మనిద్దరమూ ...
వంశీ కలుగోట్ల // మనిద్దరమూ ... //
*******************************
నీదో కులం నాదో కులం
ఉదయాన సూర్యుడిని చూసే సందర్భం
మనిద్దరికీ వేరుగా ఉంటుంది
నువ్వు సూర్యుడిని పొలంలో నిలబడి
చెమట చుక్కలు తుడుచుకుంటూ చూస్తావు
అదే నేనైతే నది/వాగు నీటిలో నిలబడి
అర్ఘ్యం వదులుతూ చూస్తాను
నువ్వు వేరు నేను వేరు
కానీ, మనిద్దరి మధ్యా విభేదాలు పెరుగుతున్న
ఈ లోకానికి సూర్యుడొక్కడే
నీ దేవుడు వేరు నా దేవుడు వేరు
నేను స్నానం చేసి నా దేవుడికి దణ్ణం పెడతాను
నీవు స్నానం చేసి నీ దేవుడికి ప్రార్థన చేస్తావు
నా దేవుడు అన్నీ తానై అండ నిలబడతానంటాడు
నీ దేవుడు రక్తం చిందించి నీకోసం పోరాడాడు
నువ్వూ నేనూ ఇంకా మనలాంటి చాలామందీ
దేవుడి గురించి కొట్టుకుంటూ పోతున్నారు
రోజుకో కొత్త దేవుడు పుట్టుకొస్తూనే ఉన్నాడు
నీ దేవుడు వేరు నా దేవుడు వేరు
'ఏకం సత్ విప్రం బహుదా వదంతి'
నీదో ప్రాంతం నాదో ప్రాంతం
నీ ప్రాంతంలో మనుషులు నేలమీద తిరుగుతారు
నా ప్రాంతంలో మనుషులు కూడా నేలమీదే నడుస్తారు
నీ ప్రాంతంలో దేవుడా అంటారు
నా ప్రాంతంలో భగవంతుడా అంటారు
అక్కడా మనుషులు చస్తున్నారు
ఇక్కడా మనుషులు చస్తున్నారు
చంపడానికి నువ్వో నేనో పుట్టాల్సిన పనే లేదు
చావు ఎప్పుడో నిర్ణయమైపోయింది
పుట్టుకకే ఒక కారణమంటూ ఉంటుంది
నువ్వు వేరు నేను వేరు
మనిద్దరమూ ఎప్పటికీ ఒక్కటి కాదు
నువ్వు తక్కువ కాదు, నేను ఎక్కువా కాదు
ఇద్దరం వేరు వేరు అంతే
ఇరువైపులా ఇరుసును మోస్తున్న చక్రాలం
Comments
Post a Comment