వలస ...

వంశీ కలుగోట్ల// వలస ... //
*****************************
బాగుండటం అంటే
వేసిన పంట బాగా పండి
చేతికి కాస్త డబ్బు వస్తే
అయినవాళ్ళతో కలిసి
పండగలు సంబరంగా జరుపుకోవడం
అనుకునేవాళ్ళం చిన్నప్పుడు 

ఏదో ఒక కంపెనీ నిర్మాణానికో
ప్రాజెక్ట్ ముంపు భూముల లెక్కలోనో
రింగు రోడ్డో లేక మరింకే పేరునో
ఉన్న పొలం ఎంతెక్కువకు పొతే
అంతకు లాగించేసి చేతికందిన దానితో
ఊరొదిలి ఊరేగడమే
బాగుండటమని ఇప్పుడనుకుంటున్నారు
పొలం పోయింది
పల్లె పోయింది
పల్లె బతుకు పోయింది 

వలసవెళ్ళిన పట్నంలో
కూలిబతుకులతో కుంగిపోయి
పాత బతుకులోని ఆనందం
మనసు పొరల అడుగున
ఎండిపోయిన నీటి ఊటలా అప్పుడప్పుడూ
తడిమి తడి చేస్తూంటే
పల్లెకు వెనక్కి వెళ్ళలేక
పట్నంలో ఇమడలేక 'పోతున్నారు'

చెబితే ఎవడు వింటాడు
'ఎదగటం అంటే కోల్పోవటం కాదని'

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...