ఆనందిస్తూ జీవిద్దాం ...


వంశీ కలుగోట్ల// ఆనందిస్తూ జీవిద్దాం ... //
***************************************
ఏదైనా ఆనందించాలంటే
అమాయకత్వం ఉండాలి అని చెబితే
నమ్మకపోగా నవ్వుకున్నాను

కాకరపువ్వొత్తులు కాలుస్తున్నప్పుడు
చిన్నారి  కళ్ళల్లో కనబడే ఆనందం వెనుక
శివకాశిలో కాలిపోతున్న బతుకుల గురించి తెలిసి ఆ ఆనందం ఆవిరయ్యింది 

ఇప్పుడు అమాయకుడిగా మారలేను, ఉండలేను
అలాగని ఈ చిన్నారి ఆనందాన్ని ఆపలేను

ఎగిరిపడే నిప్పురవ్వలు
ఈ చిన్నారి జీవితాన్ని చిందర వందర చేస్తాయోననే భయం
ఆనందానికి నాకూ మధ్య
దూరాన్ని మరింత పెంచింది 

జాగ్రత్తగా ఉండటానికి
జరిగిపోయాక చింతించటానికి మధ్య తేడా
ఒక జీవితం అని
కాలిన గాయాలతో చిన్నారి పోరాటం
చూసినప్పుడు తెలిసింది 

ఆనందానికి ఆపదకు మధ్య తేడా
అక్షరాలు మాత్రమే కాదని
ఆలోచనా విధానంలో కూడానని
ప్రమాదం జరిగిన ప్రతిసారి తెలుస్తూనే ఉంది
మాటకూ చేతకూ మధ్య తేడా చెరిపేసి
అటు బాల్యాన్ని, జీవితాలను
ఇటు నిలబెట్టే చేతలు చేపట్టాలి 

మనకు
జీవితాలు కావాలు
ఆనందం కావాలి
ఆనందిస్తూ జీవించటం కావాలి

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...