నీవెవరని?

వంశీ కలుగోట్ల// నీవెవరని? //
****************************
నీ మరణం 
వంద కాగడాలు వెలిగిస్తుందట 
నువ్వేమన్నా చమురువా 

నీ మరణం 
వంద ప్రశ్నలను రేకెత్తిస్తుందట 
నువ్వేమన్నా ప్రశ్నల పొత్తానివా 
 
నిష్క్రమించిన తరువాత 
నువ్వు అన్నీ అవుతావు 
బతికున్నప్పుడే 
ఎవరికీ ఏమీ కావు 
 
ఒకవైపున 
అణగదొక్కాలని ప్రయత్నించేవాడు 
మరోవైపున 
అండగా నిలబడలేని వాడు 
మరింకోవైపున 
వాడుకోవాలని చూసేవాడు 
వీరందరి మధ్యన ఉండి 
బతికినా చచ్చినా 
అమ్మకపు వస్తువేనని అర్థమయ్యి 
నిష్క్రమించావా 

ఉన్నప్పుడు ఏమి సాధించావో 
నీకైనా తెలుసునో లేదో కానీ 
నీ మరణం మాత్రం 
చాలామంది నిరుద్యోగులకు 
పని కల్పించింది 
నీరసించిన శ్రేణులకు 
ఊపునిచ్చింది 

పోరాడితే పోయేదేమీ లేదు 
బానిస సంకెళ్ళు తప్ప 
అని నినదించిన గొంతు 
అలసిపోయి 
ఎందుకు ఉరితాడుకు వేలాడిందని 
ఎంతమంది ఆలోచించారు 

వీళ్ళందరూ ఇంతే 
నీ మరణం గురించి తప్ప 
బతుకు గురించి 
ఆలోచించని మహానుభావులు 

నీ/మీ లాంటోళ్ళ చావులు 
కొందరికి పండగ 
దండగమారి చావుల మధ్య 
ఉలిక్కిపడేలా చేసిన 
నీ చావులాంటి చావులు
పుట్టిన ఎంతమంది చస్తారు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...