యుద్ధం ముగిసింది ...

వంశీ కలుగోట్ల// యుద్ధం ముగిసింది ... //
*************************************
అవును, వాడికిప్పుడు 
యుద్ధంతో అవసరం లేదు 
తన లక్ష్యం చేరాక 
తన పయనం ముగిసాక 
తన అవసరం తీరాక 
శాంతి మంత్రం పఠిస్తాడెవడైనా 

ఇప్పుడు వాడికి కావాల్సింది
యుద్ధం కాదు 
తను మొదలెట్టిన యుద్ధంలో 
మాడిపోయిన శలభాల గురించి 
బలైపోయిన సామాన్యుల గురించి 
వాడికి చింత లేదు 

యుద్ధపు విజయాన్ని
శాశ్వతంగా మలచుకోవటానికి
వారసత్వంగా అందించటానికి
తపన పడుతున్నాడు 

పోరాటం సాగినప్పుడు
నువ్వు వాడి పక్కన ఉండి ఉండవచ్చు
వాడి పక్షాన నిలిచి ఉండి ఉండవచ్చు
వాడికి మద్దతిచ్చిండవచ్చు
కానీ, నువ్వు గమనించలేదు
నువ్వు వాడితో ఉన్నావు
వాడికి ఉపయోగపడ్డావు అంతే 

యుద్ధం జరిగేటప్పుడు
వాడు అంటూనే ఉంటాడు
ఉమ్మడి లక్ష్యం
మనందరి గమ్యం అని
యుద్ధం ముగిసాక కానీ తెలీదు సేనకు
అది వాడి లక్ష్యం అని 

మహాసేనా, తెలుసుకో/గుర్తుంచుకో
యుద్ధపు విజయం ఎప్పుడూ నాయకుడిదే
సైన్యం వాడికోసం యుద్ధం చేస్తూనే ఉండాలి
లేదంటే మరో నాయకుడిని వెతుక్కోవాలి

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...