... కావాలి
వంశీ కలుగోట్ల// ... కావాలి //
******************************
1
కులతత్వం తలకెక్కి
ఎందులోనో తెలియకపోయినా
సీనియర్ అనిపించుకునే
మగ ముసుగేసుకున్న మృగాలకి
రాగింగ్ అనే పేరు పెట్టుకుని
మానమో ప్రాణమో వదిలేసుకోవటానికి
ఒక అమ్మాయి కావాలి
2
గెలుపెలా వచ్చిందో తెలియకపోయినా
గెలిచి జనాల నెత్తిన కూచున్న
అధికారం ముసుగేసుకున్న క్రూరత్వపు
కోరలకి చిక్కి తన్నులు తినటానికి
బాధ్యత ఎరిగిన ఉద్యోగిగానో
నిరసన తెలుపటానికి వస్తే
ముళ్ళ లాఠీల దెబ్బలకు
బట్టలు చింపేసుకోవటానికో
కొంతమంది మహిళలు కావాలి
3
ఊరి మధ్యలోని పబ్బులోనో
ఊరవతలి ఫాం హౌస్ లోనో
తాగి తలకెక్కించుకున్న మద్యపు మత్తు
ఆడకుక్కైనా పర్వాలేదనే కోరికతో
మదమేక్కించి ఊపేస్తుంటే
నడిరోడ్డుపై చేయి లాగించుకోవటానికి
కొంతమంది ఆడవాళ్ళు కావాలి
4
పదో పాతికో లక్షలు
విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకోవడానికి ఉండి
గుడి అయితేనేం మరింకోటి అయితేనేం
అమ్మాయి అయితేనేం, అమ్మ అయితేనేం
నచ్చి సరే అంటే పొందు
నచ్చకపోతే వెంటాడి
వేటాడి చంపటానికి
కొంతమంది మహిళలు కావాలి
5
బడిలో
గుడిలో
కార్యాలయంలో
నడిరోడ్డులో
చివరకి ఇంట్లో
మగత్వానికి
బలి కావడం కోసమే
పుట్టారనుకున్నారా ఆడవాళ్ళు
తిరగబడితే పుట్టుక కూడా
పుట్టలేని బతుకు నీది
బతుకుచ్చినందుకు
కృతజ్ఞత చూపించక
బలిపీఠంపై ఉంచుతావా
Comments
Post a Comment