అంతరంగం ...

వంశీ కలుగోట్ల// అంతరంగం ...//
********************************
ఎందుకలా బాధపడతావు
నీవంటే ప్రేమ లేక కాదు
నీ మీద గౌరవం తగ్గలేదు


అక్షరం పట్టుకుని పోరాడుతున్న మిత్రులను
ఆయుధంతో చంపేస్తున్నాడు శత్రువు

పంచన చేరి
మోచేతికింది నీళ్ళు తాగుతూ
మోస్తున్న తుచ్చులను చూసుకుని
అక్షరాన్ని లెక్క చేయటం లేదు
మదమెక్కిన అధికారం

తోలు మందమెక్కిన అధికారానికి
నిరసన ఎలా తెలిపేది?
 
అడుగుకో ఆశని చంపుకుంటూ
అవతారుడికోసం ఎదురుచూస్తూన్న
మామూలు జనాలకోసం
వెలుగును చీల్చి కిరణాలుగా పంచే ప్రయత్నంలో
అక్షరం అండగా 
పోరు సల్పుతున్న ధీరులను 
అది కల్బుర్గినో లేక ఇంకో తస్లీమానో
వెంటపడి తరుముతుంటే
ప్రాణాలు తీస్తుంటే ఏమి చెయ్యాలి?

నా రాతలతో  వెలుగు పంచానని
పంచగలనని
తిమిరంతో సమరం చెయ్యగల అక్షరాన్ని
నమ్ముకున్నవాడినని చెప్పి
నిన్ను నా దరికి చేర్చారు

బహుమతి అంటే ఏమన్నా బంధనమా
బానిస బతుకు కాదు నీదైనా నాదైనా
నీకు నాకూ ఇద్దరికీ
మకిలి అంటిస్తున్న రాజకీయానికి నిరసనగా
నీతో బంధాన్ని తెంచుకుంటున్నానే కానీ
నీ మీద గౌరవం తగ్గి కాదు

Comments

Popular posts from this blog

నివాళి

విద్యార్థిగానే బతికితీరాలి

గమనం ...