... వార్తలు/వాస్తవాలు

వంశీ కలుగోట్ల // ... వార్తలు/వాస్తవాలు //
***************************************
ఒక భారీ వర్షం 
నగరాన్ని పలకరించిన వేళ 
మురుగునీటి ఉధృతికి 
మాన్ హోల్ మూత తెరుచుకుంది 
అవసరమైనదేదో కొందామని 
ఇంటినుండి బయటకొచ్చిన సామాన్యుడు 
దానికి బలయ్యాడు

ఒక కుటుంబం బాధ పడింది 
మరుసటి రోజున పత్రికల్లో అదొక వార్తగా వచ్చింది
*                 *                 *
బాధ్యతలు తరుముతుంటే 
బతుకు పోరాటంలో భాగంగా 
రోజూలానే వాడు బైక్ మీద 
ఆఫీసుకి బయల్దేరాడు
తాగుడు హైజాక్ చేసిన మనిషొకడు 
డ్రైవర్ గా నడుపుతున్న లారీ ఒకటి 
వెనకనుండి వాడిని గుద్దింది 
తప్పిచుకునే అవకాశమూ లేదు 
వాడి జీవితం అక్కడే ముగిసిపోయింది

ఒక కుటుంబం బాధ పడింది 
మరుసటి రోజున పత్రికల్లో అదొక వార్తగా వచ్చింది
*                 *                 *
రోజూలానే సాయంకాలం 
తన హాస్టల్ గదికి తిరిగొచ్చింది ఆ అమ్మాయి 
తెలియదు ఆ అమ్మాయికి 
కాలేజ్ లో తనను కోరిక తీర్చమని అడిగిన పశువుది  
పక్క గదిలో ఉండే సీనియర్ అమ్మాయిదీ 
ఒకటే కులమని, తనది వేరే కులమని 
తెలుసుకుని అర్ధమయ్యేసరికి 
ఉరితాడుకు ఆ జీవితం బలైపోయింది

ఒక కుటుంబం బాధ పడింది 
మరుసటి రోజున పత్రికల్లో అదొక వార్తగా వచ్చింది 
*                 *                 *
కష్టాలు చెప్పుకుందామని 
పరిష్కారం దొరుకుతుందేమోనని 
దేవదూతగా చెప్పుకునే వ్యక్తి దగ్గరకెళ్ళారు 
వాడు దేవదూత కాదు 
కామపిశాచి అని అర్ధమయ్యేసరికి 
జీవితం నాశనమయ్యింది

ఒక కుటుంబం బాధ పడింది 

మరుసటి రోజున పత్రికల్లో అదొక వార్తగా వచ్చింది
*                 *                 *
అవీ ... ఇవీ ... ఇలాంటివి ఎన్నో 
ప్రతిరోజూ కళ్ళముందు కదలాడి 
పత్రికల్లో వార్తలుగా మారే వాస్తవాలు ఎన్నో 
...
...
... 
కొన్ని వాస్తవాలు 
అలా వార్తలుగా వస్తూనే ఉంటాయి 
కొన్ని కుటుంబాలు బాధపడుతూనే ఉంటాయి 
మళ్లీ మరుసటి రోజు 
వార్తలుగా పత్రికల్లో వస్తూనే ఉంటాయి 


ఒకరి మరణానికి కారణం 
మరొకరి దాష్టీకం మాత్రమే కాదు 
ఇంకొకరి నిర్లక్ష్యం కూడా కావచ్ఛు 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...