కదనం ...

వంశీ కలుగోట్ల // కదనం ... //
******************************
నాలోనే ఉన్నప్పుడు
నాతోనే ఉన్నప్పుడు
తన అస్తిత్వం
తనతోనే ఉంచుకున్నపుడు
నిప్పు తునకలా
సంధించిన బాణంలా
ఉదయించిన కిరణంలా
పదును పెట్టిన ఆయుధంలా
చురుకుగా ఉండేది

నాలో ఉండిన అలాంటి
ఒక అక్షరానికి
ఊపిరి పోసి
ప్రజల పక్షం నిలబడి
ప్రశ్నించమని పంపితే
ప్రపంచంలో చేరి బతకనేర్చింది
బహుముఖత్వం
అలవాటు చేసుకుంది

ఎప్పుడెవడి పక్కలోకి దూరితే
వాడి తిక్కనంతా తన తలకెత్తుకుని
ఏ జెండా కింద నిలబడితే
ఆ రంగు పులుముకుని
రాజకీయం నేర్చింది
ముసుగేసుకుని
పూటకో మాట మారుస్తూ
కుర్చీనెక్కిన ప్రతివాడికి
బాకా ఊదుతూ
తందాన గుంపులో
తప్పెట మోతలా మిగిలిపోయి
ఆశయాలు మరిచిపోయి
అస్తిత్వం కోల్పోయి
అలా ముందుకు పోతోంది

క్షరము లేదని విర్రవీగి
నివురుగప్పిన అక్షరానికి
పట్టిన పిచ్చిని
పూసుకున్న రంగులను
అంటిన రాజకీయాన్ని
వదిలించి
నిజాన్ని నిర్భయంగా చెప్పి
ప్రశ్నించే పాత నైజాన్ని
పునః ప్రతిష్ట చెయ్యటానికి
సాగుతున్న కదనంలో
అడుగు కలిపి కదులుతున్నా

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...