దోస్త్ మేరా దోస్త్ ...

వంశీ కలుగోట్ల// దోస్త్ మేరా దోస్త్ ... //
**************************************
కప్పులకొద్దీ ఆలోచనలను
కంచాలకొద్దీ తత్వాలను
కాలం గంపలో ఒంపుకుంటూ 
రోజుల్ని తిప్పేస్తున్నప్పుడు
నువ్వెవరో నేనేవరో
తాడూ బొంగరం లేని బేకారీలం 

ఒకటా రెండా
టన్నులకొద్దీ భావాలను తలగడలోకి ఇముడుస్తూ
అనాధరాత్రులెన్ని
అర్ధమనస్కంగా ముగించామో 

సాగర్ గట్టునో మఠం అరుగునో
ఎడతెగని వాదులాటలు సాగిస్తున్నపుడు
సయోధ్య కుదిర్చిన సంధికాలం చీకట్లోకి పారిపోయిందని
నిరాశలను మోసుకుంటూ
పాదయాత్రలెన్ని చేసామో ఎవరికెరుక


పేజీలకొద్దీ పుట్టుకొస్తున్న భావాలను
అక్షరాలుగా చెక్కాలని
ఒక్కొక్క క్షణాన్ని కాలానికి బలి ఇచ్చుకుంటూ
పదాలతో కవాతు చెయ్యాలని
ఎన్నిసార్లు సంకల్పించామో

బ్రతుకు బాటలో మజిలీలు మారినా
మన గమ్యం ఒక్కటే ...
కాలమెన్ని కుట్రలు చేసినా
తీసికెళ్ళి చెరో ధృవాన నిలబెట్టినా
మనమతమేప్పుడూ ఒక్కటే

(నా జీవితంలో మూడు దశలలో పరిచయమై ఇప్పటికీ నా ప్రతి అక్షరానికీ, అడుగుకీ అండగా నిలబడుతూ ప్రోత్సహిస్తున్న నా ముగ్గురు మిత్రులకు ఈ అక్షరాలు అంకితం)

Comments

Post a Comment

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...