... భస్మాసురులు

వంశీ కలుగోట్ల // ... భస్మాసురులు //
*******************************
1
పిలవడానికి పచ్చని చెట్టు లేదని
అలిగి వెళ్ళిపోయిన మేఘం వైపు
కొట్టేయబడిన వృక్షాల ఆనవాళ్ళు
ఆశగా చూస్తూనే ఉన్నాయి ఇప్పటికీ

2
మిగిలిపోయిన ఆనవాళ్ళతో వృక్షాలు
బతకలేక వాడిపోయిన మొక్కలు
తమలో తామే విషాదంగా నవ్వుకుంటున్నాయి
భస్మాసురుడి గాధను కథలుగా చెప్పుకుని
దేవుడికి దండం పెట్టుకుంటున్న మనిషిని చూసి
విర్రవీగుతున్న మూర్ఖత్వపు విశ్వరూపాన్ని చూసి

3
పొరలు చీల్చుకుంటూ బయటకొచ్చే దశ నుండీ
ప్రతిక్షణం పరిస్థితులతో పోరాడి నిలబడే విత్తు
మొక్క నుండి మానుగా ఎదిగే పరిణామ క్రమంలో
మనుగడకోసం ఎన్ని యుద్ధాలు చేస్తుందో 

ప్రకృతికి ఎదురొడ్డి నిలబడగలిగింది కానీ
అభివృద్ది సాదిస్తున్నామన్న ముసుగు మాటున
సాగిన, సాగుతున్న మనిషి దాష్టీకానికి మాత్రం
ఎదురు నిలబడటానికి శక్తి సరిపోక
కూలిపోయి కనుమరుగవుతోంది ఆ పచ్చదనం

4
తన మూలాలు కదిలితే కానీ
అర్థం కావట్లేదు ఆధునికుడికి
అభివృద్ది అంటే ఎదిగి నిలబడేలా చేసేదే కానీ
కూల్చి నాశనమయ్యేలా చేసేది కాదు అని

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...