ఊరికే అలా

ఊరికే అలా
***********
తోడు కోసం ఎదురుచూస్తోందని నువ్వు
దారి చూపటానికి ఉందని నేను
ఆ దీపపు స్థంభం గురించి
*          *           *
బయట చినుకుకోసం నే తపించిపోతుంటే
లోపల పోటెత్తిన వరదలా నీ జ్ఞాపకం
ఏమిటో ఈ వైరుధ్యం
*          *           *
గోడకు తగిలించిన పటంలా
నిశ్శబ్దం అలవాటైపోయిన స్మశానంలా
నా లోపలి నేను
*          *           *
సూర్యుడి కంటే ముందు వెలుతురు కోసం
చీకట్లను చీల్చుకు నిద్దురలేచే ఒక మనిషి కోసం
ఎదురు చూస్తున్నారు
*          *           *
విప్లవించే మనిషి కోసం వెతుకుతుంటే
ఎడారిలో మొలిచిన మొక్కలా నువ్వు
దాహార్తిని తీర్చగలవా
*          *           *
నీకోసమని నేను గ్రామం వదిలి వస్తే
నువ్వు దేనికోసమో దేశం వదిలి వెళ్ళావన్నారు
నా అడుగులు ఎప్పుడూ ఆలస్యమేనేమో
*          *           *
విప్లవించితే పోయే ప్రాణం కన్నా
ప్రజాస్వామ్యంలో పదవి విలువ ఎక్కువ అని
తెలుసుకున్నవాడు నాయకుడయ్యాడు
*          *           *
ఊరికే అలా రాద్దామని కూర్చుంటే
ఉరేసుకున్న రైతు గుర్తొచ్చాడు
అక్షరం ఆవేదనైంది
*          *           *
నా రాతలు చదివే వాళ్ళకంటే
నా బొమ్మను చూసేవాళ్ళే ఎక్కువ
దేన్ని నమ్ముకోవాలో
*          *           *

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...