వాడు నిజం కాదని ఎవరు చెప్పాలి?

వంశీ కలుగోట్ల// వాడు నిజం కాదని ఎవరు చెప్పాలి? //
*****************************************************
వాడు మామూలోడు కాడు  
పేదలకు అండగా నిలుస్తాడు 
న్యాయాన్ని నిలబెడతాడు 
అన్యాయాన్ని పెకలించివేస్తాడు 
వందమందిని అయినా సరే 
తానొక్కడే ఒంటిచేత్తో ఎదుర్కొంటాడు 
పక్కోడి ప్రాణం కాపాడటానికి 
తన ప్రాణం అడ్దేయటానికి ముందుంటాడు 
షాట్ ఓకే కాగానే 
అందరూ చప్పట్లు కొట్టగానే 
విజయం కళ్ళముందు అప్పుడే కనబడుతుంది
వాడి పాత్ర అలాంటిది మరి
వాడి సినిమా సూపర్ హిట్టవుతుంది 
*                      *                      *
వాడు దేవుడిలాంటోడు 
వాడిని మించిన మంచోడు ఉండడు 
వాడకి సాటెవరూ లేరు 
వాడంటే ఒక సైన్యం 
మళ్ళీ పుట్టిన మహానుభావుడు వాడు 
వాడి చుట్టూ ఉన్న పాత్రలన్నీ 
అలానే చెబుతుంటాయి 
షాట్ ఓకే కాగానే 
అందరూ చప్పట్లు కొట్టగానే 
విజయం కళ్ళముందు అప్పుడే కనబడుతుంది
వాడి పాత్ర అలాంటిది మరి
వాడి సినిమా సూపర్ హిట్టవుతుంది 
*                      *                      *
ఏ చరిత్ర చూసినా 
ఇంతవరకూ నాయకులు 
పార్టీలలోంచి, కులాలలోంచి పుట్టి ఉంటారు 
వీడు మాత్రం జనంలోంచి పుట్టినవాడు 
జనంకోసం పుట్టినవాడు 
వీడు పుట్టడం జనం చేసుకున్న అదృష్టం 
ఒక పెద్దాయన 
వాడి గురించి చెపుతుంటాడు 
అంతవరకూ 
ఒక చెడ్డవాడి చేతిలో 
అష్టకష్టాలు పడుతున్న 
మామూలు ప్రజానీకం అంతా 
ఆ మాటలకు జయ జయధ్వానాలు చేస్తారు 
షాట్ ఓకే కాగానే 
అందరూ చప్పట్లు కొట్టగానే 
విజయం కళ్ళముందు అప్పుడే కనబడుతుంది
వాడి పాత్ర అలాంటిది మరి
వాడి సినిమా సూపర్ హిట్టవుతుంది 
*                      *                      *
వాడు మామూలోడు కాడు
ఒక మహానటుడు 
ఎటువంటి పాత్ర అయినా 
అత్యంత సమర్థవంతంగా పోషిస్తాడు 
వాడికి కావలసింది 
ఒక మంచి పాత్ర 
అంతకు మించి డబ్బు 
అది తెలియని ప్రజలు 
వాడిని నిజమనుకుంటే 
నిజం కాదని చెప్పటానికి 
వాడికి ఎవరైనా మరో పాత్ర అంటూ ఇస్తే 
పాత్రకు తగ్గ పారితోషికం ఇస్తే 
వాడేమన్నా పోషించనని అంటాడా

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...