దాటొచ్చిన దూరాలన్నీ ...

వంశీ కలుగోట్ల// దాటొచ్చిన దూరాలన్నీ ... //
******************************
**************
దాటొచ్చిన దూరాలన్నీ
పుస్తకాలై పలకరిస్తుంటాయి
అనుభవాలన్నీ సుడిగాలికి కిటికీ తలుపుల్లా
అల్లల్లాడుతుంటాయి

నువ్వో కాకపోతే నీవారో
చేసిన తప్పులకు ఆధారం ఆ గతం
ఆ తప్పులు సరిదిద్దుకున్న గొప్పతనమూ
నిక్షిప్తమై ఉంటుంది అందులో
అదేమీ వృధాగా పోయే వరదనీరు లాంటిది కాదు
గతమంటే తవ్వుకుంటే ఊరే జ్ఞాపకాల ఊట 

అమాయకత్వం నుంచి తెలివి వైపు
తెలివి నుంచి మేధావిత్వం వైపు
నువ్వు చేసిన ప్రయాణంలో ముళ్ళు చేసిన గాయాలు
తగిలిన ఎదురుదెబ్బలు
కష్టాలన్నీ భరించి సాగిన నీ మొండితనం/పట్టుదల
అన్నిటినీ ఇముడ్చుకున్న జ్ఞాపిక ఆ గతం

ద్వేషాలూ, యుద్ధాలూ, వివక్షలు మాత్రమే కాదు
గతంలో ప్రేమలూ, బాంధవ్యాలూ
ఆప్యాయతలూ కూడా నిక్షిప్తమై ఉన్నాయి

గతమంటే నాస్తి కాదు నేస్తం అది అనుభవాల ఆస్థి

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...