ముఖం ...
వంశీ కలుగోట్ల// ముఖం ... //
********************************
అక్కడ ఒక ముఖం
గోడకు వేలాడుతూ ఉంది
అడుగు బయటకు పెట్టిన
మరుక్షణం నుండీ
ఒకచోట ఏకాగ్రత
ఒకచోట చిరునవ్వు
ఒకచోట చిరాకు
మరొకచోట ఉత్సాహం
ఇంకోచోట ఆవేశం
ఏదో ఒక ముసుగు
ముఖానికి తగిలించుకుని
ఊరేగుతూనే ఉన్నా
ఇంటిలోపలికి వచ్చాక
తెలియని నీరసం
బయట నటించిన అలసట
ఇంతేనా అని నిరుత్సాహం
ఇంకేదో కావాలనే ఆరాటం
అప్పుడే ముఖం
నిద్ర ముసుగేసుకుంటుంది
లోపలైనా బయటైనా
ఏదో ఒక ముసుగు లేందే
ముఖం... ముఖం చూపించట్లేదు
ఊసరవెల్లి రంగుల్లా
ముఖానికి ముసుగులు
మారుతూనే ఉన్నాయి
'తన'తనాన్ని గోడకు తగిలించి
ఇంట్లోని వారిని
బయటివారిని
వాళ్ళని, వీళ్ళనీ అందరినీ
మోసం చేస్తున్నానుకుంటూ
తనను తానే
మోసం చేసుకుంటూ
అక్కడ గోడకు వేలాడుతూ
అసలు ముఖం అలానే ఉంది
Comments
Post a Comment