అస్థిత్వపు బలి ...

వంశీ కలుగోట్ల// అస్థిత్వపు బలి ... //
********************************
మట్టిలో ఏమీ లేదన్నాడు వాడు
అదే నమ్మి అంతా డబ్బులోనే ఉందని
మట్టిని వదిలేసి పరిగెత్తాడు
గమ్యం తెలియక గానుగెద్దులా తిరిగి తిరిగీ
అలసిపోయి వచ్చిన వాడిని
తన ఒడిలో చేర్చుకుని సేద తీర్చింది మట్టి
*
గాలికి చెట్టుకు సంబంధం ఏమీ లేదన్నాడు వాడు
అదే నమ్మి అడవులన్నీ కొట్టేశాడు
ఆధునికత సృష్టించిన కలుషిత వాతావరణంలో
స్వచ్చమైన ఊపిరికోసం
ఆక్సిజన్ గదులు కట్టించుకున్నప్పుడు 
తెలిసింది వాడికి గాలి, చెట్టు విలువ ఏమిటో
*
నీటిలో ఏమీ లేదన్నాడు వాడు
అదే నమ్మి బావులు, కుంటలు, చెరువులు పూడ్చేసి
భవనాలు కట్టాడు
ఎన్ని తూట్లు పొడిచినా భూమిలోంచి చుక్క నీరు రాక
దాహంతో అలమటిస్తున్నాడు ఈరోజు
*
ఆకాశం అంతా శూన్యమే అన్నాడు వాడు
ఫ్యాక్టరీల పొగ గొట్టాలలోంచి వచ్చిన విషవాయువులు
నింగికెగసి పొడిచిన పోట్లు చేసిన రంద్రాల లోంచి
ఓజోన్ పోర చీల్చుకుని వచ్చిన
అతినీలలోహిత కిరణాలు తెచ్చిన రోగాలు తెలిపాయి
ఆకాశపు శూన్యంలో కనిపించని శక్తి ఉందని
*
నిప్పులో ఏమీ లేదన్నాడు వాడు
అణువులోని నిప్పు కార్చిచ్చై
మహానగరాలను కాల్చేసినపుడు కానీ అర్థం కాలేదు
నిప్పులో దాగి ఉన్న శక్తి ఏమిటో
*
ఏదో సాధిద్దామనే ఆత్రంలో
పంచభూతాలని, ప్రకృతిని మరచిన
ఆధునిక ఆదిమ మానవుడు
ఆస్థిత్వాన్ని బలి ఇచ్చుకుంటున్నాడు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...