నాస్టాల్జియా అనబడు జ్ఞాపకాలు ...
వంశీ కలుగోట్ల // నాస్టాల్జియా అనబడు జ్ఞాపకాలు ... //
*******************************************************
ఊరు దాటి వెళ్లాలంటే
సమయానికి అందగలిగితే ఆర్టీసీ బస్సు
లేదంటే ఎడ్ల బండి అంతే
అదీ కాదంటే పదకొండో నంబరు బస్సు (కాలినడక)
బస్టాండ్ దగ్గర ఒకవైపు ఒక కోనేరు
మరోవైపు ఒక పెద్ద వేపచెట్టు, దాని కింద అరుగు
అమ్మానాన్నలకు ఎలా ఉండేదో తెలీదు కానీ
బస్సు ఎంత ఆలస్యమయినా
మాకు విసుగుండేది కాదు
వనభోజనానికో లేక
విహారయాత్రకో వెళ్లినట్టుండేది
* * *
మా ఊరి నుండి కర్నూలుకి
వెళ్ళేటప్పుడు కానీ, వచ్ఛేప్పుడు కానీ
రోడ్డుకు ఇరువైపులా
రహదారి మీదకి వంగినట్టు ఉండే
చెట్లను చూస్తే భలే ఉండేది
నడి వేసవి కాలంలో కూడా
ఆ దారిలో పయనం బావుండేది
* * *
ఇప్పుడు ఆ బస్టాండ్ దగ్గరకు వెళితే
ఒక నిరాశవీచిక కమ్మేస్తుంది
అక్కడ కోనేరు లేదు
నిర్మానుష్యంగా నిర్జీవంగా
దూరంగా విసిరేసినట్టు అనిపిస్తుంది
అసలు అక్కడ ఉండాలనిపించట్లేదు
మా ఊరి నుండి కర్నూలుకు
ఇప్పుడు ఆ దారిలో వెళుతుంటే
మనసు అదో రకమైన దిగులుతో నిండిపోతుంది
ఎందుకంటే కనుచూపుమేరలో
అటూ ఇటూ ఎటువైపునా
ఎంతవెతికినా చెట్లు కానరావట్లేదు
చిన్నప్పుడు
నాకు ఒక కోరిక ఉండేది
బస్సు పైన కూచుని
ఆ దారిలో పయనించాలని
ఆ చెట్లను అలా చూస్తూ ప్రయాణం
ఊహల్లో అద్భుతంగా ఉండేది
కానీ, అది ఎప్పటికీ
ఊహల్లోనే ఉండిపోతుందని
అప్పుడు నేను అనుకోలేదు
కర్నూలు నుండి మా ఊరికి
ప్రయాణం చేసినప్పుడంతా
ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది
'ఎదగటం అంటే కోల్పోవటమేనా '
నాకిప్పటికీ అర్థం కావట్లేదు
Comments
Post a Comment