చరిత్ర ఆ విధంగా రాయబడింది ...

వంశీ కలుగోట్ల // చరిత్ర ఆ విధంగా రాయబడింది ... //
***************************************************
'రక్తం చిందించకుండా
రాజ్యం సాధిస్తాను' అన్నాడు వాడు
గౌతమ బుద్దుడు లాంటివాడు 
అనుకున్నారు అందరూ 

కుట్రపన్ని, వెన్నుపోటుతో
ఒక్క రక్తపు చుక్క చిందకుండా
వాడు రాజయ్యాడు 

వాడు మళ్ళీ అన్నాడు
ఈసారి గర్వంగా
'రక్తం చిందించకుండా రాజ్యం సాధించాను' అని 

ఎదురు తిరిగిన వాళ్ళు
ప్రశ్నించిన వాళ్ళు
తరువాత మళ్ళీ ఎక్కడా కనబడలేదు
వాళ్ళ రక్తపు చుక్కలు చిందాయో లేదో 
ఎవరికీ తెలియదు
చరిత్రలో ఆ విషయం రాయబడలేదు

రాజ్యాన్ని రక్షించటానికి
ప్రజలను పాలించటానికి
తన జీవితాన్ని అతడు త్యాగం చేశాడు
అని వాడి జనాలు అన్నారు 

చరిత్ర
ఆ విధంగా రాయబడ్డది
భవిష్యత్తరాలు
వాడి చరిత్రను
స్ఫూర్తిగా చదువుకున్నాయి

Comments

Popular posts from this blog

నివాళి

విద్యార్థిగానే బతికితీరాలి

గమనం ...