విశ్వ మానవుడు ...
వంశీ కలుగోట్ల// విశ్వ మానవుడు ...//
*************************************
బతుకు కోసం
పోరాటం సాగించినన్నాళ్ళూ
అవును, వాడికి
ఒక ప్రాంతీయత ఉండేది
ఒక కులమూ, మతమూ ఉండేది
వాటిని వాడుకోవాలని
వాడుకుంటే ఎదగొచ్చని అనిపించేది
అవును, ఇప్పుడు
పోరాటం ముగియలేదు కానీ
ఆరాటం ఆగింది
ఆదరువు దొరికింది
పక్కనోడి గురించి కూడా
ఆలోచించే ఎదుగుదల వచ్చింది
ఎప్పుడో నేర్చుకున్న అక్షరం
బుద్ధిని వికసింపజేసింది
ఇంకా వాడికి
ప్రాంతీయతలూ
కులాలూ
మతాలూ
అవసరమా
అవును, వాడిప్పుడు
విశ్వమానవుడు
కానీ, అక్షరం సాయంతో
మార్పును తీసుకురావాలనే ధ్యేయంతో
ముందుకు సాగుతున్నానంటూ
స్వీయవంచన ఎందుకు
అక్షరానికి కూడా
ముసుగేసి సంపాదించుకోవచ్చు
అని అనుకున్నాడేమో
అక్షరాలలో
ఆదర్శాలన్నిటినీ ఒలకబోసుకుంటాడు
కానీ, ఆచరణలో
ప్రాంతానికి, వర్గానికి
పెద్దపీట వేస్తాడు
తనదీ ప్రాంతమని
తనదీ వర్గమని
గీసుకున్న గీతల్లోంచి
బయటకు రాలేక
అక్షరాల ముసుగులో
స్వీయవంచన చేసుకుంటూ
మేధావిగా మసలుకుంటూంటాడు
జిల్లాకొకటి
ప్రాంతానికొకటి
నీకెందుకురా సంఘాలు
నీ అక్షరాన్ని
జిల్లాకో
ప్రాంతానికో
పరిమితం చేస్తున్నావా
చెయ్యాలనుకుంటున్నావా
Comments
Post a Comment