... గాయాలు

వంశీ కలుగోట్ల // ... గాయాలు //
*******************************
కొన్ని గాయాలు
గుర్తులుగా మిగిలిపోతుంటాయి 

నడక నేర్చుకునేటప్పుడో
అడుగులు తడబడినప్పుడో
నడవడిక సరిగా లేకనో
గాయాలు అవుతుంటాయి
అవి గుర్తులుగా మిగిలిపోతాయి
*            *            *
కొన్ని గాయాలు
వెంటాడుతూనే ఉంటాయి 

కాలం మరచిపోతుందేమో
కానీ, హృదయం మరచిపోలేని
గాయాలు కొన్నుంటాయి
ప్రేమ ఓడిపోయో
బంధం విడిపోయో
స్నేహం మాటున ద్రోహమో
హృదయానికి తగిలే గాయాలు
వెంటాడుతూనే ఉంటాయి ఎప్పటికీ
*            *            *
కొన్ని గాయాలు
గేయాలవుతుంటాయి 

ఒక్కొక్కడు ఒక్కో రకం
పక్కోడికి దెబ్బ తగిలినా
పువ్వు నలిపేయబడినా
ప్రపంచం బాధని తమ బాధలా
భావించే భావుకులుంటారు
బాధను అనుభవిస్తూ
గేయాలు స్రవిస్తుంటారు
*            *            *
కొన్ని గాయాలు
విప్లవాలవుతుంటాయి 

బంధించి కొడితే
పిల్లి పులి అవుతుందో లేదో
అణచివేయాలని చూస్తే
కడుపు మండినోడు మాత్రం
తిరుగుబాటు చేస్తాడు
వాడి గాయం
విప్లవాన్ని సృష్టిస్తుంది

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

మా ఊరి బస్సు ...