ఎదిగిన మనుషులు ...

వంశీ కలుగోట్ల// ఎదిగిన మనుషులు ... //
****************************************
ముల్లుగట్టె బట్టుకుని
ఎద్దు ముడ్డి ఎనకాల నడుసుడు
సెడ్డీల కాలం నుంచీ అలవాటే 
చిన్నప్పుడు బడికి పంపితే
సంతకాలు పెట్టేకాడికి సదువుకుని
పొలం పనుల్లో పడిపోయిన 

తోటి సదువుకున్నోల్లందరూ
పట్నంల, ఇదేసాల్లో ఉద్దోగాలు
సేసుకుంటా ఎదిగిపోయినారు 

మేం సిన్నప్పుడు సదివిన స్కూల్ల
సదువుకుని పైకొచ్చినోల్లందరూ
అదేదో రి యూనియన్ అని
మల్లోకసారి కలుద్దాం రమ్మన్నరు 

యాడనో ఉన్న సిన్ననాటి
దోస్తులందరు వస్తన్నరు గదా
కలుద్దమని ఆడికి బోయిన
పిలిసి కడవ సేతిల బెట్టి
నీళ్ళు తెమ్మన్నరు
కింద బెట్టిన చాయ్ గిలాసులు
తియ్యమన్నరు 

పని సేప్పెటోల్లె తప్ప
పలకరించేటోడు కనబడలేదు

పని మానుకొనుడెందుకని
పొలంకు పోయిన ...
రోజూలెక్కనే ఏ కల్మసం లేకుండా
గాలికి తలకాయలూపుతూ
మొక్కలన్నీ నన్ను పలకరించినయ్ 

Comments

Popular posts from this blog

నివాళి

విద్యార్థిగానే బతికితీరాలి

గమనం ...