... దాటొచ్చి చూడు

వంశీ కలుగోట్ల//... దాటొచ్చి చూడు //
************************************
ఉడుకురక్తం ఉరకలెత్తి, ఆవేశం పొంగిపొర్లి
అన్యాయాన్ని ఎదిరించటానికి పోరుబాట పట్టి
పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినప్పుడు
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే
కనిపించేదంతా 'నీ' వారి బాధలే 

కనీసం అప్పుడైనా గుర్తుకువస్తుందా
నిన్ను అడ్డగించిన కుటుంబసభ్యులది మూర్ఖత్వం కాదు
నీ మీద ఉన్న ప్రేమ, అభిమానం అని
నీకోసం జాలువారిన రెండు కన్నీటిచుక్కలు
బలహీనతకు తార్కాణం కాదు
నువ్వే తమ బలమనుకున్నవారి బాధ అని
నోట మాటరాక మూగబోయిన మనిషి
దిక్కులేని, బతకలేని వ్యక్తి కాదు
నీతోనే బతుకని వచ్చిన మనిషి అని 

నిక్కమైన నిజాలు తెలుసుకునేసరికి
నిప్పుల వ్యూహం మధ్యలో ఉంటావు
నీకోసం నిరీక్షించిన బతుకులు
నిరాశతో కూలిపోయాయని తెలుసుకున్నప్పుడు
'త్యాగం అంటే నీది కాదురా
నీకోసం కరిగిపోయిన మాది' అని
ఘోషిస్తున్న ఆ ఆత్మల గోడు వినగలవా

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల్లా
కొన్ని బతుకులు అంతే, అలా ముగిసిపోతుంటాయి
స్థూపాలపై నీ పేరు చూసుకోలేక
అమరత్వాన్ని ఆపాదించి సంతోషపడలేక
ఎప్పటికీ ఘోషిస్తూనే ఉంటాయి 

వీలుంటే ఒకసారి అడవి దాటొచ్చి
నీవారి ఘోషను వినటానికి ప్రయత్నించు
ఆ జీవితాలు ఆరిపోకముందే

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...