Posts

ఒక ప్రయాణం ...

వంశీ కలుగోట్ల// ఒక ప్రయాణం ... // ****************************** ****** తడబడుతున్నా నిలబడుతూ నిలకడగా తప్పటడుగులు వేసుకుంటూ ఎదిగిన మనిషిగా పయనం సాగిస్తున్నా  నేనున్న చీకటిలోంచి మరింకెక్కడో వెలుగుందనే నమ్మకంతో ప్రవహించే నదిలా పల్లం వైపు పారిపోతున్నా పతనమో లేకపోతే పరిణామక్రమమో అర్థం కాకపోయినా అడుగు అడుగుకూ చీకట్లు ముసురుకొస్తూంటే అర్ధమనస్కపు సంకల్పంతో సంధికాలపు సంధ్య వెలుగుల కోసమై పల్లం వైపు పరిగెడుతున్నా బతుక్కూ చావుకూ మద్య మిగిలున్న మానవత్వాన్ని అనుభవించి దోసెడు నవ్వులనూ పిడికెడు జీవితాన్నీ సంచీలో నింపుకు వెళదామని ప్రయత్నంలో అగాథంలోకో శిఖరం మీదకో అర్థం కాకపోయినా పరిగెడుతూనే ఉన్నా అనేకుడిగా విడిపోయిన నేను పునరేకీకృతం కావాలనే ప్రయత్నంలో చీకటిలోంచో లేక చీకటిలోకో అర్థం కాని అయోమయపు ప్రయాణం

గొర్రెలమంద ...

వంశీ కలుగోట్ల// గొర్రెలమంద ... // ****************************** కుందేటి కొమ్ము సాధించాలని కుక్కను కుర్చీమీద కూచోబెట్టాలని గుర్రానికి రెక్కలు మొలిపించాలని నిజాన్ని నిజమని మేధావులచేత ఒప్పించాలని ఎందుకురా అలవికాని కోరికలతో కాడి భుజాన వేసుకొని బయల్దేరతావు  ఒరేయ్   మాన్యుడననుకునే సామాన్యుడా  ఏమి జరిగినా అన్నీ మూసుక్కూచోక  గొంతెత్తాలానే యత్నమెందుకురా  ఏబ్రాసి యెదవన్నర యెదవా  నీ పనేదో నీవు చూసుకోక ... యాడికి బోతావురా నువ్ యాడ తిరిగినా ఎన్నికల యాలకి నిన్ను నీ మందను పోలింగ్ బూత్ కాడికి తోలుకోస్తాననే నమ్మకం ఉన్నోడే నాయకుడు నీ బతుకు నీది అనుకుంటున్నావేమో వాడు పెట్టే గడ్డికి ఆశపడి ఎప్పుడో మందలో కలిసి వాడి ఆస్థివైపోయావు కులమో, మతమో, ప్రాంతమో - దడి ఏదైతేనేం నువ్వు దాటిపోకుండా ఆపి ఉంచటానికి అయినా నువ్వు ఎదురు చూడాల్సింది ఇంకా ఎంత గడ్డి పెడతాడు అని కాదు వీడే కోసుకుతింటాడా లేకపోతే కసాయివాడికి అమ్ముతాడా అని అంతకు మించి నువ్వేమీ చెయ్యలేవు

జ్ఞాని ...

వంశీ కలుగోట్ల// జ్ఞాని ... // *************************** 1 చెడ్డీలేసుకునే రోజుల్లో నా చేతిలో ఉండే గోళీలకు గుడిలో ఉండే దేవుడికి సంబంధమేంటో తెలీదు కానీ గోళీలాట ఆడేముందు 'జై భజరంగభళీ' అనో మరింకే దేవుడినో తలచుకుని మొదలెట్టేవాడిని    బొంగరాల ఆట అయినా చిల్లా గోడే అయినా మరింకే ఆట అయినా సరే చీకట్లో పక్క గదిలోకి వెళ్ళాలన్నా లోలోపల దేవుడిని తలచుకుంటే అండ ఉంటాడనే నమ్మకం ఉండేది 2 మారుతున్న కాలంతో పాటు మనుగడ కోసం పోరాటంలో ఎదుగుదల తప్పనిసరైంది  ఎదుగుతూ వస్తోన్న కొద్దీ సంకల్పాన్ని మించిన భక్తి లేదని నన్ను/మనిషిని మించిన దేవుడు లేడని కొత్తగా తెలుసుకుంటూ పెరుగుతున్న తెలివితేటలతో జ్ఞానినై స్వతంత్రుడనయ్యాను 3 రద్దీ వల్ల ఆఫీసుకు ఆలస్యమైనప్పుడు రోడ్డు మీద పశువు అడ్డం వచ్చినప్పుడు టీవీలో వార్తలు చూసేటప్పుడూ నా వల్ల కాదనిపించిన ప్రతి సందర్భంలోనూ 'ఈ సమాజాన్ని ఆ దేవుడే మార్చాలి' అనుకుంటూ నేను లేడని అనుకున్న దేవుడిని మళ్ళీ ఒకసారి గుర్తుకు చేసుకుంటూంటాను

పిపీలికాలు ...

వంశీ కలుగోట్ల// పిపీలికాలు ... // ************************************* 1 బహుశా ఇంతేనేమో  మనిషంటే ఒక పిపీలికమేనేమో  'ఎవరికీ పనికిరాని పిడికెడు ధూళిని' అన్న గాలిబ్ మాటకి అర్థమేనేమో  2 ఏదో ఒకరోజుకి  గాలిలో కలిసిపోయే బూడిద కాకుండా  జనాల్లో మిగిలిపోయే స్ఫూర్తిగా  మిగిలిపోయిన మహానుభావులలాగా  మనిషిగా కనీస బాధ్యతలు  నెరవేర్చాలని అనుకునేదెందరు 3 చిన్న చిన్న కోపాలకు  పనికిరాని పంతాలకు  అక్కరకు రాని అంతరాలకు  జీవితాలని అంతం చేసుకుంటూ  పిపీలికమై ఎగిరిపోతున్న  చేతకాని కాగితం పులులకు  కొవ్వొత్తుల వెలుగుల్లో వందనం  ఆవేశాన్ని అణచుకోలేక  ఓటమికి కారణం తెలుసుకొని  దారి మలచుకోలేక  ఎప్పుడో ఒకప్పుడు తప్పని మరణాన్ని  బలవంతంగా కౌగలించుకున్న  ధైర్యం ఉన్న పిరికివాళ్ళు  నడిపించే నాయకులు  వెలుతురు పంచే దివిటీలు ఎలా అవుతారో అర్థం కావట్లేదు 

చావు పండగలు ...

వంశీ కలుగోట్ల// చావు పండగలు ...// ****************************** ************ అసలు రాతలు రాసిందే  చావులు ఆగాలని అయితే  ఎన్ని చావులకని  స్పందిస్తూ ఉండను  చచ్చే జనాలు అందరూ  ఏదో ఒక ఎన్నికలప్పుడో  ఎవడో ఒక నాయకుడు చచ్చినప్పుడో చస్తే  పరామర్శలూ ఓదార్పు యాత్రలూ ఎన్నో  రాజకీయాలకు చావులూ పండగలే  నీ చావు నీది మాత్రమే కాక  సంచలనం కావాలంటే  దేవుడిని అడుక్కునో, బలవంతంగానో  ఆ చావేదో ఎన్నికలప్పుడే చావు  లేదంటే నాయకుడితో పాటు చావు 

కొన్ని అక్షరాలు ...

వంశీ కలుగోట్ల// కొన్ని అక్షరాలు ... // ****************************** **************** 1 నేను చూసివచ్చిన జీవితంలోంచి  ఏరుకున్న జ్ఞాపకాలను  అక్షరాలుగా మలచి కథలో కవితలో  రాద్దామని అనుకుంటూంటాను  దిక్కు తోచని పరిస్థితుల్లో  బలవన్మరణానికి పాల్పడుతున్న  రైతో, భావి పౌరుడో, బలహీనుడో  ఎవడో ఒకడి గురించిన వార్త ప్రతి ఉదయం నిద్దుర లేపుతుంటే  అవి అన్నీ పాత జ్ఞాపకాలను పాతరేసి  భావావేశాన్ని తట్టి లేపితే  ఆలోచనలు పక్కదారి ఎలా పడతాయి  ఏమేమో చెయ్యాలని అనుకుని  ఏమీ చెయ్యలేక బతుకుబండి లాగేస్తూ  జరుగుతున్నవి చూస్తోంటే  ఏమిటీ వైపరీత్యం అనుకుని  వదిలేసుకుని వదిలించుకుని వెళ్ళే  దారినపోయే దానయ్యలలో కలిసిపోవాలా  2 ఎన్ని సార్లు ఎంతమంది రాసినా  ఇంకా రాసి సాధించేది ఏముంది  రైతుల ఆత్మహత్యలు  ఇవ్వాళ మొదలైనవీ కావు  ఈ రాతలతో ఆగేవీ కావు  ఇంకేమీ సమస్యలే లేనట్టు  అక్కడికి నువ్వేదో కాడి పట్టి  అరక దున్ని వ్యవసాయం చేసినట్టు  ప్రశ్నలు కుమ్మరించే ...

ఒక మనిషి పోయాడు ...

వంశీ కలుగోట్ల// ఒక మనిషి పోయాడు ... // ****************************** *********** మామూలు మరణమో బలవన్మరణమో కానీ ఒకడు చనిపోయాడు 'ఒక మనిషి పోయాడు' అని యే ఒక్కరైనా అంటారేమోనని పరలోక ప్రయాణం ఆపుకుని మరీ పోయిన వాడి ఆత్మ ఆసక్తిగా ఆశతో ఎదురు చూస్తోంది మతానికొకడు పార్టీకొకడు వచ్చి పోయినవాడు ఏదో ఒక మతం వాడో మరింకేదో వర్గం వాడో అని రాజకీయం చేస్తున్నారు తప్ప పోయింది మనిషి అని గుర్తించట్లేదు  ఉరితాడు మెడకు బిగుసుకున్నప్పుడు కాదు మనిషిగా గుర్తించలేదు అని మళ్ళీ చచ్చేదారి లేక పోయింది ఒక మతంవాడో ఒక రాజకీయ వర్గం వాడో కాదు 'ఒక మనిషి పోయాడు' అని గొంతెత్తి అరిచి చెప్పాలనున్నా ఎవరికీ వినబడదని తెలిసి బాధతో విలవిల్లాడుతోంది ఆత్మ