పిపీలికాలు ...
వంశీ కలుగోట్ల// పిపీలికాలు ... //
*************************************
1
బహుశా ఇంతేనేమో
మనిషంటే ఒక పిపీలికమేనేమో
'ఎవరికీ పనికిరాని పిడికెడు ధూళిని'
అన్న గాలిబ్ మాటకి అర్థమేనేమో
2
ఏదో ఒకరోజుకి
గాలిలో కలిసిపోయే బూడిద కాకుండా
జనాల్లో మిగిలిపోయే స్ఫూర్తిగా
మిగిలిపోయిన మహానుభావులలాగా
మనిషిగా కనీస బాధ్యతలు
నెరవేర్చాలని అనుకునేదెందరు
3
చిన్న చిన్న కోపాలకు
పనికిరాని పంతాలకు
అక్కరకు రాని అంతరాలకు
జీవితాలని అంతం చేసుకుంటూ
పిపీలికమై ఎగిరిపోతున్న
చేతకాని కాగితం పులులకు
కొవ్వొత్తుల వెలుగుల్లో వందనం
ఆవేశాన్ని అణచుకోలేక
ఓటమికి కారణం తెలుసుకొని
దారి మలచుకోలేక
ఎప్పుడో ఒకప్పుడు తప్పని మరణాన్ని
బలవంతంగా కౌగలించుకున్న
ధైర్యం ఉన్న పిరికివాళ్ళు
నడిపించే నాయకులు
వెలుతురు పంచే దివిటీలు
ఎలా అవుతారో అర్థం కావట్లేదు
Comments
Post a Comment