కమ్ ఆన్ బ్రో ...

వంశీ కలుగోట్ల// కమ్ ఆన్ బ్రో ... //
*******************************
అన్నయ్యా మన తెలుగోళ్ళు బాగా ఎదిగిపోయారు
నీకింకా అర్థం అయినట్టు లేదు
లేక అర్థం అయినా కానట్టున్నావో మరి 

చిన్నప్పుడు ఆటల్లోనో, పరుగుపందేల్లోనో
దెబ్బ తగిలితే 'అమ్మా/అబ్బా' అనే వాళ్ళందరూ
ఇప్పుడు దెబ్బ తగిలిన ప్రతిసారీ
'ఓహ్ మై గాడ్' అంటున్నారు కదా అన్నయ్యా 
చేతిలోని వస్తువేదైనా జారి పడిపోయినపుడు
'అరెరే' అనటం నీకు గుర్తుందో లేదో
ఇప్పుడు 'ఊప్స్' అనటం మాత్రం గమనించి ఉంటావులే 

అప్పుడెప్పుడో తెలుగు నవలల కోసం
వెర్రెత్తిపోయిన రోజుల జ్ఞాపకాల నుంచి బయటకి రా
ఇప్పుడు హారీ పోటర్ తరహా ఆంగ్ల పుస్తకాల కోసం
ఎగబడటం నువ్వు చూడలేకపోతున్నావా 

ఎన్టీవోడు, చిరంజీవి సినిమాలకి
మొదటి ఆట టికెట్ కోసం చొక్కాలు చించుకున్నోళ్ళు
ఇప్పుడు జేమ్స్ బాండ్ సినిమాల కోసం
జాగరణ చేస్తున్నారు తెలుసా భయ్యా 

నువ్వింకా 'ఏరా మామా/బావా బావున్నావా'
అనే పలకరింపుల స్నేహం
రోజుల్లో ఉన్నావేమో
ఇప్పుడు 'హే మాన్ హౌ అర్ యు'
అనే పిలుపులు నీ చెవులకు వినబడటం లేదా 

అన్నట్టు అసలు విషయం చెప్పటం మరచితిని
'అన్నయ్యా' అనటం కూడా మానేసి 
'బ్రో' గా పిలిచేంత ఎదిగి చాలా రోజులైంది గమనించలేదా
కమ్ ఆన్ బ్రో - వెన్ విల్ యు డెవలప్
అదే అన్నయ్యా - నువ్వెప్పుడు ఎదుగుతావని అడుగుతున్నా 

అయినా వీళ్ళకి అర్థమయ్యేట్టు ఎవడు చెపుతాడు
ఎదగటం, కొత్తని ఆహ్వానించటం అంటే
కోల్పోవటం, గతాన్ని పాతరెయ్యటం కాదని ...

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...