... బ్రతకాలి

వంశీ కలుగోట్ల // ... బ్రతకాలి //
******************************
1

 పోరాటం చేతకాకో ...
అవమానాలను, అసమానతలను
వివక్షను తట్టుకోలేని అసహనంతోనో
ఇంతకుముందరి వాళ్ళలా
స్ఫూర్తి జ్యోతి అవుదామనే కోరికతోనో
తమ్ముడూ నువ్వు నిష్క్రమించావా ... 

నీ చావు కొందరికి అవకాశం కల్పించింది
రాజకీయనిరుద్యోగులకు ఊతమిచ్చింది  

నీ నెత్తుటి మరకలు పులుముకున్న
కాగితాలపై రాసిన కవితలూ, నినాదాలూ
జెండాలై ఎగురుతూనే ఉంటాయి
నీలాంటి మరొకడు నిష్క్రమించేవరకూ 

2
కిరణమై వెలుగును చిమ్మి
ఉత్తేజాన్ని ఇవ్వవచ్చునేమో
కానీ, నీ మరణం బాధిస్తుంది 

అన్యాయాన్ని ఎత్తి చూపుతుందేమో
కానీ, అశృవులను రాల్పిస్తుంది
అయినవాళ్లను ఒంటరిని చేస్తుంది 

ఉద్యమానికి ఊపిరి పోయవచ్చు
సంచలనాలు సృష్టించవచ్చు
కానీ, తమ్ముడూ నీ మరణం
కుటుంబలో వెలితిని సృష్టిస్తుంది 

నువ్వు బ్రతకాలి, పోరాడాలి
నీ మరణం కాదు
నీ పోరాటం స్ఫూర్తినివ్వాలి

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...