అధినాయకుడి అంతరంగం

అధినాయకుడి అంతరంగం
**************************
అద్భుతాల కోసం త్యాగం చెయ్యమని
అభివృద్ది పిలుస్తోంది రా ... కదలి రా
ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన
నిలబడేలా చెయ్యాలని ప్రయత్నం నేను చేస్తుంటే
ఆమడదూరంలోనే ఆపాలని చూస్తావేంటి

నేను చెప్పే ఆ భవిష్యత్తులో ...
పూరి గుడిసెలో నువ్వు ఉండాల్సి వస్తేనేమి
ఎండ మీద పడనివ్వనంత ఎత్తులో
అభివృద్ధికి తార్కారణంగా ఆకాశహర్మ్యాలు కనబడాలంటే
నువ్వు వర్తమానాన్ని కోల్పోవాల్సిందే

పంటపొలాలు నాశనమవుతున్నాయని
ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతోందని గోల చేస్తావేంటి  
ఆహార ధాన్యాలు అవసరమైతే
ఇతరదేశాల నుండి దిగుమతి చేసుకోవచ్చు
కానీ అభివృద్ధిని దిగుమతి చేసుకోగలమా అని ప్రశ్నిస్తావున్నాను

భవిష్యత్తులో నువ్వు తినే ప్రతి మెతుకు
ఆకాశమంటే ధరకు కొనవలసి వస్తేనేమి
చెమట చిందించకుండా ఇంట్లో కూచుని తింటుంటే
ఎంతటి ఎదుగుదలో ఎప్పుడైనా ఆలోచించావా
అని అడుగుతా ఉన్నాను

వ్యవసాయమే లేకుండా చేస్తే
సాయమంటూ నువ్వు రోడ్డెక్కే అవసరమే ఉండదు కదా
అప్పుడు అప్పు చెయ్యాల్సిన అవసరమే ఉండదు
అప్పులు చెయ్యని బతుకు
అడుక్కుతిన్నా కూడా ఎంత హాయిగా ఉంటుందో
ఏనాడైనా ఆలోచించావా అని అడుగుతా ఉన్నా
ను

ఊరోదులుతావో ఉరేసుకుంటావో నీ ఇష్టం
నీకు అమరత్వం సిద్ధించేదాకా
నేను నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను 

నేనేమి చెబుతున్నానంటే
నువ్వెప్పుడూ ఇలా
పొలాల గురించీ, వ్యవసాయం గురించీ మాట్లాడుతూ
కూపస్థమండూకంలా ఉండిపోతే
అభివృద్ధినిని అందుకోలేవు
అమరత్వానికి ఆమడదూరంలోనే ఆగిపోతావు 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...