నాన్న ఎప్పుడూ చెప్పలేదు
వంశీ కలుగోట్ల// నాన్న ఎప్పుడూ చెప్పలేదు //
**********************************************
నాన్న ఎప్పుడూ చెప్పలేదు
కేవలం చూపాడు అంతే
ప్రతీకారం తీర్చుకోవడం అంటే
పగవాడిని పడగొట్టటం కాదు
వాడికంటే మనం పైకెగదటం అని
అవమానమెదురైతే కుమిలిపోనక్కరలేదు
వేచి చూడగలిగితే అవకాశం వస్తుంది
అక్కడే మళ్ళీ మర్యాదలందుతాయి అని
ఊరుమ్మడి దారిలో ఉరకాల్సిన పని లేదు
నీ దారిలో వెళ్ళినా గుర్తింపు వస్తుంది అని
నీ అడుగులు మొదలైనప్పుడు
వీడేం చేస్తాడులే అంటూనే ఉంటారు
నువ్వు పైకెదిగినప్పుడు
'వాడు మనవాడే' అంటారు అని
నాన్న ఎప్పుడూ చెప్పలేదు
కానీ, చెప్పినట్టే అనిపిస్తుంది
'అరేయ్ నేను నేర్పింది పడటం కాదు
పడినప్పుడు లేవటం' అని
Comments
Post a Comment