...// ***************************** వచ్చింది చెప్పటానికి కాదు, చూపటానికి చరిత్ర కోసం బ్రతకటానికి కాదు బ్రతుకే ఒక చరిత్ర కావాలని, చరిత్ర సృష్టించాలని  కెరటాన్ని కాను ... పడిపోవటానికి కాలపు నెత్తుటి మడుగు ఒడ్డున అడుగులకు మడుగులొత్తుతూ వెళ్ళే ... పిరికిపంద గమనం కాదు  నిప్పులు కురిపించేదో  నిబిడాశ్చర్యంతో నువ్వు చూసేదో కాదు  ఎన్నిసార్లు ప్రయత్నించినా  ఓటములు, భయాలు ఆపలేనిది ఈ గమనం నిరంతర గమనం నా నైజం నాదొక స్వప్నం ... నేనొక చరితం నాదొక లక్ష్యం ... నేనోక జ్వలనం

పరాయివాడినే ...

వంశీ కలుగోట్ల// పరాయివాడినే ... // ****************************** ******** ఆశకు అధికారానికి మధ్యన నిలబడి రక్తం చిందకూడదని రాజ్యం వదులుకున్న రాముడిని చూపాను ధర్మానికి రూపమని, మహానుభావుడని చెప్పి దేవుడిని చేసి ఒక మతం గాటన కట్టేశారు రక్తం చిందించి మానవత్వం నిలబెట్టాలని ప్రయత్నించిన జీసస్ ని చూపాను ఆ బోధనలు ఒక గ్రంథమని ఆయనదో మతమని తీర్మానం చేసారు జ్ఞానం కోసమని రాజ్యం వదులుకున్న గౌతముడు నమ్మినదాని కోసం సర్వం త్యాగం చేసిన వర్ధమానుడు విగ్రహాలను కాదంటూ నిగ్రహాన్ని బోధించిన ప్రవక్త ఎంతమందినని చరిత్ర లోంచి తీసి ఈ మనుషులకు నిదర్సనంగా చూపాలి చూపిన ప్రతి ఒక్కడినీ ఒక దేవుడిని చేసి ఒక్కొక్కరిదీ ఒక మతమంటూ చివరకు ప్రశ్నించటాన్ని కూడా ఒక మతం చేశారు ఒకప్పుడు మతం అంటే విశ్వాసం ఇప్పుడు మతం అంటే మూర్ఖత్వం విశ్వాసానికి విలువిచ్చి మూర్ఖత్వాన్ని ప్రశ్నిస్తే పరాయివాడంటే - ఏమో అవునేమో

నువ్వెవరో ...

వంశీ కలుగోట్ల // నువ్వెవరో ... // ******************************** నువ్వు రాతగాడివో పాటగాడివో ఆటగాడివో పనివాడివో పనికిమాలినోడివో ఎవరైతేనేం నువ్వు చేసేది ఏదైతేనేం అది ఎంత బావుంటే మాత్రం మెచ్చుకుని మాలలేసి  వెన్ను తట్టి ప్రోత్సహించాలా నీ గురించి మాట చెప్పాలా నువ్వెవరో తెలుసుకోకపోతే ఎలా నీ ముందూ వెనుకా ఎవరున్నారో నీదే వర్గమో నీవే వాదానికి ఊతమిస్తున్నావో తెలీకుండా తెలుసుకోకుండా ఊరికినే పల్లకి మోయాలా  ముందు నువ్వెవరో చెప్పు నిన్ను భుజాల మీద మొయ్యాలో ఎత్తి కుదెయ్యాలో ఆ తరువాత తేల్చుకుందాం

... నీట తేలిన మానవత్వం

వంశీ కలుగోట్ల // ... నీట తేలిన మానవత్వం // ****************************** ******** ఈ మనుషులు నివురు గప్పిన నిప్పులు మంచికైనా చెడుకైనా  నిన్నా మొన్నటిదాకా గొప్పెవడని వాడూ వీడూ గొడవపడ్డారు విద్వేషాగ్నులు చిమ్ముకున్నారు అసహనం పేరు చెప్పి అనవసర రచ్చ చేశారు ఇవ్వాళ నివురు తొలగింది నిప్పులాంటి మంచిగుణం బయటకొచ్చింది విపత్తు విద్వేషాన్ని భగ్నం చేసింది వెళ్లి చూడు చెన్నైకి దమ్ముంటే   ఏ మతం గొప్పదో ఏ వాదం గట్టిదో ఆలయాలు కడిగిన ముస్లింని అన్నం పెట్టిన మసీదుని ఆశ్రయమిచ్చిన చర్చిని గోప్పేదని, గొప్పెవరని అడిగి చూడు ఇన్నాళ్ళూ ... విక్రుతత్వాన్ని చూపుకోవటానికి వేదికలైన ఫేస్ బుక్, ట్విట్టర్ గట్రాలే విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచి ఆసరానిచ్చాయి నా మతమో నీ మతమో కాదు మానవత్వమే గొప్పదని నీరొచ్చి ముంచేదాకా తెలియరాలేదా  ఈ దేశంలోనే కాదు నా మతంలో నీ మతంలో కూడా ఎప్పుడూ సహనం ఉంది అసహనం ఉన్నది కొద్దిమంది బుర్రల్లో  ప్రతిసారి ప్రకృతి వచ్చి నివురుని విప్పి నీ నగ్నత్వాన్ని నీకు చూపాలంటే నీ అస్థిత్వాన్ని కోల్పోతావు

... ఈ కవితకు పేరు లేదు, ఒక జీవితం. అంతే

వంశీ కలుగోట్ల// ... ఈ కవితకు పేరు లేదు, ఒక జీవితం. అంతే // ****************************** ****************************** ** తెల్ల కాగితంలా మొదలైన జీవితాన్ని మొదటి పేజీనుంచి చూస్తూనే ఉన్నా ఏం సాధిస్తుందో ఈ జీవితం అని ఎన్ని అబద్ధాలు, ఎన్ని భయాలు పేజీకొకటి చొప్పున మోసుకుంటూ జీవితాన్ని పుస్తకంలా ముందుకు తీసుకేళ్తున్నట్టు రోజుకో కొత్త అబద్ధంతో ప్రతి దానికి ఇతరులతో పోల్చుకుంటూ బతికేస్తూ ఉన్నప్పుడు తిప్పేసిన పేజీల్లోంచి ప్రశ్నలు పుట్టుకొచ్చాయి 'నీకుగా అనిపించేది ఎపుడు నీవుగా తెలుసుకునేది ఎపుడు' అంటూ  ఆఫీసులో పక్క సీటోడు కారు కోనేసాడని తాహతు లేకపోయినా తెల్ల ఏనుగు లాంటి కారును తెచ్చి నెత్తిమీది భారం పెంచుకుంటావు  బంధువెవడో ఇల్లు కొన్నాడని అప్పు చేసి డబులో త్రిబులో బెడ్ ఫ్లాట్ ఒకటి కొనేస్తావు ఇ.ఎమ్.ఐ . కట్టడానికి ఇబ్బంది పడతావు  పక్కింటివాడి కొడుకేవడో పైదేశాలకెళ్ళాడని నీ తనయుడి శక్తేమిటో, ఆసక్తేమిటో తెలుసుకోకుండా అమీర్ పేటలో కోర్సొకటి చేయించి ఖాళీగా కూచున్నాడని తిడతావు ఇరుగూ పొరుగూ ముందూ వెనుకా వీళ్ళేనా నీ జీవితాన్ని నడిపించేది నీక

చిన్నారి లోకం ...

వంశీ కలుగోట్ల // చిన్నారి లోకం ... // ********************************* అమాయకమైన ఆ కళ్ళు  నిర్మలమైన ఆ చిరునవ్వు    ఆ చిన్నారి చెవులు  నీ ప్రతిమాటను వేదంలా స్వీకరిస్తాయి  తన కలల ప్రపంచంలో    ఆ చిన్నారికి    నువ్వే ఒక ఆదర్శం  నువ్వే సర్వస్వం  ఆ చిన్నారికి ...    నీ గురించి  అనుమానాలుండవు    అపోహలుండవు ప్రతిదీ నీలాగే చెయ్యాలని తపన  నీ మెప్పు పొందాలని చిన్న కోరిక  పగలు రాత్రి  ప్రతి నిమిషం    ఆ కళ్ళు నిన్ను వెంటాడుతుంటాయి    నీ ప్రతిచర్యను గమనిస్తుంటావు    గుర్తుంచుకో ...    నీలాగా ఎదగాలనుకునే    ఆ చిన్నారికి ... నువ్వొక ఆదర్శం  --- జాన్ లెన్నన్ 'లిటిల్ అయిస్ అపాన్ యు' ఆంగ్ల కవితకు నా తెలుగు స్వేచ్చానువాదం

నువ్వెక్కడున్నావు ...

వంశీ కలుగోట్ల// నువ్వెక్కడున్నావు ... //   ****************************** *********** నా జీవనదిలో నుండి  నా ఎడారిలో నుండి    నా గాలిలోనుండి    నేనెక్కడికి పోతాను?    నీదగ్గరకే వస్తానా ... నిజమేనా? అయితే మరి నువ్వెక్కడున్నావు  నాలోనే ఉన్నానంటావు    మరి నేను నీ దగ్గరకు  రావడమెలా అవుతుంది?   అయితే అంతా అబద్దమా    కాదంటావు ...  మరి నేనెక్కడకు పోతాను   నువ్వు చెప్పవు  నువ్వే నేనైతే ... నేనెందుకు నువ్వు కాదు  మరెందుకీ భేదాలు ...    నువ్వు, నేను ఒకటే అయినపుడు    నువ్వక్కడ (?) నేనిక్కడ ఎందుకు?   నేను భరించలేనా    నువ్వు భారం మొయ్యలేవా నువ్వెక్కడున్నావు?    చెప్పవు  చెట్టులోనా ... పుట్టలోనా  రాతిలోనా ... మట్టిలోనా  నీరు, గాలి, నిప్పు, ఆకాశం ...  ఏదీ నీ సర్వాంతర్యామిత్వం   నాకు కనిపించవేమి? ఓహో ...    భక్తితో నిన్ను ప్రార్థించాలా   నువ్వే దిక్కని ఏడవాలా ...  ఏం? ...  ఎందుకంత పొగరు  జపం చెయ్యమంటావు    తపమాచరించమంటావు    పాడమంటావు    ఆడమంటావు    చంపమంటావు    చావమంటావు    అసలు  ఏమి చెయ్యాలో నీకైనా త

వెలుతురు ...

వంశీ కలుగోట్ల// వెలుతురు ... // ****************************** **** ప్రతి ఉదయం వెలుతురు వస్తూనే ఉంది నిద్దుర లేపేటందుకో చీకట్లు పారదోలేందుకో తెలీదు కానీ వచ్చీ రాగానే వెన్నుతట్టి నిలబెట్టి నిన్నంతా నింపుకున్న కల్మషాలని వదిలించుకుని మళ్ళీ ఇవాళ కొత్తగా అమృతత్వం వైపు అలుపెరగని పయనం చెయ్యటానికి కొత్త శక్తినిస్తూ పురిగొల్పుతోంది ప్రతి ఉదయం వెలుతురు వస్తూనే ఉంది మూసుకుపోయిన కళ్ళను తెరిపించి నిజాన్ని చూపించాలని మేదావిత్వపు పొరలు కమ్ముకుపోయి నిజాన్ని గుర్తించలేని అజ్ఞానిగా మిగిలిపోతుంటే ఆ పొరలు చీల్చి నిజం వైపు దారి చూపటానికి కిరణాలను పంపుతూనే ఉంది  ప్రతి ఉదయం వెలుతురు వస్తూనే ఉంది గొర్రెల మందలో  ఒకడా మేధావిత్వపు ముసుగు కప్పుకున్న మామూలోడా ఇప్పటికైనా కళ్ళు విప్పి వెలుతురు చూడు కళ్ళు మూసుకుంటే వెలుతురు పారిపోదు నువ్వు చీకటిని చూస్తావంతే

రెండోవైపు ...

వంశీ కలుగోట్ల// రెండోవైపు ... // ********************************   రెండో వైపు చూస్తే నీ కళ్ళు ఏమీ పోవు భూమి బద్దలవ్వదు ప్రపంచం ఉన్నట్టుండి అంతమవదు  కులాన్ని మతాన్ని మరచి ప్రాంతాల హద్దులు పక్కనపెట్టి ఎవరో చెప్పినది మరెవరో వ్యాఖ్యానించినది మూలన పెట్టి ఒకవైపే చూపించే ఒక వాదమే వినిపించే గొంతుకలను వినవద్దు రెండో వైపు చూడు నువ్వు ఇన్నాళ్ళూ చూడని ఆ రెండో వైపు ఉన్నది బహుశా 'నిజం' కావొచ్చు

'విప్లవ జ్యోతి' శ్రీ చంద్రశేఖర్ ఆజాద్

'విప్లవ జ్యోతి' శ్రీ చంద్రశేఖర్ ఆజాద్  ****************************************** మేఘమాలల గూల్చేడి మేరుపువోలె  ॥అహా॥ మేఘమాలల గూల్చేడి మేరుపువోలె కటిక చీకటి చెండాడు కాంతివోలె  పరాయి పాలన గూల్చేడి స్వాతంత్య్ర ప్రభనుబోలి  భారతభూమిని తోచే ఆజాదు నడక  ॥తందాన తాన॥  . . . . . . . . .  ఆంగ్లేయ ముష్కరుల గుండెల నిదురించిన సింహమురా ఆతడు ॥సై॥ స్వాతంత్రమే తన పేరని చెప్పిన మొనగాడురా ఆతడు ॥సై॥  మీసం మెలేసి సవాలు చేసిన  భళిర భళిర భళి భళి భళి  మీసం మెలేసి అరెరె మీసం మెలేసి  సవాలు చేసిన 'ఆజాదు'రా ఆతడు  . . .  . . .  . . .  ధీరునివోలె ఎదురు నిలిచెరా ॥సై॥ ధైర్యంతో దెబ్బల స్వీకరించెరా ॥సై॥ 'భారత మాతా కీ జై' యను మంత్రపఠనమే  ఆతని బాధను హరియించేనురా  ॥ హరియించెనురా॥  ॥తన్దాన తాన॥  . . .  . . .  . . .  ఊరూ వాడ ఈ గాఢ వినిరి ॥తం॥  వినినంతనే అచ్చెరువొందిరి ॥తం॥  ధీరబాలుని అభినందించ నిశ్చయించిరి ॥తం॥ అరెరె భళిర భళిర భళి భళి భళి  వీరుడు వచ్చే ధీరుడు వచ్చే ॥ తం ॥ ఊరూ వాడా పిన్నా పెద్దా  ముసలీ ముతకా కాకీ మేకా  అంటా కదలి వచ్చెరా ॥

ఎవడు దేవుడు ఎవడు భక్తుడు ...

వంశీ కలుగోట్ల// ఎవడు దేవుడు ఎవడు భక్తుడు ...// ****************************** ***************** ధర్మాన్ని పాటించినవాడు ధర్మం పక్షాన నిలబడ్డవాడు  మానవత్వాన్ని నిలబెట్టినవాడు రక్తం చిందించి మంచిని గెలిపించినవాడు నిజాన్ని చెప్పినవాడు అందరూ దేవుళ్లయ్యారు ఒకనాడు దేవుడినే రక్షిస్తాననే వాడు  గోప్పోడవుతున్నాడు ఈ రోజు  సర్వహితం చెప్పే ధర్మాన్ని ఒకగాటన కట్టి  మతానికి ముడేసేవాడు  మానవత్వాన్ని మంటగలిపేవాడు  మహాత్ముడుగా కొనియాడబడుతున్నాడు  ఏ యజ్ఞంలో సమిధలుగా కాలిపోతున్నారో ఎవరెందుకు చంపుతున్నారో తెలీకుండానే హోటల్ లోనో, ధియేటర్ లోనో క్రీడా ప్రాంగణంలోనో, రోడ్డు మీదనో ఫ్రాన్స్, ఇరాక్, ఇరాన్ పాలస్తీనా, ఇజ్రాయెల్, సిరియా నేనున్నదో వేరే ఎవరో ఉన్నదో దేశం ఏదైతేనేం చిచ్చు ఒకటే మట్టిలో కలిసిపోతోంది మనుషులే ఆధిపత్యం కోసం జరుగుతున్న ఆటలో చెప్పుకోవడానికి వాదం ఏదైతేనేమి  ఉగ్రవాదం ఊపిరి తీస్తున్నపుడు దేవుడా రోజులు మారిపోయాయి నీ పేరు చెప్పుకుంటున్న భక్తులను చూసి మురిసిపోయి దిగి రావాలనుకుంటే నీదే మతమో తెలుసుకుని రా అది నీ భక్తులకు సమ్మతమో కాదో తెలు

మనిషివే కదా స్పందించు ...

వంశీ కలుగోట్ల// మనిషివే కదా స్పందించు ...// ****************************** ********* నువ్వెళుతున్నప్పుడు రోడ్డు మీద మొరిగిన కుక్క  ఎన్నికలప్పుడు గోడ మీద ప్రచారపు రాతలు  ఉదయం నుంచీ బస్టాండులో ఎదురుచూసినా  సాయంకాలానికి కానీ రాని 'పల్లె వెలుగు' బస్సు  ఎన్ని వందల అడుగులు బోరు తవ్వినాపడని నీరు  ఎంతమందికి ఇచ్చినా తిరిగి రాని ప్రేమ  ఏదిరా నిన్ను ప్రభావితం చెయ్యటానికి నువ్వు కలం పట్టి కదనం చెయ్యటానికి అనర్హం  కష్టాలెన్నొచ్చినా ఎప్పటికీ రాని దేవుడు దేవుడి పేరు చెప్పి మనిషిని చంపే మృగాలు  బాధ్యతలు మరిచి హక్కుల కోసం పోరాడే పౌరుడు  ప్రతి వారాంతంలో బీరు తాగుతూ  దేశం భవిష్యత్తు గురించి బాధపడేవాడు  దూలానికి వేలాడుతున్న రైతు శవం  యాసిడ్ కాల్చిన మొహంతో అమ్మాయి  ఎవరైతేనేం నీ కలంనుంచి సిరాచుక్కగా రాలటానికి నిన్ను కదిలించటానికి మహా ప్రస్థానం కావాలా  మనిషివే కదా మరో మనిషి బాధ సరిపోదా

నా మౌనమా ...

వంశీ కలుగోట్ల// నా మౌనమా ... // ************************************* నీకు లేఖ రాద్దామని కూచున్నా  కానీ అక్షరాలూ జాలువారవేమీ కలం ముందుకు కదలదేమి  ఒక గొప్ప సందిగ్ధావస్థలో మునిగిపోయాను  ఏమని సంబోధిస్తూ ఉత్తరం ప్రారంభించను? ప్రియా అనా ప్రియతమా అనా  ఉహూ ఇవేమీ రుచించట్లేదు  నా భావాలకు ప్రతిరూపం నువ్వు నాలోని శూన్యాన్ని పూరించిన ప్రేమవు నువ్వు  కలం కాగితం తీసుకుని కూచున్నా  కానీ ఈ మౌనం నా మనసును కప్పేస్తోంది  నాలోని భావావేశాన్ని ఎగరేసుకుపోయింది  ఈ మౌనం నా మాటను మూగవోయింపజేసింది  ఇంకెలా ఇంకెన్నాళ్ళు భరించాలి ఈ భావావేశాలను  అక్షరం అక్షరం వెతుక్కుని  ఓర్పుతో కూచుని పేరుస్తూ  నా భావాలన్నిటినీ మూటగట్టి  ఈ ఉత్తరంలో ఒలకబోసుకుని  ఝేండాగా నీ ముందు ఎగరేస్తున్నా

నేను చెబితే నమ్ముతాడా ...

వంశీ కలుగోట్ల// నేను చెబితే నమ్ముతాడా ... // ****************************** **************** ఇవ్వాళ వాడిని ప్రశ్నిస్తున్నానని నేనేవరని అడుగుతున్నాడు  అయిదున్నర అడుగుల దేహాన్నని చెప్పనా  మూడున్నర అంగుళాల కలాన్నని చెప్పనా ఏదో ఒక ఇజం పేరు చెప్పుకుని  ఎవడో ఒకడి చంకనెక్కి తిరిగేది బహుశా వాడేమో  ఎవడికీ తలవంచని  సంకెళ్ళకు బెదరని అక్షరం లాంటోడిని నేను అహంకారంతో అంధత్వం కమ్మినవాడికి  కలంపోటుతో మేలుకోకపోతే  అసహనం ఉప్పెనలా కమ్మేస్తుందని  నేను చెబితే నమ్ముతాడా నెత్తికెక్కిన కళ్ళు నేలమీదికి దిగొచ్చేదాకా నమ్మి అందలమెక్కించిన ఓటే  వెన్నుపోటు పొడిస్తే కూలదోయగలదని నేను చెబితే నమ్ముతాడా వాడు  నరనరాన నిండిన వంచకత్వంపై  సామాన్యుడి ఓటు పోటు పడేదాకా

దోస్త్ మేరా దోస్త్ ...

వంశీ కలుగోట్ల// దోస్త్ మేరా దోస్త్ ... // ****************************** ******** కప్పులకొద్దీ ఆలోచనలను కంచాలకొద్దీ తత్వాలను కాలం గంపలో ఒంపుకుంటూ  రోజుల్ని తిప్పేస్తున్నప్పుడు నువ్వెవరో నేనేవరో తాడూ బొంగరం లేని బేకారీలం  ఒకటా రెండా టన్నులకొద్దీ భావాలను తలగడలోకి ఇముడుస్తూ అనాధరాత్రులెన్ని అర్ధమనస్కంగా ముగించామో  సాగర్ గట్టునో మఠం అరుగునో ఎడతెగని వాదులాటలు సాగిస్తున్నపుడు సయోధ్య కుదిర్చిన సంధికాలం చీకట్లోకి పారిపోయిందని నిరాశలను మోసుకుంటూ పాదయాత్రలెన్ని చేసామో ఎవరికెరుక పేజీలకొద్దీ పుట్టుకొస్తున్న భావాలను అక్షరాలుగా చెక్కాలని ఒక్కొక్క క్షణాన్ని కాలానికి బలి ఇచ్చుకుంటూ పదాలతో కవాతు చెయ్యాలని ఎన్నిసార్లు సంకల్పించామో బ్రతుకు బాటలో మజిలీలు మారినా మన గమ్యం ఒక్కటే ... కాలమెన్ని కుట్రలు చేసినా తీసికెళ్ళి చెరో ధృవాన నిలబెట్టినా మనమతమేప్పుడూ ఒక్కటే (నా జీవితంలో మూడు దశలలో పరిచయమై ఇప్పటికీ నా ప్రతి అక్షరానికీ, అడుగుకీ అండగా నిలబడుతూ ప్రోత్సహిస్తున్న నా ముగ్గురు మిత్రులకు ఈ అక్షరాలు అంకితం)

అభ్యంతరం ...

వంశీ కలుగోట్ల// అభ్యంతరం ...// ********************************   కలలన్నీ కరిగిపోతుంటే స్వార్థం విశ్వరూపం ముందు సామ్రాజ్యం కూలిపోతుంటే ఘనతంతా గతమైపోతుంటే గద్గద స్వరంతో అపస్వరాల సమ్మిళితంగా పాడాలా "వందేమాతరం" అంటూ భవిత భయపెడుతూంటే భరతమాత అన్న భావననే కూల్చి పాతరేస్తున్న ఈ రాజకీయాలు అంతమొందిన నాడే చెప్పే శుభాకాంక్షలకు విలువ  అపుడు చెపుతాను శుభాకాంక్షలు అయినా నా అభ్యంతరం  నేను చెప్పే శుభాకాంక్షలు  ఎవడిక్కావాలి కాబట్టి

ఇజం ...

వంశీ కలుగోట్ల// ఇజం ... // *************************** ఏదో ఒక వాదం పేరు చెప్పి అదే ఒక నిజమైన ఇజం అని ఒప్పించి తమది కాని లక్ష్యం వైపు నడిపించి తుపాకీ అంచున జీవితాల్ని నిలబెట్టి ఒడ్డున నిలబడి వాదాల పునాదుల మీద పదాల గోడలతో ఇల్లు కట్టుకుని శవాల మీది గాయాల్ని చూపి రెచ్చగొడుతున్న మేధావులూ సాయుధ పోరాటం అంటే ప్రాణాలు కోల్పోవటమేననే సత్యాన్ని ఇంకా ఎప్పటివరకు దాస్తారు  తూటా లోంచి వచ్చే నిప్పు ప్రాణాలు తీసెదే కాని పొయ్యి వెలిగించేది కాదని ఇంకెప్పుడు చెపుతారు రాజ్య భావన, హింసా మార్గం ఒకే కత్తికి రెండంచులవంటివి మాత్రమే ఏ అంచున పయనం గాయం కాకుండా ఆపగలదు ఒప్పుకుంటాను గాయం కానిదే గేయం పుట్టదు రక్తం చిందనిదే విప్లవం పుట్టదు కానీ చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపటానికి దీపం వెలిగించాలి కానీ చీకట్లోకి వెళ్ళాల్సిన పనిలేదనే నిజం మాత్రం ఎప్పటికీ చీకటిలో ఉండిపోదు

నువ్వూ - నేను: మనం

వంశీ కలుగోట్ల// నువ్వూ - నేను: మనం // ****************************************** ఆదుకుంటుందని నమ్మిన హస్తం అణగదోక్కేస్తూ సర్వ భ్రష్టత్వం పట్టించినపుడు కలగని బాధ, లేవని గొంతుకలు ఒక వికసించిన కమలం తల్లోనో చెవిలోనో పెట్టుకోలేమని విప్లవిస్తున్నాయెందుకో  మేధావిత్వం అంటే మూలాలను వెతికి నిజాన్ని చెప్పటం అంతేకానీ ఏదో ఒక వాదపు తప్పెట మోతకు తందానా పలకటం కాదు  నువ్వూ నేనూ అంటూన్నంతకాలం వాదాల గోడలు విభేదాలు పుట్టిస్తూనే ఉంటాయి ఆ గోడలు పగలాలంటే 'మనం' అనగలిగే దమ్ము ఉండాలి

... మాటల్లేవ్

Image
వంశీ కలుగోట్ల // ... మాటల్లేవ్ // *************************** ** రాసిందంతా చూసుకుంటే మాటలే కదా అనిపిస్తోంది  నాదంతా కవిత్వమేనా? ఏమో జనాలు లైకులు కొట్టినప్పుడు కామెంట్లేసుకున్నపుడు అవునననిపిస్తుంది ఊరికే వదిలేసినపుడు కాదేమోనని బాధేస్తుంది సంశయంలో కొట్టుమిట్టాడుతుండగా ఒకరోజు కల్లో తెనాలి రామలింగడు లాంటి పెద్దాయన కనిపించి కవితోపదేశం చేసాడు "ఈ మధ్యన తెలుగు సినిమాలు చూడట్లేదా వారసులకు ఏమీ రాకపోయినా వాళ్ళను జనాల మీదకి వదిలేసి వాళ్ళే గొప్ప నటులని ఒప్పుకునేదాకా వదలట్లేదు కదా అలాంటప్పుడు అంతో ఇంతో సరుకున్న నీకేమైందిరా అలా రాస్తూ రాస్తూ ఉండు ఏదో ఒకరోజు జనాలు ఒప్పుకోక చస్తారా చెప్పు నువ్వూ గొప్పోడివేనని." ఇక మాటల్లేవ్ మాట్లాడుకోవటాల్లేవ్ అంతా కవిత్వమే ...

నేను - నీ ఏకాంతం ...

వంశీ కలుగోట్ల// నేను - నీ ఏకాంతం ... // ************************************ ఒక్కసారి నీ ఇంటికొచ్చానా అంతే ... ఇక ప్రపంచం మొత్తం తలుపు ఆవలే నిలబడిపోతుంది  నన్ను నీ ఏకాంతంలోకి విసిరేసి  నీ సన్నిధిలో గడిపే సమయంతోనైనా కాసింత ప్రేమ ఒలకబోస్తానేమోనని తలుపు బయటే ఎదురు చూస్తోంది ఆశగా  నా పక్కన నిలబడి ఒకే ఊపిరి పీల్చుకునేంత దగ్గరగా నువ్వుండి నువ్వే నేనైపోతుంటే రాయటానికి సమయమెక్కడిది అనాధప్రపంన్ని పట్టించుకునే తీరికెక్కడిది నీ ఏకాంతంలోంచి నన్ను ఎప్పుడు పంపుతావో తెలీదు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం వెళ్తూ వెళ్తూ వెలుతురు కిరణాలను మూటగట్టుకెళ్ళే సాయంత్రంలా కొంత ప్రేమను జ్ఞాపకాలుగా మోసుకెళతా అక్షరాలుగా ఒలకబోసుకోవటానికి

ఉదయాన్ని చూడాలని ...

వంశీ కలుగోట్ల// ఉదయాన్ని చూడాలని ... // ****************************** ************ 1 ఈ ఇరుకు గదిలో ఉత్తరం గోడకు నేను దక్షిణం గోడకు నీవు ముఖాలు వేలాడేసుకుని కూర్చున్నాం తూరుపు దిక్కున వెలుగొస్తుందనే నమ్మకంతో ఎడతెరిపిలేని మౌనం తుఫానులా ముంచెత్తుతోంటే పేరుకున్న అంతరాల పొరలు బెర్లిన్ గోడలా ఎపుడు పగులుతాయా అని ఎదురుచూస్తూ కూచున్నాం చట్రాల మధ్య ఇరుక్కుపోయిన భావాలతో మాటలు వెతుక్కుంటూ 2 ఉదయాన్ని చూడాలని ఉబలాటపడుతున్నాడు వాడు తుపాకి అంచున జీవితాన్ని గడుపుతూ చీకటిని చీల్చాలని అలుపెరగని పోరాటం చేస్తున్నవాడు 3 ఏ దేవుడైనా పూజలు, ప్రార్థనాలయాలు కావాలంటే ఆ దేవుడు తన మనిషికి డబ్బొచ్చేలా చెయ్యాలి 4 ఉరకలెత్తే నదికి అడ్డుకట్ట వేసి విద్యుత్తును పుట్టించే నైపుణ్యం ఉన్నవాళ్ళే తప్ప కంపుగొడుతున్న బురదగుంటను బాగుపరచటానికి మహాత్ములెవరూ కదలట్లేదు 5 నువ్వు నడిచొచ్చిన బాట వెంట నా రక్తపు మరకలు కనబడలేదా కలిసి నడుద్దామంటే ఇప్పుడు కత్తులు దింపుతున్నావు

ఆనందిస్తూ జీవిద్దాం ...

వంశీ కలుగోట్ల// ఆనందిస్తూ జీవిద్దాం ... // ****************************** ********* ఏదైనా ఆనందించాలంటే అమాయకత్వం ఉండాలి అని చెబితే నమ్మకపోగా నవ్వుకున్నాను కాకరపువ్వొత్తులు కాలుస్తున్నప్పుడు చిన్నారి  కళ్ళల్లో కనబడే ఆనందం వెనుక శివకాశిలో కాలిపోతున్న బతుకుల గురించి తెలిసి ఆ ఆనందం ఆవిరయ్యింది  ఇప్పుడు అమాయకుడిగా మారలేను, ఉండలేను అలాగని ఈ చిన్నారి ఆనందాన్ని ఆపలేను ఎగిరిపడే నిప్పురవ్వలు ఈ చిన్నారి జీవితాన్ని చిందర వందర చేస్తాయోననే భయం ఆనందానికి నాకూ మధ్య దూరాన్ని మరింత పెం చింది  జాగ్రత్తగా ఉండటానికి జరిగిపోయాక చింతించటానికి మధ్య తేడా ఒక జీవితం అని కాలిన గాయాలతో చిన్నారి పోరాటం చూసినప్పుడు తెలిసింది  ఆనందానికి ఆపదకు మధ్య తేడా అక్షరాలు మాత్రమే కాదని ఆలోచనా విధానంలో కూడానని ప్రమాదం జరిగిన ప్రతిసారి తెలుస్తూనే ఉంది మాటకూ చేతకూ మధ్య తేడా చెరిపేసి అటు బాల్యాన్ని, జీవితాలను ఇటు నిలబెట్టే చేతలు చేపట్టాలి  మనకు జీవితాలు కావాలు ఆనందం కావాలి ఆనందిస్తూ జీవించటం కావాలి

దీపావళి పండగ రావాలి ...

వంశీ కలుగోట్ల// దీపావళి పండగ రావాలి ...// ************************************ ఒరేయ్ మగాడా నీకేది అడ్డు నీకెవరు ఎదురు కదులుతున్న బస్సైనా కదలని పొదలైనా కళ్ళు మూసుకుపోయిన కోరికకు ఏదైనా, ఎవరైనా ఒకటే భరోసాతో నీ వెనుక నడిచేది అమ్మాయైతేనేం పసిపాప అయితేనేం చివరకి అమ్మ అయితేనేం కోరల్లేని పాముల్లాగా కొత్తవైతేనేం పాతవైతేనేం చట్టాలు ఏమి చెయ్యగలవు మగతనమంటే భరోసానివ్వటం అని మరచిపోయి మృగాలైన మగ నరకాసులందరికీ నరక చతుర్దశి లాంటి రోజొకటి రావాలి అణిగిపోతున్న ఆడతనం అపరశక్తి అవతారమెత్తే రోజు కావాలి మిగిలిన అందరూ దీపావళి పండగ జరుపుకోవటానికి

కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు ...

వంశీ కలుగోట్ల// కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు ... // ********************************************************* 1 నిజం కాలుస్తుందో లేదో కానీ నిప్పు మాత్రం కాల్చి తీరతాది భయ్యా  కావాలంటే తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన పోరాటంలో కాలిన బతుకుల అసలు లెక్క తీసి చూడు నిప్పు ఎన్ని జీవితాలను బుగ్గి చేసిందో తెలుస్తుంది  ఇప్పుడు ఇంకో తెలుగు రాష్ట్రంలో హోదా కోసం, సాయం కోసం నిప్పంటించుకుంటోన్న నిరాశావాదుల లెక్క చూడు జీవితాలనే కాదు భయ్యా  ఈ నిప్పు పంటలనీ కాల్చెస్తది కావాలంటే మొన్నీ మధ్య అమరావతి ప్రాంతంలో భూములివ్వని రైతుల పొలాల్లో  కాలిపోయిన పంటనడుగు చెబుతాయి నిప్పుకు నిజంలానే పక్షపాతం లేదు అయినా నిప్పుదేముంది పాపం అంటిస్తే అల్లుకుపోతాది కానీ ఒక్కటి మాత్రం నిజం భయ్యా నిజం కాలుస్తాది అని అబద్ధం చెపుతున్నోడు మాత్రం  ఎప్పటికీ ఉంటాడు 2 ఉసురు పోసుకున్నోడు ఉంటాడో పోతాడో  తెలీదు కాని ఉరితాడు మాత్రం ప్రాణాలు తీస్తది భయ్యా   కావాలంటే కన్నీటితో పొలాన్ని తడపలేక ఉరితాడుకు వేలాడుతున్న  రైతన్నను అడిగి చూడు రైతు ఉసురు పోసుకున్న రాజకీయ నాయకుడు దర్జాగా దర్బారుల

అధినాయకుడి అంతరంగం

అధినాయకుడి అంతరంగం ************************** అద్భుతాల కోసం త్యాగం చెయ్యమని అభివృద్ది పిలుస్తోంది రా ... కదలి రా ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన నిలబడేలా చెయ్యాలని ప్రయత్నం నేను చేస్తుంటే ఆమడదూరంలోనే ఆపాలని చూస్తావేంటి నేను చెప్పే ఆ భవిష్యత్తులో ... పూరి గుడిసెలో నువ్వు ఉండాల్సి వస్తేనేమి ఎండ మీద పడనివ్వనంత ఎత్తులో అభివృద్ధికి తార్కారణంగా ఆకాశహర్మ్యాలు కనబడాలంటే నువ్వు వర్తమానాన్ని కోల్పోవాల్సిందే పంటపొలాలు నాశనమవుతున్నాయని ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతోందని గోల చేస్తావేంటి   ఆహార ధాన్యాలు అవసరమైతే ఇతరదేశాల నుండి దిగుమతి చేసుకోవచ్చు కానీ అభివృద్ధిని దిగుమతి చేసుకోగలమా అని ప్రశ్నిస్తావున్నాను భవిష్యత్తులో నువ్వు తినే ప్రతి మెతుకు ఆకాశమంటే ధరకు కొనవలసి వస్తేనేమి చెమట చిందించకుండా ఇంట్లో కూచుని తింటుంటే ఎంతటి ఎదుగుదలో ఎప్పుడైనా ఆలోచించావా అని అడుగుతా ఉన్నాను వ్యవసాయమే లేకుండా చేస్తే సాయమంటూ నువ్వు రోడ్డెక్కే అవసరమే ఉండదు కదా అప్పుడు అప్పు చెయ్యాల్సిన అవసరమే ఉండదు అప్పులు చెయ్యని బతుకు అడుక్కుతిన్నా కూడా ఎంత హాయిగా ఉంటుందో ఏనాడైనా ఆలోచించావా అని అడుగుత

తీరం నుంచి ఎడారి దాకా...

వంశీ కలుగోట్ల// తీరం నుంచి ఎడారి దాకా...// ******************************************** వాడెవడో వచ్చి నాలా నేను నటించటానికి డబ్బులిస్తానంటున్నాడు అయిదేళ్ళకోసారి ఓటేస్తే చాలంటున్నాడు *            *            * తీరంలో పాదముద్రలు ఇంకా ఉంటాయా అక్కడక్కడా మిగిలున్న మానవత్వపు జాడలా *            *            * తీరం నుంచి ఎడారి దాకా సాగిన పయనంలో ఎన్ని పాదముద్రలు కోల్పోయానో *            *            * కాలం ఎప్పటికప్పుడు తుడిపేస్తూనే ఉన్నా గాయాలు మాత్రం గతాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి *            *            * ఎవరూ లేని తీరంలో అయలాన్ లాంటి అలేదైనా వస్తుందేమోనని ఒంటరి దీపపు స్థంభంలా ఎదురు చూస్తూ నుంచున్నా *            *            * తీరం అయినా ఎడారి అయినా ఇసుకే కదా నీ మతమైనా నా మతమైనా మానవత్వమే కదా