... లెక్కల్లో తేడా
వంశీ కలుగోట్ల // ... లెక్కల్లో తేడా //
****************************************
ఈ దేశంలో ...
జీవన విధానాలు క్షీణిస్తూనే ఉన్నాయి
ఇక్కడ పుట్టిన విధానాలు విమర్శలకు
గురవుతూనే ఉన్నాయి
పరాయి గడ్డపై పుట్టిన మతాలు
సంఖ్యాపరంగా విస్తరిస్తూనే ఉన్నాయి
జనాల నమ్మకాలతో
డబ్బు చేసుకోవడానికి
దైవ దూతల రూపంలో వ్యాపారులు
పుట్టుకొస్తూనే ఉన్నారు
ఈ దేశంలో ...
పాలకులు తిరగటానికి
ప్రత్యేకవిమానాలకు డబ్బులుంటాయి
కానీ, పాయిఖానాల నిర్మాణానికి
పాఠశాలల నిర్మాణానికి డబ్బుండదు
కావాలంటే
ఈ దేశంలో ఎవడినైనా పిలిచి
ప్రశ్నించి చూడు
'ఆలయం కానీ, చర్చి కానీ, మసీదు కానీ
లేని ప్రాంతాలెన్ని ఉన్నాయి?' అని
మళ్లీ మరోసారి అడిగి చూడు
'పాఠశాలు, పాయిఖానాలు లేని ప్రాంతాలెన్నని'
లెక్కల్లో ఎంత తేడా ఉందో తెలుస్తుంది
Comments
Post a Comment