హీరోస్ ఆర్ ఫాలింగ్ డౌన్ ...
వంశీ కలుగోట్ల// హీరోస్ ఆర్ ఫాలింగ్ డౌన్ ... //
*****************************************************
మాలో ఒకడినవుతానన్నాడు
కన్నీటిబొట్టును అడ్డుకునే ఓదార్పునవుతానన్నాడు
అవకాశం ఇస్తే అండగా ఉంటానన్నాడు
మాకోసం నిలబడే మనిషవుతానన్నాడు
నమ్మామని అనుకున్నాం కానీ
నమ్మకాని అమ్మకపు వస్తువుగా మార్చుకునే
జిత్తులకు చిత్తయ్యామని తెలియలేదు
పిడికెడు మట్టి, చెంబెడు నీళ్ళు ఇచ్చినప్పుడే
తిలోదకాలు వదిలేసుకోవాల్సింది
భుజాలమీద మోస్తున్నానని చెప్పే కాగితం పులి
పెద్దకొడుకులా నేనున్నానంటూ ఆశ కల్పించాడు
తన జుట్టు పక్కోడి చేతిలో ఉందని తెలిశాక
కాళ్ళు పట్టుకోవడమే దిక్కని అర్థమయ్యాక
పైవాడిని పక్కోడిని వదిలేసి
ఎదుటోడి మీద పడి ఏడుస్తున్నాడు
ఇజాల పేరున కోకిల ముసుగేసుకుని
గోడ మీదకెక్కి కూసే కాకి ఉంది ఒకటి
కళ్ళకు ఏ పచ్చ అద్దాలు ఉన్నాయో కానీ
దోపిడీలేవీ కంటికి కనబడుతున్నట్టు లేదు
ఇవ్వాళ జరిగిన దోపిడీకి కూడా బాధ్యత
గత కాలపు మోతుబరీ అంటూ కూస్తుంది
గుంటనక్కకు అవసరమైనప్పుడే
కూత కూయడానికి గోడెక్కుతుంది
అండగా నిలబడతామని
జనాలను ముంచేసిన మహానుభావులే
భవిష్యత్తును అంధకారమయం చేస్తున్న
దృష్టి దొబ్బిన దార్శనిక మేధావులే
కార్పొరేట్ కంపెనీల ముందు
సాగిలపడిన కక్కుర్తిగాళ్ళే
ఎవడెప్పుడెలా మోసగిస్తున్నాడో అర్థం కాక
ఎందులో ప్రస్తావిస్తే హామీలు చట్టాలు అవుతాయో
ఎవరు చెబితే హామీలు అమలవుతాయో
అన్నీ సమాధానం లేని ప్రశ్నలే
నమ్మినందుకు ఏంచెయ్యాలో తెలియక
రేపెలా ఉంటుందోననే భయంతో
మళ్ళీ అయిదేళ్ళ పండగకు వచ్చే
కొత్త మోసగాడికోసం చూస్తూన్నారు జనాలు
Comments
Post a Comment